వైట్‌హౌస్‌ అధికారులకు ఇరాన్‌ హెచ్చరిక | Iran Issues Warning After US-Israel Strikes On Universities, Threatens Retaliation Against Affiliated Institutions | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ అధికారులకు ఇరాన్‌ హెచ్చరిక

Mar 29 2026 9:26 AM | Updated on Mar 29 2026 11:45 AM

Iran Warn White House Officials Over University Attacks

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను టార్గెట్‌ చేసిన యూఎస్‌ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్‌లోని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్​ కార్ప్స్​ (ఐఆర్‌జీసీ) తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ విద్యాసంస్థలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ అనుబంధ విశ్వవిద్యాలయాలు సరైన లక్ష్యాలు అవుతాయని వార్నింగ్‌ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఐఆర్‌జీసీ స్పందిస్తూ.. ఇరాన్‌లో యూనివర్సిటీలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులను ఖండిస్తున్నాం. దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా-ఇజ్రాయెల్ యూనివర్సిటీలు మా లక్ష్యాలుగా మారతాయి. వైట్‌హౌస్‌లోని నిర్లక్ష్య పాలకులు ఈ విషయం తెలుసుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలు అన్ని లక్ష్యాలుగా పరిగణిస్తామని పేర్కొంది. ప్రతీకార చర్యలలో భాగంగా రెండు యూనివర్సిటీలను ధ్వంసం చేయవచ్చని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది, సమీప నివాసితులు ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలని తెలిపింది. ఆ విద్యా సంస్థలపై ప్రతీకార చర్యలు ఉండకూదని కోరుకుంటే అమెరికా ప్రభుత్వం సోమవారం (మార్చి 30) మధ్యాహ్నం లోపు ఇరాన్ విశ్వవిద్యాలయాలపై జరిగిన దాడులను అధికారికంగా ఖండించాలని తెలిపింది.

మరోవైపు.. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ బఖాయి కూడా అమెరికా-ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, చారిత్రక కట్టడాలు లక్ష్యంగా మారాయి. శాస్త్రవేత్తలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇరాన్ శాస్త్రీయ వ్యవస్థను దెబ్బతీయడానికే చేస్తున్న ప్రయత్నం అని ఆయన ఆరోపించారు. అలాగే, ఇజ్రాయెల్ తన సైన్యంలో ఉన్న బలహీనతలను దాచిపెట్టేందుకు ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఇరాన్ పరిశ్రమలపై దాడులు చేస్తున్నారని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement