నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది! | Sakshi Editorial On Chandrababu govt Negligence of road accidents | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది!

Mar 27 2026 1:16 AM | Updated on Mar 27 2026 1:16 AM

Sakshi Editorial On Chandrababu govt Negligence of road accidents

రోడ్డు ప్రమాదాలను నివారిస్తామనీ, సురక్షిత ప్రయాణానికి అనువైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం చెప్పే కబుర్లు ఉత్త గాలి మాటలేనని ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామ సమీపంలో గురువారం వేకువజామున 5.40 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో జరిగిన ఈ విషాదంలో 14 మంది చనిపోగా, మరో 20 మంది వరకూ గాయపడ్డారని చెబుతున్నారు. 

మరికొంతసేపట్లో గమ్యస్థానం చేరతామని ప్రయాణికులు అనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా పరుగులెత్తే ప్రైవేటు బస్సులను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆ వాహనాలకు ఫిట్‌నెస్‌ ఉందా? నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్సుందా? రహదారి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సంగతులులేవీ వారికి అక్కరలేదు. 

వాహనం సక్రమంగా లేదని బస్సెక్కినప్పటి నుంచి తాము చెబుతూనే వచ్చామనీ, చివరకు స్టీరింగ్‌ మొండికేయటంతో ప్రమాదం జరిగిందనీ ప్రయాణికులంటున్న మాట! ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ఒక్క అధికారి బస్సును గమనించలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.

దాదాపు రెండేళ్లనుంచి హింస, దౌర్జన్యాలు, అక్రమ కేసులు మినహా ఏపీలో మరేదీ సక్రమంగా చేయడం రాని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం ఎంతటిదో ఈ ప్రమాదం తేటతెల్లం చేసింది. ప్రమాదం జరిగాక ఏదోరకంగా బయటపడిన ప్రయాణికులు తేరు కోవటానికే కొంత సమయం పట్టింది. ఆ తర్వాత 108 వాహనానికి డజనుసార్లకు పైగా ఫోన్‌ చేస్తే గానీ ఎవరి నుంచీ స్పందన లేదు. వేకువజాము వేళకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు వేగంగా వస్తుంటాయి. 

ఆ సమయంలో భారీ వాహనాలు సైతం అదే రహదారిపై వెళ్లటం ప్రమాదాలకు దారి తీయదా? ముఖ్యంగా క్వారీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయటం, వేగాన్ని నియంత్రించటం కోసం స్పీడ్‌గన్‌ల నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రమాదకరమైన మలుపులున్నచోట చాలా ముందుగానే హెచ్చరిక బోర్డులు అమర్చాలి. ఏవీ సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలుగా భావించ గలమా?  

క్వారీ వాహనాలు ట్రాఫిక్‌ అధికంగా ఉండే సమయంలో జాతీయ రహదార్లపైకి రాకుండా కట్టడి విధించే నిబంధనలున్నాయి. క్వారీలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే పని చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అంత వేకువజామున భారీ లోడ్‌ వాహనం ఎలా వచ్చింది? అంటే రాత్రంతా అక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు జరిగాయన్న మాట! స్థానికంగా జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధి కారులంతా ఉంటారు. 

కానీ ఏం లాభం? జిల్లాల పరిధి పెద్దగా ఉంటే పర్యవేక్షణ కష్ట మవుతుందని భావించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నదో క్షణంలో తెలిసే టెక్నాలజీ వాడుతున్నా నని ఆయన స్వోత్కర్షలకు పోతుంటారు. కానీ ఈ లోటుపాట్ల విషయం మాత్రం ఆయనకు తెలియదు! 

వైద్యవిద్యలో పేదవర్గాల పిల్లలకు అవకాశాలు రావాలనీ, అదే సమయంలో ప్రజ లకు మెరుగైన, ప్రామాణికమైన వైద్య సదుపాయాలు అందాలనీ భావించి జగన్‌ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్‌ కళాశాలల్లో మార్కాపురం కాలేజీ కూడా ఒకటి. అందులో ఏడెనిమిది కాలేజీలు ప్రారంభం కాగా, తుది దశలో వున్న వాటిలో మార్కాపురం కాలేజీ కూడా ఉంది. ఈలోగా కూటమి సర్కారు వచ్చిపడి దాన్ని కాస్తా పక్కన పెట్టింది. 

పర్యవసానంగా జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు రాలేదు. అది అందుబాటులోకి వచ్చివుంటే బస్సు ప్రమాదం బారినపడిన వారిలో మరికొందరి ప్రాణాలు నిలబడేవి. తమ నిర్వాకంతో బాధిత కుటుంబాలకు చేసిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన పరిహారం రూ. 5 లక్షలు ఏ మూలకు? ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం ఇంతమంది మరణానికి దారి తీశాయని బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement