జనతంత్రం
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్‌ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?
హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్‌పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు.
గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్‌గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.
పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్‌ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై హఠాత్తుగా ఇజ్రాయె ల్‌తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.
ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్‌ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్‌కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?
1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్‌లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్‌లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.
భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది.
అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్‌ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్‌లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.
డాలర్‌కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది.
ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!
విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.
పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్‌లో పెనుమంటలు చెలరేగవచ్చు.
దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.
ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.
ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్‌కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.
రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు.
గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్‌తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.
ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్‌లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.
కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది.
ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్‌కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


