చక్రభ్రమణం | Sakshi Editorial On Human Circular motion | Sakshi
Sakshi News home page

చక్రభ్రమణం

May 11 2026 12:26 AM | Updated on May 11 2026 12:26 AM

Sakshi Editorial On Human Circular motion

ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ... ఓహ్, ఆశకెన్ని రూపాలో! అవన్నీ మనిషిలోనే ఉన్నాయి, మనిషిని శాసిస్తూనే ఉన్నాయి; మనిషి చరిత్రను కొత్త మలుపు తిప్పుతూనే ఉన్నాయి. మనిషిలోని దురాశ హఠాత్తుగా యుద్ధవిధ్వంసాలవైపు నడిపిస్తుంది; అదే మనిషిని తిరిగి నిరాశ ఆవహిస్తుంది, అందులోంచి మళ్ళీ ఆశ మొలకెత్తుతుంది. ఇలా ఆశ,నిరాశ, దురాశ, అత్యాశల చక్రం తిరుగుతూనే ఉంటుంది. తన నిరాశను, ఆశతో జయించే ప్రయత్నంలో ఆ నిరాశకు కారణమైన వ్యక్తిని కడతేర్చడం, తిరిగి అవతలి పక్షాన్ని నిరాశ లోకి నెడుతుంది. ఏ యుద్ధంలోనైనా జరిగేది అదే. ఒకరి ఆశ, ఇంకొకరికి నిరాశ! సీతను కోల్పోయి శోకంలో మునిగిన అంతటి రామునిలోనూ ఆశాభావం నింపే బాధ్యతను తమ్ముడు లక్ష్మణుడు తీసుకున్నాడు. ‘ఉత్సాహమే బలం, ఉత్సాహవంతుడికి లోకంలో సాధించలేనిదేమీలే’ దన్నాడు. అలా మేలుకున్న ఆశతో రాముడు సాధించిన విజయం, అవతల మండోదరితో సహా రావణుని పరివారం మొత్తాన్ని శోక, నిరాశల్లో ముంచింది. అంతిమంగా జరిగింది, శోకనైరాశ్యాలు చోటు మారడమే. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందీ అదే. అయితే, తన ఆశావిజయం ధర్మరాజు శేషజీవితాన్ని శోకమయం చేసింది తప్ప ఊరటనివ్వలేదని, అదే మహాభారతం చెబుతోంది. 

రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన జీవనకల్లోలం మహాకవి శ్రీశ్రీని నిరాశలోకి తోసింది; ‘నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా/మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా/దారుణద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా/ బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా’ అన్న సందేహాల సందోహంలోకి నెట్టింది; ‘బతుకు వృథా, చదువు వృథా, కవిత వృథా; లేదు సుఖం, చేదువిషం జీవఫలం’ అంటూ ‘చేదుపాట’ పాడించింది. అంతలోనే ఆశ పుంజుకుని మరో ప్రపంచ మహావిష్కారం దిశగా మరో ప్రస్థానం ప్రారంభించింది. తొమ్మిది దశాబ్దాలు కావస్తున్నా, ఆ మరోప్రస్థాన గమ్యం చూపు మేరలో లేదు. జీవఫలం చేదువిషం నింపుతూనే ఉంది; దురాశ వికటించి మనిషి ప్రపంచాన్ని యుద్ధవిలయాలవైపు నడిపిస్తూనే ఉన్నాడు. ‘కాలం బందీ అయి నెత్తురోడే/ కాలం కాని ఈ కాలాల్లో కొంచెం వేచి ఉండు/ ఈ మురుగు ప్రవాహాన్ని ఇప్పుడే ఆపలేవు/ నెమ్మదిగా, నిశ్శబ్దంగా, సహనంగా/ రహస్యంగా, ధైర్యంగా, నమ్మకంగా/ మిగిలి ఉండు, వేచి ఉండు/ తప్పులను లెక్కించి లెక్కించి/ వెక్కి వెక్కి ఏడ్చి ఏమి లాభం/లే, చావులేని నూతన స్వప్నాన్ని పిలువు’ (విమల) అంటూ, ఊపిరి కడంటుతున్న ఆశకు శ్వాసపోసే కవియత్నం ఇప్పటికీ నిరవధికమవుతూనే ఉంది. 

ఆశల కాగడా పుచ్చుకుని నైరాశ్యపు చీకటిని తరించడానికి మనిషి స్థలకాలాలకు అతీతంగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కవి, కథకులెందరో అక్షరాల నేలలో ఆశల సేద్యం చేస్తూనే ఉన్నారు. ఓ.హెన్రీ ‘చివరి ఆకు’ కథ గుర్తుందా! ఓ దారుణ శీతర్తువులో తీవ్రంగా జబ్బుపడిన జాన్సీ అనే ఒక యువచిత్రకారిణి తన గది కిటికీ లోంచి ఓ గోడమీద పాకిన లతనే చూస్తూ, రోజురోజుకూ రాలిపోయే దాని ఆకులతో తన రోజుల్ని ముడిపెట్టుకుని ఆందోళన చెందుతుంది. చివరికి ఒక్క ఆకు మాత్రమే మిగులుతుంది. అంతలో పెద్ద గాలివాన వచ్చి వెలుస్తుంది. ఆశ్చర్యం, మరునాడు చూసేసరికి ఆకు అలాగే ఉంటుంది; దాంతో ఆమె జీవనోత్సాహాన్ని పుంజుకుంటుంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, బెయిర్మన్‌ అనే ఓ వృద్ధ కళాకారుడు, జాన్సీలో జీవితాశ రగిలించే బాధ్యతను మీద వేసుకుని ఆ గోడమీద వాస్తవికత ఉట్టిపడే ఒక ఆకుబొమ్మ చిత్రిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను గాలివాన ప్రభావానికి గురై జబ్బుపడి మరణించడం– కథ తిరిగిన ఓ విషాదకరమైన మలుపు.     
        
మోడువారిన చెట్లు చిగురించడం; వసంతం వెంటే గ్రీష్మం అడుగుపెట్టడం చూపించి ఆశ, నిరాశల చక్రభ్రమణం ప్రకృతిలోనే ఉందికదా, మనిషి ఎంత అనవచ్చు. కానీ ఎన్ని రంగాలలో మనిషి ప్రకృతిపై జయకేతనం ఎగురవేయడం లేదు! ఈ చక్రభ్రమణాన్ని ఛేదించలేడా? రేపటికి వాయిదా వేయకుండా ఈ రోజే ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఆశావహం చేయలేడా?! 

Advertisement
 
Advertisement
Advertisement