చమురు ధర దిగొచ్చేదెలా? | Sakshi Editorial On Oil prices | Sakshi
Sakshi News home page

చమురు ధర దిగొచ్చేదెలా?

May 26 2026 12:25 AM | Updated on May 26 2026 12:25 AM

Sakshi Editorial On Oil prices

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏం చెప్పినా హార్మూజ్‌ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్‌కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. 

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్‌ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్‌ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్‌ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్‌ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్‌ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్‌ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. 

మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్‌ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.

ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.

ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. 

Advertisement
 
Advertisement
Advertisement