ఆత్మస్తుతి – పరనింద | Sakshi Editorial On Chandrababu Govt TDP Mahanadu | Sakshi
Sakshi News home page

ఆత్మస్తుతి – పరనింద

May 29 2026 12:46 AM | Updated on May 29 2026 12:46 AM

Sakshi Editorial On Chandrababu Govt TDP Mahanadu

పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నా, వారిని కార్యసాధన దిశగా ఉరక లెత్తించాలన్నా, ఉత్సాహపరచాలన్నా అధినేతకు ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, తన కార్యాచరణపై స్పష్టత. అది రాజ్యమేలే పార్టీ అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఆ పార్టీ ప్రభుత్వం అప్పటికే ప్రజల అభ్యున్నతికోసం చాలా చేసివుండాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనూ, ఇప్పుడూ దేన్నీ సక్రమంగా చేసిన చరిత్ర లేదు. విశ్వసనీయత మొదటికే లేదు. అందుకే రెండురోజుల ‘హైబ్రిడ్‌’ మహానాడును ప్రారంభిస్తూ బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా పరనింద, స్వోత్కర్ష దండిగా ఉన్నాయి. చేసిందేమీ లేదు గనుక... చెప్పుకోవడానికేమీ మిగల్లేదు మరి! గత ఎన్నికలకు ముందు భారీ వాణిజ్య ప్రకటనలతో, ఎస్‌ఎంఎస్‌లతో, ఊరూరా ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొట్టారు! సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ ఊరించారు. సంతకాలతో బాండ్లు రాసిచ్చారు. తీరా అమలుదగ్గరకొచ్చేసరికి అలవాటు ప్రకారం దగా చేశారు. ఆడబిడ్డ నిధి పేరిట ఆడవాళ్లందరికీ నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తామన్నారు. 

ఈ రెండేళ్లలో ఆ పద్దుకింద ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 36,000. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 ఇస్తామన్న హామీ కింద ఇంతవరకూ ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 72,000. ఈ రెండు పథకాలకూ గుండుసున్నా చుట్టగా... మిగిలినవి అరకొరగా అమలు చేస్తూ వంచిస్తున్నారు. యాభైయ్యేళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తామని వాగ్దానమిచ్చి, వైఎస్‌ జగన్‌ హయాంలో ఉన్న పింఛన్‌దార్లు 66,34,372 మందిలో 6,23,079 మందికి ఎగనామం పెట్టారు. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరికి బకాయిపడ్డ మొత్తం రూ. 96,000. మహిళల కోసం తీసుకొస్తామన్న ఉచిత బస్సు పథకాన్ని తాత్సారం చేయటమేకాక, 16 కేటగిరీ బస్సుల్లో కేవలం అయిదింటికే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్‌ బస్సులే ఉంటాయని చెబుతున్న నోటితోనే వాటిల్లో ఉచితం ఉండబోదని సెలవిస్తున్నారు. 

అంతేకాదు... ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఆపై 20 లక్షల మందికి కోతపెట్టి అమలు ప్రారంభించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోరకం మొత్తం వేస్తూ మోసగిస్తున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూనే తొలి ఏడాది మొండిచేయి చూపారు. రెండోఏడాది 53.52 లక్షలమంది రైతుల్లో 7 లక్షలమందికి కోతపెట్టి అరకొరగా అమలుచేశారు. రెండేళ్లకూ రూ. 40,000 ఇవ్వాల్సి వుండగా, రూ. 14,000తో సరిపెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వగైరాలన్నీ ధ్వంసం చేశారు. జగన్‌ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పర్యవసానంగా వస్తున్న సంస్థలను తమ ఖాతాలో వేసుకోవటం, ఉన్నవాటిని తరిమే యటం బాబు ‘పారిశ్రామిక విధానం’!  

ఇన్ని లొసుగులుండబట్టే మహానాడును ‘హైబ్రిడ్‌’ చేశారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల పొదుపు పాటించదల్చుకుని ఈ మోడల్‌ తీసుకొచ్చామని పైకంటున్నా... కార్య కర్తలను ఒకచోట పోగేస్తే, తమ గంభీరోపన్యాసాలు విని ఊరుకోక క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో, జనం ఎలా ఛీకొడుతున్నారో ఏకరువుపెట్టే ప్రమాదం ఉందని గ్రహించటంవల్లే ఈ ఎత్తుగడ! కానీ తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షలమంది వర్చువల్‌గా పాల్గొన్నారని టీడీపీ గప్పాలు కొట్టుకుంటుండగా చాలాచోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చి ఆ పార్టీ వాలకమేమిటో బట్టబయలైంది. నియోజకవర్గానికి 7 నుంచి 10 కేంద్రాల్లో దీన్ని నిర్వహించటంవల్ల స్థానిక నేతలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 15 లక్షలు చేతిచమురు మాత్రం వదిలింది.  

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కోటా మరో పెద్ద దగా. జగన్‌ హయాంలో ‘అమ్మ ఒడి’ మొదలుకొని ఉద్యోగాలవరకూ... పంచాయతీరాజ్‌ సంస్థలు మొదలుకొని నామినేషన్‌ పనుల వరకూ అన్నిటా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చిన వైనం తండ్రీ కొడుకులు మరిచివుంటారు. నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గాలి మాటలతో, వెన్నుపోట్లతో, రెడ్‌బుక్‌ పాలనతో, హద్దులెరుగని దూషణలతో బాబు సాధించేదేమీ ఉండదు. పేలవంగా ముగిసిన వర్చువల్‌ మహానాడు దీన్నే చాటుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement