సాహిత్యమూ శాస్త్రమూ | Sakshi Editorial On Literature and science | Sakshi
Sakshi News home page

సాహిత్యమూ శాస్త్రమూ

May 25 2026 6:06 AM | Updated on May 25 2026 6:06 AM

Sakshi Editorial On Literature and science

‘సహితస్య భావః సాహిత్యం’ అని సాహిత్యానికి నిర్వచనం. శబ్దార్థాల సుందర సమన్వ యమే సాహిత్యం. ‘శాసనాత్‌ శాస్త్రం’ అని శాస్త్రానికి నిర్వచనం. శాస్త్రం – ఏదైనా విషయాన్ని బోధించి, నియంత్రించి, మార్గనిర్దేశం చేస్తుంది. సాహిత్యం మనసును తీర్చిదిద్దు తుంది. శాస్త్రం మేధస్సుకు పదును పెడుతుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర పూరకాలు.  ‘సాహిత్యం, సీతాకోక చిలుకలు– ఈ రెండు మాత్రమే మనిషికి తెలిసిన తీయని అభిరుచులు’ అన్నాడు రష్యన్‌– అమెరికన్‌ రచయిత వ్లాదిమిర్‌ నబొకోవ్‌. సాహిత్యాన్నీ, సీతాకోక చిలుకలనూ ఒకే గాటన కట్టాడంటే, అతడికి ఎంతటి సౌందర్యాభిరుచి ఉండి ఉండాలి?! సాహిత్యాన్ని యాంత్రికంగా చదవడం, సాహిత్యంలోని సమస్త ప్రక్రియలను అధ్యయనం చేయడం, సాహిత్యాన్ని గురించి అనర్గళంగా ఉపన్యాసాలు చేయడం మాత్రమే చాలదు; సాహిత్యాన్ని ఆస్వాదించగలిగే లక్షణం కూడా ఉండాలి. అదే లేకపోతే, ఎంత సాహిత్యం చదివినా దండగే! సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పండిత ప్రకాండుల్లో చాలామందికి సాహిత్యాన్ని ఆస్వాదించడం చేతకాదు. అలాంటి వారిని ఉద్దేశించే, ‘అతనికి సాహిత్యం గురించి సమస్తం తెలుసు, సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలో తప్ప’ అని చెణుకు విసిరాడు అమెరికన్‌ రచయిత జోసెఫ్‌ కెల్లర్‌. 

సాహిత్యం మనోవ్యాపారం. సాహిత్యం మనిషికి విలువలు నేర్పుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. జీవితం పట్ల అవగాహన పెంచుతుంది. సాహిత్యం వల్ల భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగు తాయి. శాస్త్రం బుద్ధివ్యాపారం. శాస్త్రం మనిషికి తార్కికత నేర్పుతుంది. వాస్తవికతను నేర్పుతుంది. ప్రయోగాత్మక దృక్పథాన్ని అలవరుస్తుంది. సాంకేతిక పురోగతికి పునాదులు వేస్తుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర ప్రేరకాలు కూడా!

ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలిస్తే, సాహిత్యం శాస్త్ర పురోగతికి ప్రేరణ కలిగించిన ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనిషి స్వేచ్ఛాపిపాసి. మనిషి ఊహలకు రెక్క లొచ్చి, ఆకాశం అంచుల వరకు విహరిస్తాయి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరించడానికి మనిషికి రెక్కలుంటే బాగుండు, కనీసం రెక్కల వాహనం ఏదైనా అందుబాటులో ఉండే బాగుండు అనే ఆలోచనలు పురాణకాలం నుంచే ఉన్నాయి. రామాయణంలోని పుష్పక విమానం మనకు తెలిసినదే! గ్రీకు పురాణాల్లో డెడలస్‌ అనే శిల్పి, అతడి కొడుకు ఇకారస్‌ దురదృష్టవశాత్తు చెరసాల పాలవుతారు. 

బందిఖానా నుంచి తనతో పాటు తన కొడుకును తప్పించడానికి డెడలస్‌ పక్షి ఈకలు, తేనెటీగల మైనం ఉపయోగించి మనిషి తొడుక్కోగల రెక్కలు తయారు చేస్తాడు. పురాణకాలం నాటి ఈ ఊహలు శాస్త్ర పరిశోధన లకు ప్రేరణనిచ్చాయి. తర్వాతి కాలంలో ఇటాలియన్‌ బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో ద వించీ ‘ఆర్నిథాప్టర్‌’ అనే ఎగిరే యంత్రాన్ని రూపొందించాడు. అది పెద్దగా ఫలించ లేదు. ఆ తర్వాత అమెరికన్‌ ఇంజినీర్లు రైట్‌ సోదరులు విమానాన్ని రూపొందించి, మనిషి ఊహలకు భౌతికంగా రెక్కలివ్వడంలో కృతకృత్యులయ్యారు. సాహిత్యమే లేకుంటే, మనకు విమానాలు అందుబాటులోకి వచ్చేవేనా?!

ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనిషి చంద్రుడిపై కాలు మోపడానికి శతాబ్దం ముందే, ఆ ఊహను ఫ్రెంచ్‌ సాహితీవేత్త జూల్స్‌ వెర్న్‌ తన నవల ‘ఫ్రమ్‌ ది ఎర్త్‌ టు ద మూన్‌’లో రాశాడు. ఇంగ్లిష్‌ రచయిత హెచ్‌జీ వెల్స్‌ అణ్వాయుధాల ముప్పును తొలి అణుబాంబు దాడికి మూడు దశాబ్దాలకు ముందే తన ‘ద వరల్డ్‌ సెట్‌ ఫ్రీ’ నవలలో ఊహించాడు.

శాస్త్ర పరిణామాన్ని సాహిత్యం ఊహించడం కొత్తకాదు గాని, సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే శాస్త్ర పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇటాలియన్‌ కవి డాంటే కావ్యం ‘డివైన్‌ కామెడీ’లో భూగర్భశాస్త్ర విశేషాల గురించి ఇటీవల వియన్నాలో జరిగిన యూరోపియన్‌ జియోసైన్సెస్‌ యూనియన్‌ జనరల్‌ అసెంబ్లీలో ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేయడం ఇందుకు ఒక తాజా ఉదాహరణ. ‘డాంటే సాహితీవేత్త మాత్రమే కాదు, భూభౌతిక శాస్త్రవేత్త కూడా!’ అని మార్షల్‌ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ టిమోతీ బర్బరీ ఈ పరిశోధన పత్రంలో వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచంలో శాస్త్ర సాహిత్యాల సమన్వయానికి ఇదొక ముందడుగు. 

Advertisement
 
Advertisement
Advertisement