జవాబుదారీతనం కొరవడినచోట ఇష్టారాజ్యం నెలకొంటుంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే చెప్పినా సమస్య ఎప్పటిలానే మిగులుతుంది. వార్తల్లో వ్యక్తులుగా ఉండా లనుకుంటారో, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను తిప్పలు పెట్టాలనుకుంటారో... కొందరు గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారం కొత్త తగువులు తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో చేయాల్సిన ప్రసంగాన్ని కాదని రవి వాకౌట్ చేస్తే, కేంద్రాన్ని విమర్శించే ప్రస్తావనలున్న భాగాలను అర్లేకర్ చదవకుండా వదిలిపెట్టారు. రవి వివాదాలకు కొత్తగాదు. ప్రభుత్వం పంపిన పది బిల్లుల్ని దీర్ఘకాలం సమ్మతి తెలపకుండా, అలాగని అభ్యంతరాలేమిటో చెప్పకుండా తన దగ్గరే ఉంచుకున్న ఘనుడాయన. అందులో 2020 నాటి బిల్లు కూడా ఉంది! అందుకే రవి తీరును నిరుడు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది.
బిల్లుపై నిర్ణీత వ్యవధిలో గవర్నర్ ఏ మాటా చెప్పని పక్షంలో దాన్ని ఆమోదించి నట్టుగా భావించాలని కూడా తీర్పునిచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలన కొచ్చిన బిల్లునైతే వెంటనే లేదా గరిష్ఠంగా నెలరోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. అటు తర్వాత రాష్ట్రపతికిచ్చిన సలహాపూర్వక అభిప్రాయంలో బిల్లును ‘ఆమోదించినట్టుగానే పరిగణించాల’న్న భావన సరికాదని మరో ధర్మాసనం తెలిపింది. కానీ అందులో సైతం ‘దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో ఉంచటం’ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయటమేనని స్పష్టం చేసింది.
గవర్నర్ల వ్యవస్థ ఆది నుంచీ వివాదాస్పదమే. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంలో విపక్షాలను కూడగట్టి కేంద్రంపై రణభేరి మోగించారు. రాజకీయాలకు అతీతంగా ఆ వ్యవస్థ మనుగడ సాగించ లేకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపంగా పరిణమించింది. రాజ్యాంగ నిర్ణాయక సభలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అధికరణాలపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు కేంద్రం నామినేట్ చేస్తే వచ్చే గవర్నర్‌కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ అనవసర ఘర్షణలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. అయితే గవర్నర్‌గా వచ్చేవారు రాజ్యాంగపరిధిలో తమంత తాము నిర్వర్తించే కర్తవ్యాలు ఏమీ ఉండబోవనీ, రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే వారు పనిచేస్తారనీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారికి నచ్చజెప్పారు. ఇన్ని దశాబ్దాలు గడిచాక ఇప్పుడు జరుగు తున్నదేమిటి?
వాకౌట్ చేయటానికి రవి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కాదు. సమా వేశాలను తమిళ రాష్ట్రగీతంతో మొదలుపెట్టి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక చివరగా జాతీయగీతాలాపన ఉంటుందని ప్రభుత్వం చెప్పినా ఆయనకు రుచించలేదు. ఇతరేతర ఆరోపణలు రాజకీయ స్వభావం ఉన్నవి. వాటిని ఎటూ ప్రజాక్షేత్రంలో విపక్షాలు లేవనెత్తుతాయి. ఎన్నికల సమయంలో జనం తీర్పునిస్తారు. ఆ విషయంలో గవర్నర్‌గా రవి ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించే ముందు గవర్నర్‌గా తన నిర్వాకమేమిటో ఆయన సమీక్షించుకోవద్దా? బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం రాజ్యాంగ ఉల్లంఘనేనని గతంలో సుప్రీంకోర్టు చెప్ప లేదా? కేరళ గవర్నర్ రాజేంద్ర తీరు సైతం అలాగే ఉంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగపాఠంలో తనకు నచ్చని భాగాలు వదిలేయటం ఆశ్చర్యకరం.
ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి కావాలి. అది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి, ప్రజల భద్రతకు ముప్పుగా మారితే వేరే విషయం. అలాంటపుడు కేంద్రానికి నివేదిక పంపి చర్య తీసుకోవాలని కోరవచ్చు. కానీ తమకు నచ్చని పార్టీ ఏలుబడి ఉన్నచోట చీటికీ మాటికీ రచ్చ ఏం సబబు? ఇటువంటి కీచులాటల్లో గవర్నర్‌దా... రాష్ట్ర ప్రభుత్వానిదా, ఎవరిది పైచేయి అని జనం చూడరు. మొత్తంగా వ్యవస్థ పట్లే అపనమ్మకం పెంచుకుంటారు. అందుకే హద్దులు గుర్తెరిగి ప్రవర్తించాలనీ, జవాబుదారీతనంతో వ్యవహరించాలనీ గవర్నర్లు తెలుసుకోవాలి.


