జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.
విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.
దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.
అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్‌డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి.
అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.
ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు.


