మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు.
జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.
మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి.
వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.
మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది.
అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు.
ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి.


