జగన్నామ మహానాడు! | Sakshi Editorial On TDP Mahanadu By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

జగన్నామ మహానాడు!

May 31 2026 12:45 AM | Updated on May 31 2026 12:46 AM

Sakshi Editorial On TDP Mahanadu By Vardhelli Murali

జనతంత్రం

కవిత్వంలోనూ, జీవితంలోనూ ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్‌ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్నవాళ్లు కూడా ఎథిక్స్‌ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్‌ను పూర్తిగా విడిచేస్తే... పైపెచ్చు, డంబాచారపు కోతలకూ, విద్వేషపు కూత లకూ మాత్రమే అంకితమైపోతే, వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే! తెలుగుదేశం పార్టీ వాళ్లు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తర్వాత చలం మాట గుర్తు కొచ్చింది. మహానాడు ఆసాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. 

కూటమి కుహరంలో భయం బయల్దేరిందనీ, ప్రమాద ఘంటారావం మొదలైందనీ మహానాడు సన్నివేశానికి తాత్ప ర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మళ్లీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్లూ, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తున్నది? పైగా తానే అధికారంలోకి రావాలని ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేదా? తమ రెండేళ్ల అధికారాన్ని ‘మంచి’ పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయల్దేరింది.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే, జగన్‌మోహన్‌రెడ్డి నామ స్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట! కారణమేమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘనకార్యాలు ఈ రెండేళ్లలో ఏమీలేవా? జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? డెబ్బయ్‌ ఆరేళ్ల వయసు, యాభయ్యేళ్ల రాజకీయ జీవితం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా పదహారేళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి.

ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమనాన్ని గమ్యాన్ని సమీక్షించుకునే మహా నాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిదీ గొడ్డలి? మనకు తెలిసినంతవరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌. మరీ గొడ్డలి కథేంటి? వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో చంపారు కనుక, అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీవాళ్లే బుద్దిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసన్నల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి వీఐపీ మర్యాదలు చేస్తున్నదెవరు? అతను అరెస్టు కాకుండా కాపాడిందెవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది.

గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో ఐదారు సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్‌ అని ప్రచారం చేయాలట! గంజాయి మీద ఉక్కు పాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని (ఎస్‌ఇబి) ఏర్పాటు చేసిందే జగన్‌ సర్కార్‌ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యధార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందాప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్‌బోర్డులు సిద్ధం చేశారు. వాటికి గట్టిగా ప్రచారం చేసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్‌ బ్యాచ్‌ ఉన్నదని! బెజవాడ బ్లేడ్‌ బ్యాచ్‌ గురించి, కాల్‌మనీ – సెక్స్‌ రాకెట్‌ల వ్యవహారం వెనకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు.

సోషల్‌ మీడియా సైకో బ్యాచ్, ఫేక్‌ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్‌ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట! రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్‌ రికార్డు ఎవరికి ఉన్నదో తెలుగు ప్రజకు తెలియనిది కాదు. ఎన్టీఆర్‌ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జుగుప్సాకరమైన కార్టూన్‌లు ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్న దెవరు? మెగాస్టార్‌ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజ కీయ పార్టీ మీద విషప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా సుదీర్ఘమైనది. ఇక జగన్‌మోహన్‌రెడ్డి మీద గత పద్నాలుగేళ్లుగా అత్యంత హేయమైన ఆల్‌టైమ్‌ వరల్డ్‌ రికార్డు ప్రచా రాన్ని చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారం కొనసాగించడానికే వినియోగించుకున్నారు. 

హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని చెప్పాలట! టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలాకాలం నుంచి టీడీపీ అనుబంధ విభాగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీగానీ, వచ్చిన పార్టీగానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్‌సెన్స్‌ విషయం కదా! అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌ చేసిన సేవలే ఎక్కువ. సెక్యులర్‌ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.

తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3–జి నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేశ్‌బాబు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలబడ్డారు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలుపడి లోకేశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో, లేని గొప్పలు చెప్పుకోవడంలో 2–జి కంటే 3–జి నాలుగాకులు ఎక్కువే చదివిందని తేలి పోయింది. జగన్నామ స్మరణే లోకేశ్‌ ప్రసంగం కూడా! అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్‌ ఒకటున్నది – ‘అక్క అంబా సిడర్‌ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్‌ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్‌బాయ్, నేను లక్స్‌’ అంటుంది.

అదే తరహాలో లోకేశ్‌బాబు కూడా జగన్‌ పార్టీది గొడ్డలి, మాది గూగుల్‌; జగన్‌ టెన్త్‌ పేపర్లు లీక్‌ చేశాడు, నేను స్టాన్‌ ఫోర్డ్‌లో చదివాను’ అంటూ అథమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్‌ టెన్త్‌ పేపర్లు లీక్‌ చేసినట్టు తన కెప్పుడు కల వచ్చిందో మాత్రం చెప్పలేదు. లోకేశ్‌కు స్టాన్‌ ఫోర్డ్‌లో ఎండోమెంట్‌ (డొనేషన్‌) కోటాలో సీటొచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేశ్‌స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్‌మోహన్‌రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్‌ను తెచ్చుకున్నది అదానీ గ్రూప్‌. గూగుల్‌ రాకకు చంద్రబాబు – లోకేశ్‌లకు ఎటువంటి సంబంధం లేదు.

సినిమాటిక్‌ పోలికలతో జగన్‌తో సమవుజ్జీగా నిలబడాలని లోకేశ్‌బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురు తుంది బాబూ... ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తి మంతురాలైన పార్టీ అధినేత్రిని ఎదిరించి పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి, మూడు పార్టీల కూటములను ఒక్కడిగానే ఎదురొడ్డి నిలిచిన ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తుల్లేకుండా జగన్‌ని ఎదిరించడమంటే గజగజ వణికి పోయే పరిస్థితి కూటమి పార్టీలది. గత పదిహేనేళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్‌ అప్రెంటిస్‌షిప్‌ చేసిన అదృష్టం లోకేశ్‌ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవ డానికి సిద్ధపడుతున్నారాయన. జగన్‌ హయాంలో లక్షా ముప్పయ్‌ వేల సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లెయింట్‌ రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేశ్‌ విద్యామంత్రిగా నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మీద ఎన్ని వేలమంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటి స్తున్నారో గమనించండి. ట్రాక్‌ రికార్డు ముఖ్యం... లక్స్‌ – లైఫ్‌ బాయ్‌ పోలికలు కావు.
 


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement