కాలాతీత బాల్యం | Sakshi Editorial On Timeless Childhood | Sakshi
Sakshi News home page

కాలాతీత బాల్యం

Jun 1 2026 1:11 AM | Updated on Jun 1 2026 1:11 AM

Sakshi Editorial On Timeless Childhood

‘టామ్‌.’ జవాబు లేదు. ‘ఒరేయ్‌ టామ్‌.’ పోలీ పెద్దమ్మ పిలుపునకు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఓ అని వినబడుతుంది. టామ్‌ అమెరికాలో మాత్రమే లేడుగా! వాడు ఆఫ్రికాలోనూ ఉన్నాడు, అనకాపల్లిలోనూ ఉంటాడు. అల్లరి, సాహసం కలగలిసిన ప్రతి పిల్లాడూ టామే! 1876 జూన్‌ 9న ‘పుట్టిన’ టామ్‌ సాయర్‌కు ఇప్పుడు 150 ఏళ్లు! కానీ ఆ తుంటరికి వయసనేది అయిపోతుందా? టామ్‌ సదాబాలుడు, సరదా బాలుడు; పోలీ పెద్దమ్మనే కాదు, సకల ప్రపంచాన్ని తన అల్లరి చేష్టలతో ఏలిన కౌబాలుడు. ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టామ్‌ సాయర్‌’ నవలను మార్క్‌ ట్వెయిన్‌ కేవలం పిల్లల కోసమే రాయలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. ప్రపంచ సాహిత్య యవనికపై ఒక చిలిపి బాలుడి సాహసాలు ఇంతటి సుదీర్ఘ కాలం సజీవంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. 

ఇంటి గోడకు సున్నం వేయడాన్ని కూడా ఒక కళగా మార్చి, ఇతరులతో పని చేయించుకునే తెలివితేటలున్న టామ్‌ నేటి మేనేజ్‌మెంట్‌ గురువులకు ఆది గురువు. ఈ నవల రాకముందు, అమెరికన్‌ సాహిత్యం ఎక్కువగా యూరోపియన్‌ శైలిని అనుకరిస్తూ, నీతి సూత్రాలతో నిండి ఉండేది. కానీ ట్వెయిన్‌ అమెరికన్‌ మాండలికాన్ని, సామాన్యుల భాషను సాహిత్య గౌరవ పీఠంపై కూర్చో బెట్టాడు. ‘ఆధునిక అమెరికన్‌ సాహిత్యం అంతా మార్క్‌ ట్వెయిన్‌ రాసిన ఒకే ఒక్క పుస్తకం నుండి పుట్టింది’ అని ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌’ (1884) నవలను కొనియాడాడు ఎర్నెస్ట్‌ హెమింగ్వే. ఈ నవల టామ్‌ సాయర్‌కు పొడిగింపు అన్నది గుర్తుంచుకుంటే దాని బీజాలు మొదటే ఉన్నాయన్నది అర్థమవుతుంది.

కొన్ని కథలు రాసినా ట్వెయిన్‌కు ఇది తొలి నవల. మిసిసిపీ నది తీరాన ఉన్న హానిబాల్‌ గ్రామంలో గడిపిన తన సొంత బాల్య స్మృతుల నుంచే ట్వెయిన్‌ ఈ కథను అల్లుకున్నాడు. తనకు తెలిసిన ముగ్గురు అల్లరి పిల్లల లక్షణాలను కలిపి ‘టామ్‌’ను సృష్టించాడంటారు. పేరును మాత్రం లోకల్‌ హీరో అయిన ఒక ఫైర్‌ఫైటర్‌ మీదుగా స్వీకరించాడు. ట్వెయిన్‌కు అతడు స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి సాయంత్రాలు షికార్లు కొట్టేవాళ్లు. అందరికీ ఇష్టమైన హకల్‌బెరీ ఫిన్‌ పాత్రనేమో తన బాల్యమిత్రుడు టామ్‌ బ్లాంకె¯Œ షిప్‌ ఆధారంగా రూపొందించాడు. ట్వెయిన్‌ చుట్టూ ఎందరు టాములో!  సిడ్‌ సాయర్, బెకీ థాచర్, జడ్జ్‌ థాచర్, జో హార్పర్, విడో డగ్లస్, ఇంజన్‌ జో లాంటి పాత్రలు కూడా మరిచిపోలేనివి.  సినిమాలుగా, టీవీ ప్రోగ్రాములుగా, మ్యూజి కల్సుగా అలరించిన టామ్‌ సాయర్, టైప్‌రైటర్‌ మీద రాసిన తొలి నవల అని ప్రచారంలో ఉంది. కానీ అది నిజానికి ‘లైఫ్‌ ఆన్‌ ద మిసిసిపీ’ (1883) అని మరోమాట! ఇదీ మార్క్‌ ట్వెయిన్‌దే కావడం గమనార్హం.

పిల్లలు కేవలం మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కాదు; వాళ్లు అల్లరి, భయం,సాహసం కలగలిసిన వాళ్లని ప్రపంచానికి చాటి చెప్పాడు ట్వెయిన్‌. ప్రకృతితో మమేకమవ్వడం, అన్వేషించడం నేటి పిల్లలు కోల్పోతున్న సహజ లక్షణాలు. చీకటి గుహల్లో నిధుల కోసం వెతికిన టామ్‌ మనకు ఇదే గుర్తు చేస్తాడు. నేటి డిజిటల్‌ యుగంలో, స్మార్ట్‌ఫోన్లకు బందీలైపోతున్న బాల్యానికి టామ్‌ సాయర్‌ ఒక తాళంచెవి. వందల ఏళ్లు గడిచినా, సమాజం ఎంత ఆధునీకరించబడినా మనుషుల్లోని అమాయ కత్వం, సాహస ప్రవృత్తి మారవు. అందుకే ‘టామ్‌ సాయర్‌’ కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బాల్యానికి నిలువుటద్దం. ఈ 150వ వేడుకల సందర్భంగా మనలోని ఆ చిలిపి టామ్‌ సాయర్‌ను ఒకసారి నిద్రలేపుదాం! ఈ నవలను నండూరి రామమోహనరావు (1927–2011) టామ్‌ మన పక్కింటి పిల్లాడే అన్నంత హాయిగా తెలుగులోకి అనువదించాడు. రచయిత నామిని తన కొడుక్కు టామ్‌ సాయర్‌ అని పేరు పెట్టుకున్నాడు. టామ్‌ ఎంతటి తెలుగువాడో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఈ తిరుపతి టామ్‌ రచయితగా మారడం ఆ టామ్‌ను కన్నమార్క్‌ ట్వెయిన్‌కు తగిన నివాళి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement