mark twain
-
కాలాతీత బాల్యం
‘టామ్.’ జవాబు లేదు. ‘ఒరేయ్ టామ్.’ పోలీ పెద్దమ్మ పిలుపునకు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఓ అని వినబడుతుంది. టామ్ అమెరికాలో మాత్రమే లేడుగా! వాడు ఆఫ్రికాలోనూ ఉన్నాడు, అనకాపల్లిలోనూ ఉంటాడు. అల్లరి, సాహసం కలగలిసిన ప్రతి పిల్లాడూ టామే! 1876 జూన్ 9న ‘పుట్టిన’ టామ్ సాయర్‌కు ఇప్పుడు 150 ఏళ్లు! కానీ ఆ తుంటరికి వయసనేది అయిపోతుందా? టామ్ సదాబాలుడు, సరదా బాలుడు; పోలీ పెద్దమ్మనే కాదు, సకల ప్రపంచాన్ని తన అల్లరి చేష్టలతో ఏలిన కౌబాలుడు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ నవలను మార్క్ ట్వెయిన్ కేవలం పిల్లల కోసమే రాయలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. ప్రపంచ సాహిత్య యవనికపై ఒక చిలిపి బాలుడి సాహసాలు ఇంతటి సుదీర్ఘ కాలం సజీవంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇంటి గోడకు సున్నం వేయడాన్ని కూడా ఒక కళగా మార్చి, ఇతరులతో పని చేయించుకునే తెలివితేటలున్న టామ్ నేటి మేనేజ్మెంట్ గురువులకు ఆది గురువు. ఈ నవల రాకముందు, అమెరికన్ సాహిత్యం ఎక్కువగా యూరోపియన్ శైలిని అనుకరిస్తూ, నీతి సూత్రాలతో నిండి ఉండేది. కానీ ట్వెయిన్ అమెరికన్ మాండలికాన్ని, సామాన్యుల భాషను సాహిత్య గౌరవ పీఠంపై కూర్చో బెట్టాడు. ‘ఆధునిక అమెరికన్ సాహిత్యం అంతా మార్క్ ట్వెయిన్ రాసిన ఒకే ఒక్క పుస్తకం నుండి పుట్టింది’ అని ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ (1884) నవలను కొనియాడాడు ఎర్నెస్ట్ హెమింగ్వే. ఈ నవల టామ్ సాయర్‌కు పొడిగింపు అన్నది గుర్తుంచుకుంటే దాని బీజాలు మొదటే ఉన్నాయన్నది అర్థమవుతుంది.కొన్ని కథలు రాసినా ట్వెయిన్‌కు ఇది తొలి నవల. మిసిసిపీ నది తీరాన ఉన్న హానిబాల్ గ్రామంలో గడిపిన తన సొంత బాల్య స్మృతుల నుంచే ట్వెయిన్ ఈ కథను అల్లుకున్నాడు. తనకు తెలిసిన ముగ్గురు అల్లరి పిల్లల లక్షణాలను కలిపి ‘టామ్’ను సృష్టించాడంటారు. పేరును మాత్రం లోకల్ హీరో అయిన ఒక ఫైర్‌ఫైటర్ మీదుగా స్వీకరించాడు. ట్వెయిన్‌కు అతడు స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి సాయంత్రాలు షికార్లు కొట్టేవాళ్లు. అందరికీ ఇష్టమైన హకల్‌బెరీ ఫిన్ పాత్రనేమో తన బాల్యమిత్రుడు టామ్ బ్లాంకె¯Œ షిప్ ఆధారంగా రూపొందించాడు. ట్వెయిన్ చుట్టూ ఎందరు టాములో! సిడ్ సాయర్, బెకీ థాచర్, జడ్జ్ థాచర్, జో హార్పర్, విడో డగ్లస్, ఇంజన్ జో లాంటి పాత్రలు కూడా మరిచిపోలేనివి. సినిమాలుగా, టీవీ ప్రోగ్రాములుగా, మ్యూజి కల్సుగా అలరించిన టామ్ సాయర్, టైప్‌రైటర్ మీద రాసిన తొలి నవల అని ప్రచారంలో ఉంది. కానీ అది నిజానికి ‘లైఫ్ ఆన్ ద మిసిసిపీ’ (1883) అని మరోమాట! ఇదీ మార్క్ ట్వెయిన్దే కావడం గమనార్హం.పిల్లలు కేవలం మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కాదు; వాళ్లు అల్లరి, భయం,సాహసం కలగలిసిన వాళ్లని ప్రపంచానికి చాటి చెప్పాడు ట్వెయిన్. ప్రకృతితో మమేకమవ్వడం, అన్వేషించడం నేటి పిల్లలు కోల్పోతున్న సహజ లక్షణాలు. చీకటి గుహల్లో నిధుల కోసం వెతికిన టామ్ మనకు ఇదే గుర్తు చేస్తాడు. నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్ఫోన్లకు బందీలైపోతున్న బాల్యానికి టామ్ సాయర్ ఒక తాళంచెవి. వందల ఏళ్లు గడిచినా, సమాజం ఎంత ఆధునీకరించబడినా మనుషుల్లోని అమాయ కత్వం, సాహస ప్రవృత్తి మారవు. అందుకే ‘టామ్ సాయర్’ కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బాల్యానికి నిలువుటద్దం. ఈ 150వ వేడుకల సందర్భంగా మనలోని ఆ చిలిపి టామ్ సాయర్‌ను ఒకసారి నిద్రలేపుదాం! ఈ నవలను నండూరి రామమోహనరావు (1927–2011) టామ్ మన పక్కింటి పిల్లాడే అన్నంత హాయిగా తెలుగులోకి అనువదించాడు. రచయిత నామిని తన కొడుక్కు టామ్ సాయర్ అని పేరు పెట్టుకున్నాడు. టామ్ ఎంతటి తెలుగువాడో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఈ తిరుపతి టామ్ రచయితగా మారడం ఆ టామ్‌ను కన్నమార్క్ ట్వెయిన్‌కు తగిన నివాళి. -
కరుణగలిగిన హ్యూమరిస్ట్
మార్క్ ట్వేన్ ఒక దశలో చట్టబద్దంగా దివాలా పెట్టాడు. అయితే ఆ తర్వాత ప్రపంచ పర్యటన చేసి ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు సంపాదించాడు. బొంబాయిలో మూడు నెలలు ఉండి రోజుకు 2600 రూపాయలు సంపాదించాడు. ఒక ఆదివారం మార్క్ ట్వేన్ చర్చికి వెళ్లాడు. ఒక ఫాదరీ సెర్మన్ చెబుతున్నాడు. అంతా అయ్యాక మార్క్ ట్వేన్ ఆయన దగ్గరకు వెళ్లి ‘ఫాదర్. మీ సెర్మన్లో ఉన్న ప్రతి పదం నా దగ్గరున్న ఒక పుస్తకంలో ఉంది’ అన్నాడు. ఫాదరీకి కోపం వచ్చింది. తను కష్టపడి తయారు చేసుకున్న సెర్మన్ అది. ‘అసంభవం’ అన్నాడు కోపంగా. ‘కాదు. నిజంగానే’ అన్నాడు మార్క్ ట్వేన్. ‘అయితే ఆ పుస్తకం ఒకసారి నాకు చూపించండి’ అన్నాడు ఫాదరి. ‘అలాగే’ అన్న మార్క్‌ట్వేన్ మర్నాడు ఫాదరికి ఒక లావుపాటి డిక్షనరీ పంపాడు. మార్క్ ట్వేన్ రాతలే కాదు చేష్టలు కూడా ఇలాగే ఉండేవి. నవ్వించేవి. కొంటెతనం చూపించేవి. గిలిగింతలు పెట్టేవి. మార్క్ ట్వేన్ ఏదీ నేరుగా చెప్పడు. ఉన్నమాటలనే కాస్త అటూ ఇటూ చేస్తే అర్థానికి భంగం లేకుండా హాస్యం పొంగిపొర్లేది. 1896 జనవరిలో మార్క్ ట్వేన్ ఇండియా వచ్చి బొంబాయి, కలకత్తా, లాహోరు నగరాలలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ సమయంలోనే ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూశాడు. తాజ్‌ను వెన్నెలలో చూడాలని ఎవరో చెప్పగా రాత్రి పదకొండున్నర గంటలకు వెళ్లాడు. ఆ వేళ పౌర్ణమి పుచ్చపువ్వులా కాస్తోంది. ఇంతలో దురదృష్టవశాత్తు గ్రహణం పట్టింది. అప్పుడు తనకు కలిగిన చికాకును మార్క్‌ట్వేన్ ఇంకో పద్ధతిలో చెప్పాడు- ‘తాజ్‌మహల్ కట్టిన తరువాత ఇంత ఘనగౌరవం నాకు తప్ప మరెవరికీ జరగలేదు. గతంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తాజ్‌మహల్‌ను సందర్శించిన సందర్భంలో చంద్రగ్రహణం ఏర్పాటు చేద్దామనుకున్నారుగాని సాధ్యం కాలేదు. కాని నాతో వచ్చిన కర్నల్ లాక్ (పొలిటికల్ ఏజెంట్) చాలా పలుకుబడి కలవాడు. అందుకే సరిగ్గా నేను తాజ్‌ను వెన్నెలలో చూసి ఆనందించాలని వచ్చినప్పుడే చంద్రగ్రహణం ఏర్పాటు చేశాడు’... ఇలాంటి విరుపు వేరొకరికి సాధ్యం కాదు. ‘‘సృష్టిలో మానవుడొక్కడే సిగ్గుపడే జంతువు. సిగ్గుపడాల్సిన జంతువు కూడా’’ ‘‘క్లాసిక్స్ అంటే చదివితే బాగుండు అనుకునేవి. కాని చదవడానికి బుద్ధిపుట్టనివి’’ ఇలాంటి కోట్స్ మార్క్ ట్వేన్ మాత్రమే చెప్పగలడు. మార్క్‌ట్వేన్ హెలీ తోకచుక్క కనిపించినప్పుడు (1835) జన్మించి మళ్లీ హెలీ తోకచుక్క కనిపించినప్పుడు (1910) మరణించాడు. ఈ మధ్య కాలంలో అతడి అనుక్షణ జీవితం ఒక ఉత్సవంలా సాగింది. అసలు పేరు ‘శామ్యూల్ లాంగ్‌హార్న్ క్లెమెన్స్’. మార్క్ ట్వేన్ అనేది అతడి కలం పేరు. అమెరికాలోని మిస్సూరిలో పుట్టాడు. పెద్దయ్యాక కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా, మరికొంతకాలం మిస్సిసిపీ నదిలో రివర్‌బోట్ పెలైట్‌గా, ఇంకొంత కాలం గని కార్మికుడిగా పని చేశాడు. ఆ తర్వాత జర్నలిస్టుగా మారాడు. 1865లో అతడు రాసిన మొట్టమొదటి కథ -The Celebrated Jumping Frog of Calaveras County -పెద్ద సంచలనం రేపింది. అందులోని హాస్యం, వ్యంగ్యం, ప్రతి మాటలోని విరుపు చూసి అమెరికా మొత్తం ఎవరీ కొత్త రచయిత అని లేచి నిలబడింది. అనేక భాషల్లో ఆఖరికి ప్రాచీన గ్రీకులో కూడా ఆ కథను అనువాదం చేసుకున్నారు. ఇక మార్క్ ట్వేన్ ఆగలేదు. వరుసపెట్టి రచనలు చేశాడు. ‘ది అడ్వంచర్స్ ఆఫ్ టామ్సాయర్’, ‘ది అడ్వంచర్స్ ఆఫ్ హకల్‌బెరి ఫిన్’లు రాసి ‘ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్’గా చరిత్రలో నిలబడిపోయాడు. అయితే నవ్వించినంత సులభంగా మార్క్ ట్వేన్ డబ్బును కాపాడుకోలేకపోయాడు. రచనల మీద వచ్చిన భారీసొమ్మును ఒక కొత్త రకం ప్రింటింగ్ మిషన్‌ను తయారు చేసే పనిలో వెచ్చించి పోగొట్టుకున్నాడు. మరికొంత డబ్బును ఇతరుల రచనలు అచ్చు వేయడం ద్వారా పోగొట్టుకు న్నాడు. ఒక దశలో చట్టబద్దంగా దివాలా పెట్టాడు. అయితే ఆ తర్వాత ప్రపంచ పర్యటన చేసి ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు సంపాదించాడు. బొంబాయిలో మూడు నెలలు ఉండి రోజుకు 2600 రూపాయలు సంపాదించాడు. ఇలా వచ్చిన డబ్బుతో దివాలాకు ముందు తాను చేసిన బాకీలను అవసరం లేకపోయినా చెల్లించాడు. ఆయనకు మనుషులంటే ప్రేమ ఉంది. మరో వైపు జుగుప్స ఉంది. కరుణ ఉంది. అసహ్యమూ ఉంది. అందుకే ఆయన హాస్యం ఒక్కోసారి హాయిగా మరోసారి క్రూరంగా ఉంటుంది. హాస్య రచయితల జీవితాల్లో విషాదం పెనవేసుకుని ఉంటుందేమో. ఒక దశలో మార్క్ ట్వేన్ డిప్రెషన్లోకి వెళ్లాడు. కూతురు చనిపోవడం, భార్య, ఆ వెంటనే ఒక ఆప్తమిత్రుడు వీళ్లంతా చనిపోవడంతో విషాదంలో సతమతమయ్యేవాడు. ఆ సందర్భంలోనే ఆయన తెల్లటి సూట్‌ను ధరిస్తూ భార్య జ్ఞాపకాలకు గుర్తుగా ఎప్పుడూ ఆ రంగు సూట్లలోనే కనిపించేవాడని అంటారు. క్రమంగా మార్క్ ట్వేన్కు అదొక చిహ్నంగా మారింది. మార్క్ ట్వేన్లో కొంచెం మోటుతనం ఉండేది. సంభాషణల్లో తరచూ బూతులు వాడేవాడు. వ్యసనాలు కూడా తక్కువ కాదు. ‘నేను పెద్దగా ప్రయాస పడకుండానే 70 ఏళ్లు బతికాను. నా వ్యసనాలను నేను జాగ్రత్తగా పాటించేవాడిని. ఇంకొకళ్లనైతే అవి ఈపాటికి చంపేసి ఉండేవి’ అన్నాడొకసారి. తనకు తాగుడు వ్యసనం ఉందని అంగీకరిస్తూ ‘పంటినొప్పి రాకుండా ఉండటానికే నేను తాగుతాను. అందుకే నాకు ఒక్కసారైనా పంటినొప్పి రాలేదు’ అన్నాడు. మార్క్ ట్వేన్ రాసిన ‘ప్రిన్స్ అండ్ పాపర్’ (రాజు- పేద.... దీని ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి) ఆయనకు పేరు తెచ్చినా వ్యంగ్యానికి పరాకాష్టగా ఆయన రాసిన ‘ఎ కొనిక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్థర్స్ రోడ్’ను ఎక్కువమంది గణిస్తారు. అయితే ఆయన అన్నింటికంటే ఉత్తమ రచనగా ‘హకల్‌బెరి ఫిన్’ను చెప్పుకుంటారు. ఇది హకల్‌బెరి ఫిన్ అనే పదమూడు పద్నాలుగేళ్ల బాలుడి ఆత్మకథలాంటిది. కాని ఇందులో బానిసల పట్ల ఆయన చూపిన కరుణ గమనిస్తే ఒక నిజమైన హ్యూమరిస్ట్ హృదయం ఎంత కరుణతో నిండి ఉంటుందో అర్థమవుతుంది.ఆయనను చదవకపోవడం పఠితులకు చాలా పెద్ద వెలితి. - ఎన్. ప్రసాద్‌బాబు (మార్క్ ట్వేన్ రచనలకు తెలుగు అనువాదాలు లభ్యం. నండూరి రామమోహనరావు చేసిన అనువాదాలు ఇది వరకే విశేష ఆదరణ పొందాయి. అన్ని విశాలాంధ్ర షాపుల్లో, నవోదయ- కాచిగూడలో దొరుకుతాయి)


