కరుణగలిగిన హ్యూమరిస్ట్ | mark twain is a good human being | Sakshi
Sakshi News home page

కరుణగలిగిన హ్యూమరిస్ట్

Dec 15 2013 11:43 PM | Updated on Sep 2 2017 1:39 AM

కరుణగలిగిన హ్యూమరిస్ట్

కరుణగలిగిన హ్యూమరిస్ట్

మార్క్ ట్వేన్ ఒక దశలో చట్టబద్దంగా దివాలా పెట్టాడు. అయితే ఆ తర్వాత ప్రపంచ పర్యటన చేసి ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు సంపాదించాడు. బొంబాయిలో మూడు నెలలు ఉండి రోజుకు 2600 రూపాయలు సంపాదించాడు.

  మార్క్ ట్వేన్ ఒక దశలో చట్టబద్దంగా దివాలా పెట్టాడు. అయితే ఆ తర్వాత ప్రపంచ పర్యటన చేసి ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు సంపాదించాడు. బొంబాయిలో మూడు నెలలు ఉండి రోజుకు 2600 రూపాయలు సంపాదించాడు.
 
 ఒక ఆదివారం మార్క్ ట్వేన్ చర్చికి వెళ్లాడు. ఒక ఫాదరీ సెర్మన్ చెబుతున్నాడు. అంతా అయ్యాక మార్క్ ట్వేన్ ఆయన దగ్గరకు వెళ్లి ‘ఫాదర్. మీ సెర్మన్‌లో ఉన్న ప్రతి పదం నా దగ్గరున్న ఒక పుస్తకంలో ఉంది’ అన్నాడు. ఫాదరీకి కోపం వచ్చింది. తను కష్టపడి తయారు చేసుకున్న సెర్మన్ అది. ‘అసంభవం’ అన్నాడు కోపంగా. ‘కాదు. నిజంగానే’ అన్నాడు మార్క్ ట్వేన్. ‘అయితే ఆ పుస్తకం ఒకసారి నాకు చూపించండి’ అన్నాడు ఫాదరి. ‘అలాగే’ అన్న మార్క్‌ట్వేన్ మర్నాడు ఫాదరికి ఒక లావుపాటి డిక్షనరీ పంపాడు.
 మార్క్ ట్వేన్ రాతలే కాదు చేష్టలు కూడా ఇలాగే ఉండేవి. నవ్వించేవి. కొంటెతనం చూపించేవి. గిలిగింతలు పెట్టేవి. మార్క్ ట్వేన్ ఏదీ నేరుగా చెప్పడు. ఉన్నమాటలనే కాస్త అటూ ఇటూ చేస్తే అర్థానికి భంగం లేకుండా హాస్యం పొంగిపొర్లేది.
 
 1896 జనవరిలో మార్క్ ట్వేన్ ఇండియా వచ్చి బొంబాయి, కలకత్తా, లాహోరు నగరాలలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ సమయంలోనే ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూశాడు. తాజ్‌ను వెన్నెలలో చూడాలని ఎవరో చెప్పగా రాత్రి పదకొండున్నర గంటలకు వెళ్లాడు. ఆ వేళ పౌర్ణమి పుచ్చపువ్వులా కాస్తోంది. ఇంతలో దురదృష్టవశాత్తు గ్రహణం పట్టింది. అప్పుడు తనకు కలిగిన చికాకును మార్క్‌ట్వేన్ ఇంకో పద్ధతిలో చెప్పాడు- ‘తాజ్‌మహల్ కట్టిన తరువాత ఇంత ఘనగౌరవం నాకు తప్ప మరెవరికీ జరగలేదు. గతంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తాజ్‌మహల్‌ను సందర్శించిన సందర్భంలో చంద్రగ్రహణం ఏర్పాటు చేద్దామనుకున్నారుగాని సాధ్యం కాలేదు. కాని నాతో వచ్చిన కర్నల్ లాక్ (పొలిటికల్ ఏజెంట్) చాలా పలుకుబడి కలవాడు. అందుకే సరిగ్గా నేను తాజ్‌ను వెన్నెలలో చూసి ఆనందించాలని వచ్చినప్పుడే చంద్రగ్రహణం ఏర్పాటు చేశాడు’...
 ఇలాంటి విరుపు వేరొకరికి సాధ్యం కాదు.
 ‘‘సృష్టిలో మానవుడొక్కడే సిగ్గుపడే జంతువు. సిగ్గుపడాల్సిన జంతువు కూడా’’
 ‘‘క్లాసిక్స్ అంటే చదివితే బాగుండు అనుకునేవి. కాని చదవడానికి బుద్ధిపుట్టనివి’’
 ఇలాంటి కోట్స్ మార్క్ ట్వేన్ మాత్రమే చెప్పగలడు.
 
 మార్క్‌ట్వేన్ హెలీ తోకచుక్క కనిపించినప్పుడు (1835) జన్మించి మళ్లీ హెలీ తోకచుక్క కనిపించినప్పుడు (1910) మరణించాడు. ఈ మధ్య కాలంలో అతడి అనుక్షణ జీవితం ఒక ఉత్సవంలా సాగింది. అసలు పేరు ‘శామ్యూల్ లాంగ్‌హార్న్ క్లెమెన్స్’. మార్క్ ట్వేన్ అనేది అతడి కలం పేరు. అమెరికాలోని మిస్సూరిలో పుట్టాడు. పెద్దయ్యాక కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా, మరికొంతకాలం మిస్సిసిపీ నదిలో రివర్‌బోట్ పెలైట్‌గా,  ఇంకొంత కాలం గని కార్మికుడిగా పని చేశాడు. ఆ తర్వాత జర్నలిస్టుగా మారాడు. 1865లో అతడు రాసిన మొట్టమొదటి కథ -The Celebrated Jumping Frog of Calaveras County -పెద్ద సంచలనం రేపింది. అందులోని హాస్యం, వ్యంగ్యం, ప్రతి మాటలోని విరుపు చూసి అమెరికా మొత్తం ఎవరీ కొత్త రచయిత అని లేచి నిలబడింది. అనేక భాషల్లో ఆఖరికి ప్రాచీన గ్రీకులో కూడా ఆ కథను అనువాదం చేసుకున్నారు. ఇక మార్క్ ట్వేన్ ఆగలేదు. వరుసపెట్టి రచనలు చేశాడు. ‘ది అడ్వంచర్స్ ఆఫ్ టామ్‌సాయర్’, ‘ది అడ్వంచర్స్ ఆఫ్ హకల్‌బెరి ఫిన్’లు రాసి ‘ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్’గా చరిత్రలో నిలబడిపోయాడు.
 
 అయితే నవ్వించినంత సులభంగా మార్క్ ట్వేన్ డబ్బును కాపాడుకోలేకపోయాడు. రచనల మీద వచ్చిన భారీసొమ్మును ఒక కొత్త రకం ప్రింటింగ్ మిషన్‌ను తయారు చేసే పనిలో వెచ్చించి పోగొట్టుకున్నాడు. మరికొంత డబ్బును ఇతరుల రచనలు అచ్చు వేయడం ద్వారా పోగొట్టుకు న్నాడు. ఒక దశలో చట్టబద్దంగా దివాలా పెట్టాడు. అయితే ఆ తర్వాత ప్రపంచ పర్యటన చేసి ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు సంపాదించాడు. బొంబాయిలో మూడు నెలలు ఉండి రోజుకు 2600 రూపాయలు సంపాదించాడు. ఇలా వచ్చిన డబ్బుతో దివాలాకు ముందు తాను చేసిన బాకీలను అవసరం లేకపోయినా చెల్లించాడు. ఆయనకు మనుషులంటే ప్రేమ ఉంది. మరో వైపు జుగుప్స ఉంది. కరుణ ఉంది. అసహ్యమూ ఉంది. అందుకే ఆయన హాస్యం ఒక్కోసారి హాయిగా మరోసారి క్రూరంగా ఉంటుంది.
 
 హాస్య రచయితల జీవితాల్లో విషాదం పెనవేసుకుని ఉంటుందేమో. ఒక దశలో మార్క్ ట్వేన్ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. కూతురు చనిపోవడం, భార్య, ఆ వెంటనే ఒక ఆప్తమిత్రుడు వీళ్లంతా  చనిపోవడంతో విషాదంలో సతమతమయ్యేవాడు. ఆ సందర్భంలోనే ఆయన తెల్లటి సూట్‌ను ధరిస్తూ భార్య జ్ఞాపకాలకు గుర్తుగా ఎప్పుడూ ఆ రంగు సూట్‌లలోనే కనిపించేవాడని అంటారు. క్రమంగా మార్క్ ట్వేన్‌కు అదొక చిహ్నంగా మారింది.
 
 మార్క్ ట్వేన్‌లో కొంచెం మోటుతనం ఉండేది. సంభాషణల్లో తరచూ బూతులు వాడేవాడు. వ్యసనాలు కూడా తక్కువ కాదు. ‘నేను పెద్దగా ప్రయాస పడకుండానే 70 ఏళ్లు బతికాను. నా వ్యసనాలను నేను జాగ్రత్తగా పాటించేవాడిని. ఇంకొకళ్లనైతే అవి ఈపాటికి చంపేసి ఉండేవి’ అన్నాడొకసారి. తనకు తాగుడు వ్యసనం ఉందని అంగీకరిస్తూ ‘పంటినొప్పి రాకుండా ఉండటానికే నేను తాగుతాను. అందుకే నాకు ఒక్కసారైనా పంటినొప్పి రాలేదు’ అన్నాడు.
 
 మార్క్ ట్వేన్ రాసిన ‘ప్రిన్స్ అండ్ పాపర్’ (రాజు- పేద.... దీని ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి) ఆయనకు పేరు తెచ్చినా వ్యంగ్యానికి పరాకాష్టగా ఆయన రాసిన ‘ఎ కొనిక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్థర్స్ రోడ్’ను ఎక్కువమంది గణిస్తారు. అయితే ఆయన అన్నింటికంటే ఉత్తమ రచనగా ‘హకల్‌బెరి ఫిన్’ను చెప్పుకుంటారు. ఇది హకల్‌బెరి ఫిన్ అనే పదమూడు పద్నాలుగేళ్ల బాలుడి ఆత్మకథలాంటిది. కాని ఇందులో బానిసల పట్ల ఆయన చూపిన కరుణ గమనిస్తే ఒక నిజమైన హ్యూమరిస్ట్ హృదయం ఎంత కరుణతో నిండి ఉంటుందో అర్థమవుతుంది.ఆయనను చదవకపోవడం పఠితులకు చాలా పెద్ద వెలితి.
 - ఎన్. ప్రసాద్‌బాబు
 
 (మార్క్ ట్వేన్ రచనలకు తెలుగు అనువాదాలు లభ్యం. నండూరి రామమోహనరావు చేసిన అనువాదాలు ఇది వరకే విశేష ఆదరణ పొందాయి. అన్ని విశాలాంధ్ర షాపుల్లో, నవోదయ- కాచిగూడలో దొరుకుతాయి)
 

Advertisement
 
Advertisement
Advertisement