ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.
జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్‌ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది.
ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది.
కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్‌పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్‌ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది.


