బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కల బెడద మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు ఉదాసీనంగా ఉండటం రాజ్యానికి సాధ్యంకాదని మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకూ, జంతు ప్రేమికులకూ కళ్లు తెరిపించాలి. మనిషి ప్రాణమా, శునకాల ప్రాణమా... ఏది ప్రధానం అనే సమస్య తలెత్తినప్పుడు మానవ జీవితమే సర్వోన్నతమైనదనీ, జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ విషయంలోనూ వర్తిస్తుందనీ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పడం గమనించ దగ్గది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనలు సవ్యంగా అమలైతే ఈ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉండిపోయాయి. దాని పర్యవసానమే తాజా తీర్పు.
గ్రామాలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా జనావాసాలన్నిటా శునకాలు తారసపడతాయి. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు... ఒకటేమిటి ఎక్కడికెళ్లినా వీధికుక్కల బెడద తప్పడం లేదు. అవి సవ్యంగానే ఉన్నాయా, ప్రమాదకరమైన జబ్బులతో ఉన్నాయా అని ఆరా తీసేవారుండరు. వాటి నియంత్రణ కర్తవ్యమని భావించే యంత్రాంగం ఎక్కడా కనబడదు. అలాగని వాటిని బంధించి, అత్యంత క్రూరంగా చంపటం కూడా పరిష్కారం కాదు. అనుకోని దురదృష్ట కర సంఘటన జరిగినప్పుడు మున్సిపల్ సిబ్బంది కుక్కలవేట మొదలెట్టడం, సద్దుమణి గాక ఊరుకోవటం రివాజుగా మారింది. మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నప్పుడూ, ఎవరైనా వాటిని విషాహారంతో చంపినప్పుడూ జంతు ప్రేమికులు రంగప్రవేశం చేసి కేసులు పెడతారు. ఎల్లకాలమూ ఇదిలా కొనసాగుతూనే పోవటం సరికాదు. ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడితీరాలి.
కుక్కల బెడదవల్ల ఎదురయ్యే సమస్యలు తక్కువేమీ కాదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 8 కోట్ల వీధికుక్కలున్నాయి. ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమా సికంలో దాదాపు లక్షన్నర కేసులు నమోదైనట్టు అంచనా. తమిళనాడు, కర్ణాటకల్లో ఈ సంఖ్య 4.5 లక్షలవరకూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రేబిస్ వ్యాధిబారినపడి దేశ వ్యాప్తంగా ఏటా 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విష యమేమంటే... ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే కుక్కకాటు మరణాల్లో మన దేశం వాటా 36 శాతం. అందుకే ప్రమాదకర కుక్కలకు కారుణ్యమరణం ప్రసాదించ వచ్చనీ,అంత ప్రమాదంలేని వాటిని జనావాసాలనుంచి తొలగించాలనీ తీర్పు స్పష్టం చేసింది.
కుక్కకాట్లవల్ల సామాన్యులకూ, ప్రభుత్వాలకూ కూడా ఆర్థికభారం తప్పడంలేదు. బాధితులకిచ్చే పీఈపీ వాక్సిన్లకూ, ఇంజక్షన్లకూ ప్రభుత్వాలు వందలకోట్లు వ్యయం చేస్తున్నాయి. అయినా వీటి లభ్యత సరిగా లేదు. బాధితుల్లో అత్యధికులు రెక్కాడితేగానీ డొక్కాడని సాధారణ జనం. చిన్నా చితకా వ్యాపారాల కోసమో, ఉపాధికోసమో వెళ్లే వారు, చెత్త ఏరుకుని జీవించేవారు. వీరంతా పనులు మానుకుని ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు. పాశ్చాత్య దేశాలు వీధికుక్కల్ని నియంత్రించి, వాటి బెడద లేకుండా చేయగలిగినప్పుడు మన దేశంలో ఎందుకు సాధ్యపడదు? ఏబీసీ నిబంధనలు పాటించని ప్రభుత్వ విభాగాలను జంతు ప్రేమికులో, మరొకరో నిలదీయరు.
అది తమ బాధ్యతగా భావించరు. సమస్య ఉగ్రరూపందాల్చాక చర్యలు మొదలైతే మాత్రం ఆందోళనకు దిగుతారు. వీధికుక్కల్ని జనావాసాలనుంచి షెల్టర్లకు తరలించాలని నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని 51ఏ (జి) అధికరణం మూగజీవాలపట్ల కారుణ్యంతో మెలగాలని చెబుతోంది. దాన్ని పాటిచాల్సిందే. కానీ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగితే పట్టనట్టు ఉండకూడదు. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు ప్రభుత్వాల కర్తవ్యాన్ని గుర్తుచేయటమేకాక,అవి విఫలమైన పక్షంలో ఎలాంటి చర్యలుండాలో సూచించింది. అందుకే ఇది ఆహ్వానించదగ్గ తీర్పు.


