తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.
ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.
ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్‌లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి.
పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్‌లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?
సర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి.


