డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం? | Sakshi Editorial On Chandrababu Govt DSC scam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?

May 27 2026 1:40 AM | Updated on May 27 2026 1:41 AM

Sakshi Editorial On Chandrababu Govt DSC scam

అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్‌గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్‌లీక్‌ మొదలు కొని స్పోర్ట్స్‌ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.

జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్‌లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. 

ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్‌ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్‌ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్‌లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. 

దేశం మొత్తం ‘నీట్‌’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్‌ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్‌ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్‌ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్‌ను బర్తరఫ్‌ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement