నేపాల్‌లో మారిందేమిటి?! | Sakshi Editorial On Nepal Issues | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో మారిందేమిటి?!

Apr 1 2026 12:46 AM | Updated on Apr 1 2026 12:46 AM

Sakshi Editorial On Nepal Issues

తిరుగుబాటు గాలి ఒకచోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్నచోటకల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులూ, ప్యాలెస్‌లూ వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్‌లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి హుటాహుటీన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావొచ్చు... నేపాల్‌లో సైతం జెన్‌ జీ తరం నిరుడు సెప్టెంబర్‌లో అధికార పీఠాలను కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపర్, కఠ్మాండు మేయర్‌ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతోపాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. 

ఆ రకంగా నేపాల్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని, సీపీఎన్‌(యూఎంఎల్‌) అధినేత కేపీ శర్మ ఓలిని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేను నిరుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన సంగతి నిజమే అయినా, ఆ వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్‌లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్‌ రెహ్మాన్‌ ప్రకటించి ఇంతవరకూ విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ ఇప్పటికీ భారత్‌ను కోరుతున్న మాట వాస్తవమే అయినా, అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే దానికి ఉన్నట్టు కనబడదు.  

నేపాల్‌లో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన నిరసనోద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలిని, అప్పటి హోంమంత్రి రమేష్‌ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్‌ కొత్త కేబినెట్‌ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్‌ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్‌ ఓలి అపరాధాన్ని నిర్ధారించలేదు. కానీ కాల్పులను ఆయనగానీ, లేఖక్‌గానీ ఆపలేకపోయారని తెలిపింది. 

నేపాల్‌లో ఉద్యమకాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంటు ఆవరణలో, కోర్టుల్లో గుంపులు జొరబడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతాదళాలు మౌనంగా ఉండగలవా? అయితే ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతోకాక వారి ప్రాణాలు తీయ టానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి కారకుల్ని శిక్షించాల్సిందే. కానీ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రిపబ్లిక్‌ గా ఏర్పడ్డాక నేపాల్‌లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలూ బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజయింది. వీటన్నిటినీ చూసి తీవ్రంగా కలతచెందబట్టే జెన్‌ జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇక ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరేసరి. 

అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్‌ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతోకొంత మిగిల్చి కుటుంబాలకు పంపటం మామూలే. అలా పంపుతున్న డబ్బే నేపాల్‌ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. తయారీరంగ పరిశ్రమలపైనా, ఇతర ప్రాజెక్టులపైనా దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటానికి బదులు కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టి తాను గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement