ప్రతియేటా ఇంచుమించు మే నెల మొదటి వారానికిగానీ ఉగ్రరూపం దాల్చని మార్తాండుడు ఈసారి ఫిబ్రవరి నెలాఖరునాటికే చెలరేగడం మొదలెట్టాడు. ముందే రావటం, దీర్ఘకాలం తిష్టవేయటం కొన్నాళ్లుగా కనబడుతున్నా ఈ స్థాయిలో ఎండలు మండిపోవటం ఇదే తొలిసారి. మన దేశంలో రుతువులు గతి తప్పి చాన్నాళ్లయింది. గతంలో పొద్దుటిపూట ఒక రకం, రాత్రికి మరో రకం వాతావరణం దర్శనమిచ్చేవి.
ఎంత ఎండాకాలమైనా రాత్రికి ఎటునుంచో వచ్చి చల్లని గాలులు తాకేవి. సేదతీర్చేవి. ఇప్పుడు రాత్రింబగళ్లు తేడా లేదు. వేడిగాలుల వెనకే హఠాత్తుగా వాతావరణం మారి, జల్లులు మొదలై వడగళ్లు పడటం రివాజుగా మారింది. అటు తర్వాత కాసేపటికే ఉక్కబోత మొదలవుతోంది. ప్రకృతికి సంబంధించినంతవరకూ ఉత్తర దక్షిణాలన్న తేడా... మధ్య, పశ్చిమ భారత్‌లన్న వ్యత్యాసం లేదు. వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నదాన్నిబట్టి ప్రస్తుతం 23 రాష్ట్రాలకు వడగాడ్పుల తాకిడి ఉంది. అందులో డజనుకుపైగా తీవ్ర వడగాడ్పులను చవిచూస్తున్నాయి.
వందలాది నగరాలు భరించలేనంత ఉక్కబోతతో విలవిల్లాడుతున్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలూ ఇప్పటికైతే ఈ సమస్యకు దూరంగా ఉంటున్నాయి. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల పర్యవసానంగా భవిష్యత్తులో ఇవి సైతం భానుడి ప్రతాపాన్ని చవిచూడకతప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు.
సాధారణ ఉష్ణోగ్రతలకన్నా కనీసం 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువుంటే, అది వరసగా రెండ్రోజులు కొనసాగితే వడగాడ్పులు వీస్తున్నట్టు లెక్కేస్తారు. అది 7 డిగ్రీల సెల్సియస్‌కి మించి పెరిగితే తీవ్ర వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఒక ప్రాంతం మైదానమా, కొండలతో ఉందా అనే అంశాన్ని కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
బొంబాయి ఐఐటీ ఇటీవల చేసిన అధ్యయనంలో గంగా–సింధు మైదానం (ఉత్తర భారతం)లో వేడిగాలులకు స్థానిక నేలలు, ఇతర వాతావరణ పరిస్థితులు కారణమని తేల్చింది. వెలుపలినుంచి వచ్చే వేడిగాలులే ఇందుకు దోహదపడుతున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత పెరగడంతో వేడిగాలులు భూ ఉపరితలానికి దగ్గరగా ఉండిపోతున్నాయి. నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారురోడ్లు పగలంతా తీవ్ర ఉష్ణోగ్రతను స్వీకరించి, రాత్రికి సైతం సెగలు కక్కుతూనేవుంటున్నాయి. అందుకే ఇంతచేటు తీవ్రత!
వరదలు, తుపానులు, భూకంపాల్లాగే వడగాడ్పులు కూడా ప్రకృతి వైపరీత్యమే. కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. వడగాడ్పులవల్ల ఏటా వందలాది మరణాలు సంభవిస్తున్నా, ఆ విధంగా లెక్కేయటానికి తగిన విధానం రూపొందలేదు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ లేదా అంతకన్నా ఎక్కువకు చేరి, శరీరంలో చెమట పట్టడం ఆగిపోయి చర్మం పొడిబారి ఎర్రగా మారితే, స్పృహ కోల్పోవటం లేదా మతిస్థిమితం తప్పడం, మూర్ఛరావడం వంటివి కనబడితే వడగాడ్పు మరణమని చెబుతారు.
వీటికితోడు బాధితుడున్న ప్రాంతంలో వడగాలుల హెచ్చరిక ఉందా, అతను మరణించటానికి ముందు ఎండలో పనిచేశాడా లేదా అనేవి కూడా చూస్తారు. ఆ తర్వాతే వడగాడ్పు మరణంగా నిర్ధారిస్తారు. గుండెజబ్బు వగైరాలున్నా, వృద్ధాప్యంలో ఉన్నా ఆ జాబితాలో లెక్కేయరు. ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరి మారాలి. వేసవిలో మరణాల రేటు గత కొన్నేళ్లలో ఎలావుందో చూసే విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఆ కొలమానాన్ని తీసుకోవటం లేదు?
పదహారో ఆర్థిక సంఘం నిరుడు ఇచ్చిన నివేదికలో వడగాడ్పుల్ని, పిడుగుపాటుల్ని కూడా ప్రకృతి విపత్తులుగా పరిగణించాలని కోరింది.
చాలా రాష్ట్రాలు ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాయి. అలా లెక్కేస్తే అందుకు సంబంధించిన నిధుల్ని సహాయ కార్యక్రమాల కోసం వ్యయం చేయటానికి, బాధితులకు తక్షణ సాయం అందించటానికి వీలవుతుంది. వడగాడ్పులున్న ప్రాంతాల్లో భవన నిర్మాణం, సాగుపనుల సమయాలను మార్చటానికి, విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళల్ని సవరించటానికి వీలవుతుంది. అందుకే ప్రభుత్వాలు తక్షణం కదలాలి. అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. జనం ప్రాణాలు కాపాడాలి.


