మళ్లీ వరదకష్టాల్లో ముంబై | Sakshi Editorial On Mumbai Floods | Sakshi
Sakshi News home page

మళ్లీ వరదకష్టాల్లో ముంబై

Jul 8 2026 12:42 AM | Updated on Jul 8 2026 12:42 AM

Sakshi Editorial On Mumbai Floods

ఎప్పటి మాదిరే ముంబై మహానగరం భారీ వర్షాలతో తడిసి ముద్దయింది. గత ఆరు రోజుల కుంభవృష్టితో 13 మంది మరణించారు. జనావాసాలు వరద నీట మునగడం, చెట్లు కూలడం, రోడ్ల ఆచూకీ తెలియకుండా పోవటం, ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించి వాహనదారులు దిక్కుతోచని స్థితికి చేరటం, రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవటం, విద్యాసంస్థలన్నీ మూతపడటం, పరీక్షలు వాయిదాలు పడటం... ఇవన్నీ దాదాపు ప్రతియేటా ముంబై ప్రజలకు రివాజుగా మారాయి. ఒక పిటిషన్‌ విచారణ సందర్భంగా మంగళవారం బృహన్ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ)ని అనవసరంగా నిందించవద్దని బొంబాయి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూదురాక్రమణలకు పాల్పడటం, పేవ్‌మెంట్లు ఆక్రమించటం, చెత్తను ఎక్కడికక్కడ మురికి కాల్వల్లోకి తోసేయటం వంటి ధోరణులే సమస్యల్ని సృష్టిస్తున్నాయని తెలిపింది. అది నిజమే కావొచ్చుగానీ... అలాంటి ధోరణులను అరికట్టే బాధ్యత కూడా బీఎంసీదే. ఆ విషయంలో అది విఫలం కావటంవల్లనే ప్రతియేటా సమస్యలు తప్పడంలేదు. 

వానాకాలం వచ్చిందంటే ముంబైలో పెనుగాలులు, కుంభవృష్టి ఏకకాలంలో విరుచుకుపడుతుంటాయి. భౌగోళికంగా ముంబై ఉన్న స్థానం అటువంటిది గనుక ఇది అనివార్యమైన పరిస్థితి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందేమిటన్న అంశంపై సమగ్ర దృష్టి సారిస్తే పరిష్కారం లభించకపోదు. ప్రభుత్వాలు ఆ పని చేయవు. బీఎంసీ ఒత్తిడి తీసుకురాదు. ముంబై ఒకప్పుడు ఏడు దీవుల సమాహారం. వాటిమధ్య 1784 నుంచి 1845 వరకూ మట్టి నింపుతూ పోవటం వల్ల ఇప్పుడున్న భౌగోళిక రూపం వచ్చింది. సముద్ర మట్టానికి ఈ నగరం కేవలం 14 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొన్నిచోట్ల ఒకటి, రెండు మీటర్లకు మించి లేదు. ముంబై వరదనీటì  కోసం నాలుగు నదులున్నాయి. నాలాలున్నాయి. వీటి ద్వారా నీరంతా సముద్రంలో కలుస్తుంది. కానీ వర్షాల తీవ్రత వుండి, సముద్రపు పోటు అధికంగా ఉంటే ఇవి అక్కరకు రావు. భూ మాఫియాల పుణ్యమా అని తీరాన ఉన్న మడ అడవులు, చిత్తడి నేలలు మాయమై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారుతుంటే నిలువరించే వ్యవస్థలు లేవు. బ్రిటిష్‌ కాలంనాటి డ్రెయినేజీ వ్యవస్థ, కాంక్రీట్‌ నిర్మాణాలు, మరోపక్క వలసలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.

నీటితో కలిసి జీవించటం అలవాటు చేసుకుంటే, అందుకనుగుణమైన జీవన విధానం అలవరుచుకుంటే ఇంత చేటు సమస్య ఉండదు. టోక్యో నగరం ఇందుకు ఉదాహరణ. అక్కడ ప్రతియేటా తుపాన్లు తప్పవు. పర్యవసానంగా వరదనీరు ముంచె త్తుతుంది. దీన్ని అధిగమించటం కోసం 2006లో ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ వరద నీటి మళ్లింపు వ్యవస్థను నిర్మించింది. నగరం కింద 50 మీటర్ల లోతులో 6.3 కిలోమీటర్ల పొడవునా భారీ టన్నెళ్లు ఏర్పరిచారు. భారీ వరద నీరు ముంచెత్తినప్పుడు అదంతా ఆ టన్నెళ్లకూ, అక్కడినుంచి అయిదు అతి పెద్ద బావుల్లోకీ... వాటినుంచి భారీ భూగర్భ ట్యాంకుల్లోకీ పోతుంది. అక్కడినుంచి శక్తిమంతమైన జెట్‌ ఇంజన్‌ పైపులతో ఆ నీటిని తోడి నగరం ఆవలి భాగంలోని ఎడొగావా నదిలోకి పంపుతారు. చైనాలోనూ స్పాంజ్‌ సిటీల పేరుతో నీటిని ఎప్పటికప్పుడు భూమిలోకి పంపే రంధ్రాలున్న రోడ్లు నిర్మించారు. నగరాల చుట్టూ కృత్రిమంగా చిత్తడి నేలలు ఏర్పరిచారు. ఇవన్నీ వర్షపు నీటిని పీల్చుకుని భూగర్భ జలాలుగా మారుస్తాయి. సాధారణ రోజుల్లో పిల్లలకు ఆట స్థలాలుగా, భారీ వర్షాల సమయంలో తాత్కాలిక చెరువులుగా మారే వాటర్‌ స్క్వేర్‌లు నిర్మించి రోటర్‌డ్యామ్‌ నగరాన్ని నెదర్లాండ్స్‌ ప్రభుత్వం కాపాడుకుంది. 

ముంబై నగరాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టడం కాక, అందుబాటులోని సాంకేతికతల సాయంతో తగిన ప్రణాళికలు రచించుకుంటే అక్కడి ప్రజలకు ప్రతియేటా ఈ తిప్పలు తప్పుతాయి. మాఫియాలను నియంత్రించటం, మౌలిక సదుపాయాలు... ముఖ్యంగా రవాణాను మెరుగుపరచటం వంటివి చేస్తే నగరం కిక్కిరిసిపోయే పరిస్థితిని నివారించవచ్చు. బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వెడల్పు పేరుతో భారీ ప్రాజెక్టులు చేపట్టి అవి ఏళ్లతరబడి కొనసాగించటంవల్ల జనజీవనం స్తంభించిపోతోంది. వర్షాకాలం ఇదంతా అనేక రెట్లు పెరుగుతోంది. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement