ట్రంప్‌కు మళ్లీ భంగపాటు | Sakshi Editorial On US President Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు మళ్లీ భంగపాటు

Jul 2 2026 1:40 AM | Updated on Jul 2 2026 1:40 AM

Sakshi Editorial On US President Donald Trump

చరిత్ర తెలుసుకోకుండా, తన పరిమితులేమిటో గ్రహించకుండా ఎడాపెడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి మరోసారి చుక్కెదురైంది. అమెరికా గడ్డపై జన్మించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వటం కుదరదంటూ నిరుడు జనవరిలో ట్రంప్‌ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును మంగళవారం కొట్టేస్తూ, 6–3 మెజారిటీతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన ఉత్తర్వును ట్రంప్‌ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ కేసు వాద ప్రతివాదాల సమయంలో స్వయంగా హాజరయ్యారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా రావటం ఇదే తొలిసారి. తమ తప్పుడు నిర్ణయాలవల్ల దేశంలో అస్తవ్యస్థ స్థితిగతులు ఏర్పడినప్పుడు జనం దృష్టి మళ్లించేందుకు లేదా మిన్ను విరిగి మీద పడే అతి గొప్ప చర్యలు తీసుకుంటున్న అభిప్రాయం వారిలో కలిగించేందుకు ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తారు. అలాంటివారిలో అగ్రగణ్యుడు ట్రంప్‌. నిజానికి సుప్రీంకోర్టులో రిపబ్లికన్‌లవైపు మొగ్గుచూపే న్యాయమూర్తుల సంఖ్య అధికంగానే ఉంది. 

కనుకనే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధిని దాటుతూ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు అనుకూలంగా ఈ రెండేళ్లలోనూ తీర్పులు వెలువడ్డాయి. అయితే అనేక దేశాలపై అధిక సుంకాల విధింపు, ఇప్పుడు జన్మతః పౌరసత్వం అంశాల్లో మాత్రం ఆయన నిర్ణయాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేక పోయింది. ఇది భవిష్యత్తులో అనేకానేక సమస్యలకు దారి తీస్తుందని గ్రహించింది. ట్రంప్‌ రెండో ఏలుబడి మొదలయ్యాక న్యాయమూర్తులకు పనిభారం బాగా పెరిగింది. అందుకే హేతుబద్ధత లేకుండా, బహిరంగ విచారణైనా జరపకుండా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. అక్రమ వలసల పేరుచెప్పి జాతి, భాష వంటి కారణాలతో వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ వందలమంది భద్రతా బలగాలు విరుచుకుపడటం, అరెస్టులు చేయటం వగైరాలను సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా సమర్థించింది. ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లపై కోత విధించటం, జాతి, లింగపరమైన మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకూ న్యాయమూర్తులు మద్దతుపలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది.  

ఆసియాలో మనతో సహా పలు దేశాల్లోనూ... యూరప్, ఆఫ్రికా ఖండ దేశాల్లోనూ జన్మతః పౌరసత్వం ఇవ్వరు. అయితే అమెరికాలో కొన్ని చారిత్రక కారణాలవల్ల ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14 పొందుపరిచారు. అమెరికా వలసవచ్చిన వారి తోనే నిర్మాణమైంది. అంతర్యుద్ధం ముగిసి, బానిసత్వం రద్దుకావటం వంటి పరిణామా లతో 1857లో నల్లజాతీయులు అమెరికా పౌరులు కాలేరంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. నల్లజాతీయుల్ని పీల్చిపిప్పిచేసి సంపద పెంచుకున్న అమెరికా ఇంత కృతఘ్న తతో ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు జరిగాక 1868లో ఈ 14వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. నల్లజాతికి చెందిన మాజీ బానిసలు, వారికి పుట్టిన సంతానం దేశ పౌరులే అవుతారని ఈ సవరణ స్పష్టం చేసింది. చైనా వలస కుటుంబానికి ఇది వర్తించబోదని ప్రభుత్వం నిరాకరించినప్పుడు అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే అవుతారని 1898లో సుప్రీంకోర్టు తెలియజేసింది. 

ట్రంప్‌ ఉత్తర్వు ఏడాదిన్నరగా లక్షలాదిమందిని అనిశ్చితిలో పడేసింది. రెండేళ్ల క్రితం అమెరికా సెన్సెస్‌ బ్యూరో దేశంలో 52 లక్షలమంది భారతీయులున్నారని చెప్పింది. నిరుడు వెలువడిన లెక్క ప్రకారం హెచ్‌–1బీ వీసాలున్నవారిలో 71 శాతం మంది భారతీయులే. వీరందరికీ తాజా తీర్పు ఊరటనిస్తుంది. అయితే గ్రీన్‌కార్డుకు దరఖాస్తుచేసి ఎదురుచూస్తున్నవారికి ఈ తీర్పువల్ల ఉపశమనం దొరకదు. అక్కడ జన్మించినవారి పిల్లలు దేశ పౌరులుగా మారినా, తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పవు. తమ వీసా దరఖాస్తుల్లో అబద్ధం చెప్పి దేశంలో ప్రవేశించినవారి ఆచూకీ తెలుసుకోవటం, వారిపై ప్రాసిక్యూషన్‌ చర్యలు ప్రారంభించటం తమ ప్రాధాన్యతంటూ అమెరికా న్యాయశాఖ చెప్పటం సహజంగానే గుబులు రేపుతోంది. తీర్పు వెలువడ్డాక కూడా కొత్తగా చట్టం తీసుకొస్తానంటూ ట్రంప్‌ చెప్పటం ఆయన మొండివైఖరికి నిదర్శనం. ఇప్పటికైనా వివేకంతో మెలగటం, అసలైన సమస్యలపై దృష్టిసారించటం అవసరమని ఆయన గ్రహించాలి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement