‘మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని’ అంటాడు శ్రీశ్రీ. మానవ జీవనప్రస్థానం గోడలు లేని దశ నుంచి గోడలు కట్టుకునే దశకు చేరుకుని ప్రస్తుతానికి అక్కడే స్థిరపడింది. గోడలు లేని దశ గురించిన స్పృహ మనిషిలో అంతరించి గోడలు కట్టుకోవడమే స్వాభావికమూ, స్థిరమూ, సత్యమనే భావన బలపడింది. గోడలు కట్టుకో వడం రకరకాల రూపాలలో జరుగుతుంది. వర్ణం, కులం, ప్రాంతం, దేశం, భాష మొదలైనవి కొన్ని మాత్రమే! దేశాల విషయానికి వస్తే, గోడలను సరిహద్దుల పేరుతో పిలుచుకుంటాం. కానీ, ప్రకృతినే గమనిస్తే, సరిహద్దులు లేనిదే ప్రకృతి అనీ, సరిహద్దులు గీసు కోవడం వికృతి అనీ ఇట్టే బోధపడుతుంది. భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశమనే పంచ భూతాలు సరిహద్దులనెరుగవు; ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరాఘాటంగా వ్యాపిస్తాయి.
మొదట్లో మనిషి కూడా అలా వ్యాపించినవాడే. కాలగతిలో సరిహద్దులు నిర్మించు కోవడానికి అలవాటుపడ్డాడు. ఆ విధంగా సరిహద్దులు లేని దశ నుంచి సరిహద్దుల దశకు చేరుకోవడం మనిషి భౌతిక, బౌద్ధిక వికాసంలో మెరుపులీనే మైలురాయి కావడం విచిత్రం; అదే అతని చరిత్రలో ఒక విరోధాభాస. అదే సమయంలో, తన మేధనూ, మేధాగతమైన జ్ఞానాన్నీ సరిహద్దులను దాటించి పరస్పరం పంచుకున్న, పంచుకుంటున్న అనుభవమూ మనిషికి ఉంది. అయినాసరే, తనే కల్పించుకున్న కృత్రిమ సరి హద్దులే నిజమని నమ్మి ఆ ఇరుకులో కూరుకుపోవడమే అతనిలోని వైరుద్ధ్యం.
‘జ్ఞాన’మనే మాటనే తీసుకోండి. తెలుగులో ఎరుక, తెలివి, తెలివిడి మొదలైన పర్యాయపదాలు ఉన్నప్పటికీ, వాటికన్నా ఎక్కువగా జ్ఞానమనే మాటే ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి ఈ మాట నేటి మనదేశపు సరిహద్దులకు బయట ఆరువేల సంవత్స రాల క్రితం మాట్లాడిన ప్రోటో–ఇండో యూరోపియన్ భాష నుంచి పుట్టింది. వ్యుత్పత్తి పదనిఘంటువు ప్రకారం, ‘తెలుసుకోవడ’మనే అర్థమిచ్చే ‘గ్నో’ అనే ప్రోటో–ఇండో యూరోపియన్ మూలపదం నుంచి ‘టు నో’, ‘నాలెడ్జ్’, ‘ఎకనాలెడ్జ్’, ‘కాగ్నిషన్’, ‘డయో గ్నొసిస్’, ‘ఇగ్నొరెంట్’, ‘ఇగ్నోర్’, ‘నొబిలిటీ’ వంటి మాటలు రూపొందాయి. ఇదే సంస్కృతంలో ‘జ్ఞ’గా మారి ‘జ్ఞాన’మనే మాటను పుట్టించింది. పర్షియన్ల అవెస్తాలో జ్ఞానమనే అర్థంలో ‘జయింతి’గా, ఓల్డ్ చర్చి స్లవోనిక్‌లో గుర్తించడమనే అర్థంలో ‘జ్ఞన్టి’గా, తెలుసుకోవడమనే అర్థంలో రష్యన్‌లో ‘నాట్’గా, గ్రీకులో ‘నాత్స్’గా, తెలిసినదనే అర్థంలో ఐరిష్‌లో ‘గనాత్’గా మారింది.
అలాగే, అతి ప్రాచీనకాలం నుంచీ, ఆధునిక కాలం వరకూ జ్ఞానప్రసారం కూడా అన్ని రకాల సరిహద్దులనూ దాటి జరుగుతూనే ఉంది. మనదేశానికి సంబంధించే చెప్పు కుంటే, సున్నాను, జ్యోతిశ్శాస్త్రాన్ని ఇచ్చిన ఆర్యభట్టు; శస్త్రచికిత్సలో మార్గదర్శి అయిన సుశ్రుతుడు, రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రసిద్ధుడైన సీవీ రామన్ మొదలుకొని – ప్రాచీన గ్రీసుకు చెంది, తర్కాన్ని, శాస్త్రవిజ్ఞానాన్ని ఇచ్చిన అరిస్టాటిల్; క్షేత్రగణితాన్ని ఇచ్చిన పైథాగరస్; వైద్యశాస్త్రాన్ని ఇచ్చిన హిపోక్రటెస్ – యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెంది, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, కలన గణితా(కేల్క్యులస్)న్ని ఇచ్చిన న్యూటన్, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చాల్స్ డార్విన్, కంప్యూటింగ్‌ను ఇచ్చిన అలాన్ ట్యూరింగ్– జర్మనీకి చెంది, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఇచ్చిన మాక్స్ ప్లాంక్ వరకూ, సరిహద్దులకు అతీతంగా యావత్ప్రపంచ దీప స్తంభాలుగా నిలిచి జ్ఞానకాంతిని విశ్వవ్యాప్తం చేసిన మేధాభాస్కరులు ఎందరెందరో!
అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలితాలు, పరికరాలతో సహా అన్ని రంగాలలో అన్ని దేశాలవారూ ప్రసాదించిన జ్ఞానభిక్షను అందుకుంటూ, పంచుకుంటూ జీవితాన్ని అన్నివిధాలా తేజోవంతం చేసుకుంటూనే; అనేకానేక సరిహద్దుల సంకెళ్ళతో తనను తాను బంధించుకుంటూ సరిహద్దులెరుగని ప్రాపంచిక జ్ఞానానుభవాన్ని గుర్తించలేక పోవడమూ మనిషికే చెల్లింది. ప్రకృతి మరే జీవజాలానికీ ఇవ్వని వరాలను మనిషి కిచ్చింది; కానీ వాటికి తనవైన శాపాలను జోడించుకుంటూ జీవితాన్ని ముళ్ళకంపగా మార్చుకునే అవివేకతలో కూడా మనిషికి మరే జీవీ సాటిరాదు. ప్రకృతి గీసిన హద్దుల్లో జీవించడమే తప్ప స్వయంగా హద్దులు గీసుకోవడం చేతకాని జీవులే మనిషి కన్నా సుఖంగా జీవిస్తున్నాయనిపిస్తుంది. సరిహద్దులెరుగని వసుధైక భావన దిశగా మనిషి పునఃప్రస్థానం ఇంకా ఎప్పటికి?!


