ఉబుసుపోని పనులు | Sakshi Editorial On Boring tasks issue | Sakshi
Sakshi News home page

ఉబుసుపోని పనులు

Apr 27 2026 1:16 AM | Updated on Apr 27 2026 1:16 AM

Sakshi Editorial On Boring tasks issue

ఉబుసుపోని మనుషులు రకరకాల పనులు చేస్తారు. ఉబుసుపోని పనులకు అర్థం, పరమార్థం ఉండవు. ఉబుసుపోని మనుషులు నలుగురూ ఒకే చోటుకు చేరితే పోసుకోలు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కుదిరితే చతుర్ముఖ పారాయణాన్ని ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉబుసుపోని మనుషులు– అభిరుచి మేరకు పుస్తక పఠనంలోనో, కళాసాధనలోనో నిమగ్నమవుతారు. అంతటి అభిరుచులేవీ లేకుంటే, ఊరకే పడక్కుర్చీలో కూర్చునో, మంచంమీద వాలిపోయో పగటికలలు కంటారు. ఉబుసుపోని మనుషులకు పొరపాటున అదృష్టం బాగుండని అర్భక శ్రోతలెవరైనా దొరికితే, ఆవకాయ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు అనర్గళంగా ప్రసంగించి, మేధాప్రదర్శన చేస్తారు. ఉబుసుపోని మనుషులు ఇది చేస్తారు, అది చేయరని నియమాలేమీ లేవు. ఉబుసుపోని సందర్భాల్లో మనుషులు తమ బుద్ధికి తోచిన పనులు చేస్తారు.

ఉబుసుపోనితనం, దానివల్ల కలిగే విసుగు మనిషిని కుదురుగా ఉండనివ్వవు. రోజులు రొడ్డగొట్టుడుగా మారిపోయినప్పుడు; దినచర్యలో మార్పు లేనప్పుడు; జీవితంలో ఉత్తేజం లోపించినప్పుడు; బతుకు బొత్తిగా నిరర్థకంగా మారిపోయిందని అనిపించినప్పుడు– మనిషికి ఉబుసుపోనితనం ఏర్పడుతుంది. దానివల్ల విసుగు పుడుతుంది. విరామ సమయాలను అర్థవంతంగా గడపలేని దుఃస్థితి తటస్థిస్తుంది. విశ్రాంతి మనశ్శాంతిని ఇవ్వలేని పరిస్థితి వాటిల్లుతుంది. ఉబుసుపోనితనం గురించి తత్త్వవేత్తలు, మనస్తత్త్వవేత్తలు, సాహితీవేత్తలు అనేక నిర్వచనాలను ఇచ్చారు. కొందరు ఉబుసుపోనితనంలోని సానుకూలతలను చూశారు. ఇంకొందరు ఉబుసుపోనితనాన్ని బూచిలా చూశారు. ఆధునిక మానసికశాస్త్ర పరిశోధకులు ఉబుసుపోనితనం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగిస్తున్నారు. ‘ఉబుసుపోనితనం నైతికవాదులకు ఒక గడ్డు సమస్య. నిజానికి లోకంలో జరిగే సగానికి సగం పాపాలు ఉబుసుపోనితనం పట్ల భయం వల్ల జరిగేవే’ అన్నాడు ఇంగ్లిష్‌ తత్త్వవేత్త బెర్ట్రాండ్‌ రసల్‌. 

‘ఉబుసుపోనితనం: కోరికల కోసం కోరిక’ అన్నాడు సుప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌. ‘ఉబుసుపోనితనం– అనుభవం గుడ్డు పెట్టే కలల పక్షి’ అన్నాడు జర్మన్‌ తత్త్వవేత్త వాల్టర్‌ బెంజమిన్‌. ‘ఉబుసుపోనితనం మీద కాస్తంత దృష్టి పెడితే, అది నమ్మశక్యం కానంత ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నాడు అమెరికన్‌ వైద్య నిపుణుడు జాన్‌ కాబత్‌జిన్‌. బహుశా, ఈ మేధావులంతా తమ తమ జీవితాల్లోని ఉబుసుపోనితనంతోనే ఇన్నిన్ని పరిశోధనలు సాగించి ఉంటారు. ఉబుసుపోని స్థితిలో ఖాళీగా ఉన్న మనిషి బుర్రను ‘దయ్యాల కార్ఖానా’తో పోల్చాడు ఇంగ్లిష్‌ రచయిత జాన్‌ బున్యన్‌. ఉబుసుపోని ఖాళీ సమయాన్ని పనికిమాలిన సమయంగా చాలామంది పరిగణిస్తారు. కానీ, ఉబుసుపోనితనానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది ఆధునిక మనస్తత్త్వ శాస్త్రం. 

ఉబుసుపోని స్థితిలోనే మనిషిలోని సృజనాత్మకత రెక్కలు తొడుక్కుంటుందని ఇంగ్లండ్‌లోని సెంట్రల్‌ లాంకషీర్‌ వర్సిటీకి చెందిన మనస్తత్త్వ శాస్త్రవేత్తలు శాండీ మాన్, రెబెక్కా కాడ్‌మన్‌ కనుగొన్నారు. ఉబుసుపోని స్థితిలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం సహా పలు అద్భుత ఆవిష్కరణలు చేశాడని చెబుతారు. ‘మనిషిలోని జిజ్ఞాసకు, సృజనశీలతకు ఉబుసుపోనితనమే ఉత్ప్రేరకం’ అని ‘యాపిల్‌’ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ చెబుతుండేవాడు. ఉబుసుపోనితనం గురించి డేనిష్‌ తత్త్వవేత్త సోరెన్‌ కీర్కగార్డ్‌ దాదాపు రెండు శతాబ్దాల కిందటే ‘ద పవర్‌ ఆఫ్‌ నథింగ్‌నెస్‌’లో చర్చించాడు. ఇందులో ఆయన ‘ఉబుసుపోనితనం అన్ని దుర్మార్గాలకూ మూలం’ అని అభిప్రాయపడ్డాడు.

ఉబుసుపోనితనంతో చాలామంది అర్థంలేని పనులు చేస్తుంటారు. అక్కడక్కడా కొందరు అనర్థకరమైన పనులు కూడా చేస్తుంటారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో మాటినా అనే ఇరవై రెండేళ్ల ఉబుసుపోని కుర్రాడు ఏమీ తోచక అడవికి నిప్పుపెట్టి, కార్చిచ్చును రగిల్చాడు. ఉబుసుపోనితనం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అంతమాత్రాన ఉబుసుపోనితనం అనర్థాలకు హేతువు అని నిర్ధారణకు రావడం మాత్రం నిర్హేతుకమే అవుతుంది. ఉబుసుపోనితనమే లేకుంటే, ఐన్‌స్టీన్‌ వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఉండేవేనా?! 

Advertisement
 
Advertisement
Advertisement