బెంగాల్‌లో ‘ఎగ్జిట్‌’ డెమోక్రసీ? | Sakshi Editorial On West Bengal Elections and Exit Polls | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ‘ఎగ్జిట్‌’ డెమోక్రసీ?

May 3 2026 12:07 AM | Updated on May 3 2026 12:10 AM

Sakshi Editorial On West Bengal Elections and Exit Polls

జనతంత్రం

బెంగాల్‌ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్‌కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్‌ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్‌వైజర్‌ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్‌ కోసం మరో ఆదేశం జారీ అయింది.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్‌ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్‌ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్‌ఆర్‌ ఖన్నా, పిఎన్‌ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.

ఇప్పుడు ప్రణయ్‌రాయ్‌ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్‌ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఎంత సూపర్‌ హిట్‌ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్‌రాయ్‌ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్‌రాయ్‌లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్‌ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్‌ మాదిరిగా సెల్‌ఫోన్‌ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్‌ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.

మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్‌ పోల్స్, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో సక్సెస్‌ రేట్‌ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్‌ మై ఇండియా’కు సక్సెస్‌ రేట్‌ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్‌ రెండో దశ పోలింగ్‌ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్‌ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్‌ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.

మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్‌ ఎగ్జిట్‌ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్‌డీ ప్రదీప్‌ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్‌పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్‌ మై ఇండియా, కీలకమైన బెంగాల్‌ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో  వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్‌ గుప్తా బెంగాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్‌ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్‌ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?

ఒక్క బెంగాల్‌కు మాత్రమే కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్‌ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్‌ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్‌లోనే ‘సర్‌’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్‌లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్‌ భావిస్తున్నది. బెంగాల్‌ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్‌కు తోడు బెంగాల్‌ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్‌ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్‌ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.

కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్‌ నవాబు సిరాజ్‌ ఉద్దౌలాపై బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్‌లో ఇంగ్లిష్‌ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్‌లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్‌ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్‌ క్లైవ్‌ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్‌ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్‌లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్‌ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్‌ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.

అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్‌ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్‌ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్‌ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.

మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్‌ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్‌పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్‌ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్‌ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్‌తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement