జనతంత్రం
జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తుపెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఐదు దశాబ్దాల కింద ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రతియేటా బీజేపీ పాటిస్తున్నది. ఈయేడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి అకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ ‘దేశ చరిత్రలో ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింద’ని విమర్శించారు. పురాణాల్లోంచి నాలుగు సంస్కృత పంక్తులను సంగ్ర హించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ‘స్వాతంత్య్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్య్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతాము’ అని ఆయన సందేశానికి అర్థం.
ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. లక్షమందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి! భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌరహక్కులను సమస్త ప్రజానీకం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలవి! లాకప్ చిత్రహింసలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోటిమందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడకాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిది మేసిన నిరంకుశ క్షణాలవి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని అటు వంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖసంతోషాలుండవని ప్రధానమంత్రి ప్రబోధించారు.
కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బిహార్‌లో ప్రారంభమైంది. ఇప్పటికి పన్నెండు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో ఐదు కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చని పోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలనా కార్యక్రమం ఈ జూన్‌లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో పది శాతం మందిని జాబితాల నుంచి తొల గించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది అగమ్యగోచరం. తమ అనర్హతపై బిహార్‌లో 47 లక్షలమంది, బెంగాల్‌లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలదీ అదే కథ. ఈలోగా ఎన్ని కలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజను లైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగా లేనివారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్షపడినవారు, విదేశీయు లకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఐదు కోట్లమంది, ఉండే అవ కాశం ఉన్న మరో మూడు కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి?
సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే, అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలై నంత ఎక్కువమందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపి స్తున్నది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని (1950) రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి (1960)ని పార్లమెంట్ తయారు చేసింది.
ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్‌కు ముందు సాధా రణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమిత మవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక’ సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 (2) అనుమతినిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలోగానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లోగానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండా లని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.
పెద్దసంఖ్యలో అక్షరజ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలస లకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలిదశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఎన్యుమరేషన్ ఫాం నింపితే సరిపోతుంది. నలభయ్యేళ్ల లోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు ఉండే అవకాశం లేదు కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధ్రువీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి.
2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతోపాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పు లున్న మ్యాపింగ్ అయినవారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్‌వో ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవ లసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30 శాతం, ఏపీలో 24 శాతం మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్‌లో ఎదురయ్యే చిన్నచిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన ‘సూక్ష్మ పరిశీలకులకు’ సంక్రమించాయి.
ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలురకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి సహకరించి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత పది పదిహేను తరాలుగా ముర్షిదాబాద్‌లో నివసిస్తున్నారట! ఆ ఖాన్‌దాన్‌కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌర సత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్‌వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులిచ్చారట! ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగితజ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్దఎత్తున వెల్లడవుతున్నాయి.
సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా? లేదంటే జాతీయ స్థాయితోపాటు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిషన్‌లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశా లను వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చన్న అనుమానంతో దేశమంతటికీ ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏరకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశ యానికీ, ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్ని కల సంఘం వ్యవహార శైలికీ మధ్యన హస్తి మశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది.
ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపి స్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వో న్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమ మంచి సమ న్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా జాబితాలను శుద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు. కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్ర మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నవారిలో పేదవర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాము? ఇప్పటికే బెంగాల్, బిహార్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకా లకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురికాబోతున్నారు.
ఈమాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి! ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంతవరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. సర్ రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసిపట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్ని కల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓ)తో టీడీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో ‘మ్యాపింగ్’ చేసి నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎల్‌ఓల దగ్గర మాత్రమే ఉండా ల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. టీడీపీ బీఎల్‌ఏలు తమ పరిమితికి మించి ఎన్యూమ రేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్‌ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్‌ఏల గ్రూప్ కాల్స్‌లో అధికారులు మాట్లాడుతూ మార్గ నిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి.
ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానంగానీ, యంత్రాంగంగానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికత పైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్‌పోర్టు కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కానివారికి పాస్‌పోర్టు జారీ చేయరాదని పాస్‌పోర్టు చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పినదానికీ, అధికారి వివరణకూ మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు ఏదీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటరు జాబితాలో నమోదుకు అనర్హు లుగా మిగులుతున్న కోట్లాదిమంది పరిస్థితి ఏం కానున్నది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరి స్తుంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి/ స్వాతంత్య్రాల్లభతే పరమ్!’ అంటూ ప్రధాని చెప్పిన శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్‌గా మాత్రమే పనికొస్తుందా? సర్ ఎమర్జెన్సీ మీద సెటైర్‌గా పనికిరాదా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


