జీరో మార్కుల ‘నీట్‌’! | Sakshi Editorial On NEET Issue | Sakshi
Sakshi News home page

జీరో మార్కుల ‘నీట్‌’!

May 13 2026 12:48 AM | Updated on May 13 2026 12:48 AM

Sakshi Editorial On NEET Issue

ఉన్న ఊరునూ, అయినవాళ్లనూ వదిలి వేలాది రూపాయలు వెచ్చించి పట్టణాలు, నగరాలకొచ్చి రాత్రింబగళ్ల ధ్యాసే లేకుండా, తిండితిప్పలు పట్టించుకోకుండా ‘నీట్‌’ పోటీ పరీక్ష కోసం కోచింగ్‌ తీసుకోవటంలో తలమునకలైన లక్షలాదిమంది విద్యార్థులు మరోసారి దగా పడ్డారు. ఈ నెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2026 ప్రశ్నపత్రం లీకయిందంటూ ఆ పరీక్ష కాస్తా మంగళవారం రద్దుచేశారు. విద్యార్థులు ఈ వేసవిలో మళ్లీ తిప్పలుపడాలి... కోచింగ్‌ కోసం మరోసారి అవస్థలు పడాలి. పోటీ పరీక్ష రాశాక ఫలితాలకన్నా ముందు లీకయిందనే వార్తలొస్తాయేమో, మళ్లీ రాయకతప్పదేమోనని కంగారుపడేంతగా ఆ వ్యవస్థను నిర్వాహకులు భ్రష్టుపట్టించారు. పదే పదే ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత! ఒకసారి జరిగిందంటే అనుకోకుండా జరిగిందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఈసారి తగిన కట్టుదిట్టాలు చేస్తారని సరిపెట్టుకోవచ్చు. ప్రతియేటా ఇదే ప్రహసనమైతే ఏమనాలి? విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించటంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి ఎప్పుడూ సున్నా మార్కులే వస్తున్నాయి.

ఈసారి 22 లక్షలమందిపైగా ‘నీట్‌’ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశ వ్యాప్తంగా జరిగే హడావుడికి అంతులేదు. తనిఖీ పేరిట గేటువద్ద నిర్వహించే శల్య పరీక్షలతోపాటు ఆడపిల్లల ముక్కుపుడకలు, దుద్దులు మొదలుకొని పట్టాలవరకూ అన్నీ తీయించిగానీ లోపలికి పంపరు. ఒకటి రెండు నిమిషాలు లేటయ్యారని వెనక్కిపంపడం షరా మామూలు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, 5జీ జామర్ల ఆర్భాటం సరేసరి. పరీక్షార్థుల లేత ముఖాల్లో కనబడే ఆదుర్దా, వారికి తల్లిదండ్రులిచ్చే భరోసా చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారన్న వేదన కలుగుతుంది. మారుమూల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో సమాచారం రాబట్టుకునేంత సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అడుగడుగునా నిఘా నీడలు పరుచుకున్నాయని అర్థమ య్యేంతగా నిశితమైన చూపులు వెన్నాడుతుంటాయి. కానీ వాట్సాప్‌ మాధ్యమంలో వేలాదిమందికి ప్రశ్నపత్రం అందినా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటా వెనువెంటనే ఏ ప్రభుత్వా నికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యధిక శాతంమంది హాజరయ్యే పరీక్షల్లో ఒకటైన ‘నీట్‌’ను స్వచ్ఛంగా, నిర్దుష్టంగా, అవినీతిరహితంగా నిర్వహించుకోలేక పోవటం ఎంత నామర్దా! 

మంచికో చెడుకో ప్రజాస్వామ్యంలో ‘మెరిట్‌’కుండే ప్రాధాన్యత, దానికుండే గౌరవా దరాలు అపారం. ‘పుట్టకవల్లే ప్రతిభ’ అనే భావన నిరాకరించి, డబ్బుకొద్దీ చదువన్న వాదన తిరస్కరించి అందరికీ సమానావకాశాలు కల్పించటం మంచిదే. కానీ కోచింగ్‌ పేరిట  డబ్బులు దండుకునే వ్యవస్థ వచ్చిపడింది. హాజరైనవారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేయటానికి చిక్కుముడులతో ప్రశ్నలుంటాయి. ఉండే సీట్లు తక్కువ, ఆశించే పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని సరిపెట్టుకున్నా... పరీక్ష నిర్వాహకులకూ, ప్రభుత్వాలకూ పరువుప్రతిష్ఠలపై పట్టింపు ఉండొద్దా? సమర్థవంతంగా నిర్వహించి శభాష్‌ అనిపించుకుందామన్న తాపత్రయం కలగొద్దా? దేశవ్యాప్తంగా దాదాపు 400 మెడికల్‌ కళాశాలలు నిర్వహించే 40 వరకూ ప్రవేశపరీక్షలు రాయటం, అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావటం సమస్యాత్మకమవుతున్నదని 2016లో ‘నీట్‌’ తెచ్చి నప్పుడు చెప్పారు. వివిధ పరీక్షలకు వేర్వేరుగా సంసిద్ధం కావటంకన్నా ఒక్క పరీక్షతో ముగుస్తుందని అనేకులు సంతోషించారు. పైగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తరహాలో ఏర్పడే సంస్థ నిర్వహించే పరీక్ష పకడ్బందీగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎప్పుడు చూసినా లీకులు, మోసాలు, అవకతవకలు! 

పరీక్షకు పక్షంరోజులముందే ‘ఊహాజనితమైనవ’న్న పేరిట 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో చక్కర్లుకొట్టాయనీ, అటుతర్వాత దేశమంతా వ్యాపించాయనీ వస్తున్న వార్తలు నిజమైతే అంతకన్నా ఘోరం మరొకటుండదు. విద్యారంగంలో మాఫియా ముఠాల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. లక్షలాదిమంది జీవితాకాంక్షలను చిదిమేసే లీకుల్ని అరికట్టి తీరాలన్న సంకల్పం ఇప్పటికైనా పాలకుల్లో కలిగితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదు. 

Advertisement
 
Advertisement
Advertisement