ప్రమాదపుటంచుల్లో దేశాలు | Sakshi Editorial On America, Israel, Iran War Effect On world | Sakshi
Sakshi News home page

ప్రమాదపుటంచుల్లో దేశాలు

Apr 7 2026 12:58 AM | Updated on Apr 7 2026 12:58 AM

Sakshi Editorial On America, Israel, Iran War Effect On world

ఇజ్రాయెల్‌తో కలిసి ఏకపక్షంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్‌లైన్‌ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్‌లు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్‌ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్‌ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్‌కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలపై ఇరాన్‌ దాడులు చేసింది. ఇక ఇరాన్‌లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్‌ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్‌ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్‌ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.

నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్‌ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్‌ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్‌ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్‌ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. 

ట్రంప్‌ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్‌మిల్‌ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్‌ అల్లుడు జేర్‌డ్‌ కుష్నెర్, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్‌ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్‌ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్‌ బేనన్‌ వరకూ అందరిలోనూ వైట్‌హౌస్‌ను ‘ఇజ్రాయెల్‌ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్‌ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్‌ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్‌ జో కెంట్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. 

దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్‌ దేశాలపై ట్రంప్‌ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్‌ షాక్‌’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్‌ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్‌ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement