వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!
గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది.
గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘
సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా?
బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు.
అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు.


