కీలక పోరుకు సిద్ధం | Sakshi Editorial On West Bengal, Tamil Nadu Elections | Sakshi
Sakshi News home page

కీలక పోరుకు సిద్ధం

Apr 23 2026 1:20 AM | Updated on Apr 23 2026 1:20 AM

Sakshi Editorial On West Bengal, Tamil Nadu Elections

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ల భవితవ్యాన్ని తేల్చబోయే పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్‌లో గురువారం తొలి దఫాలో 152 స్థానాలకు పోలింగ్‌ జరగబోతుండగా, ఈ నెల 29న మరో 142 స్థానాలకు పోలింగ్‌ ఉంటుంది. తమిళనాట మాత్రం మొత్తం 234 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్‌ పూర్తవుతుంది. తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పర్వం ఎప్పుడూ ప్రశాంతమే. బెంగాల్‌లో మాత్రం మహోద్రిక్త వాతావరణమే అలుముకుంటుంది. పార్టీల వైరం సరేగానీ... ఎన్నికల సంఘం(ఈసీ) సైతం ఈ ఉద్రిక్తతలకు దోహదపడటం కొత్త పరిణామం. 

జనం తమవెంటే ఉన్నారా లేదా... వ్యూహం, ఎత్తుగడలూ కుదిరాయా లేదా అని పార్టీలు ఆత్ర పడటం సహజం. సాధారణ జనంలో సైతం కాబోయే విజేతలెవరు, పరాజితులెవరన్న ఆత్రుత ఉండితీరుతుంది. కానీ బిహార్‌ అనుభవం తర్వాతైనా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియను లోపరహితంగా పూర్తిచేద్దామన్న ఆత్రుత ఈసీలో లేకుండా పోయింది. అందువల్లే బెంగాల్‌లో 91 లక్షలమంది, తమిళనాడులో 70 లక్షలమంది ఓటర్లలో ఈసారి ఓటు వేయగలమా లేదా అన్న ఆందోళన ఏర్పడింది. బెంగాల్‌లో ట్రిబ్యునళ్లలో అప్పీల్‌ దాఖలు చేసి విజయం సాధించినవారికి ఓటేసే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇంత తక్కువ వ్యవధిలో ఎందరికి ఆ వరం దక్కుతుందో అనుమానమే. 

‘స్వచ్ఛమైన’ ఎన్నికల జాబితాతో పోలింగ్‌ జరిపితీరాలన్న ఈసీ దృఢ నిశ్చయాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. అందుకోసం ‘సర్‌’ తీసుకొచ్చారు. కానీ పోలింగ్‌ తేదీలు ప్రకటించే నాటికి సైతం ఒక కొలిక్కి రాకపోవటం, సాధారణ జనం నానా హైరానా పడటం ఈసీ అసమర్థతకు అద్దం పట్టింది. పోలింగ్‌కు 48 గంటల ముందు కూడా ఓటుహక్కు ఉంటుందో, ఊడుతుందో తెలియనివారు అనేకులు. ఓటర్లకూ, వారి తల్లిదండ్రులకూ వయసు వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ లేదా 50 ఏళ్లకు మించి ఉంటే... ఒకే జంటకు ఆరుగురు, అంతకన్నా ఎక్కువమంది సంతానం ఉంటే... ఇంగ్లిష్‌లో ఉన్న పాత రికార్డుల్లోని పేర్లకూ, ఇప్పుడు నమోదైన పేర్లకూ మధ్య అక్షరం తేడా ఉంటే... ఓటరు వయసుకూ, వారి తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ వయసులకూ మధ్య 40 ఏళ్లకన్నా తక్కువుంటే ఈసీ వాడిన క్రమసూత్ర పద్ధతి (అల్గోరిథిమ్‌) పొరపాటుగా పరిగణించింది. ఇది మానవ తప్పిదమైనా ఎప్పుడూ లేనట్టు ‘తార్కిక విరుద్ధత’ అనే కొత్త విధానంతో ఈ పేర్లన్నిటినీ తొలగించారు. చాలా ఆలస్యంగా వెల్లడికావటంవల్ల అనేకులు ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించలేకపోయారు. ఇలాంటివారు ఎన్ని లక్షలమందో తీరిగ్గా వెల్లడవుతుంది. అప్పటికల్లా పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది!

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో యథేచ్ఛగా సాగిన ఎన్నికల వైపరీత్యాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకూ ఈసీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. లోక్‌సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి జరిగిన పోలింగ్‌లో నిమిషానికి నలుగురు ఓటేశారన్నా దానికి పట్టదు. కానీ తగుదునమ్మా అంటూ మొన్న బిహార్‌లో, ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరగబోతున్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా పేరుతో ‘సర్‌’ ప్రక్రియ మొదలెట్టింది. ఏపీ విషయంలో ఈ ‘స్వచ్ఛ సంకల్పం’ ఏ గంగలో కలిసినట్టు? తమిళనాట చాలా దశాబ్దాల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేలకు సినీ హీరో విజయ్‌ నెలకొల్పిన టీవీకే పార్టీ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఇందువల్ల ఎవరి లెక్క తారుమారువుతుందన్నది చూడాల్సి ఉంది. 

ఆయన సభలకు భారీయెత్తున జనం రావటం గమనించదగింది. బెంగాల్‌లో రెండు దశాబ్దాలనాడు భూసేకరణ విధానంపై పోరాడి ఏకంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికే ఎసరు తెచ్చిన నందిగ్రామ్‌ ఇప్పుడు కొత్త దోవ తొక్కటం గమనార్హం. ఆనాడు మొత్తం సమాజానికి జరిగిన అన్యాయంపై ఒక్కటై ప్రశ్నించిన నందిగ్రామ్‌ ఇవాళ ఏ దేవుడు గొప్ప – రాముడా, జగన్నాథుడా అనే అంశం చుట్టూ తిరుగుతోంది. తొలి దశ పోలింగ్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ రామనామాన్ని, టీఎంసీ తన ఆధ్వర్యంలో నిర్మాణమైన జగన్నాథ్‌ ఆలయాన్ని తెగ ప్రచారం చేశాయి. ఏదేమైనా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియాలని అందరూ కోరుకుంటారు.  

Advertisement
 
Advertisement
Advertisement