West Bengal assembly polls
-
కీలక పోరుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ల భవితవ్యాన్ని తేల్చబోయే పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో గురువారం తొలి దఫాలో 152 స్థానాలకు పోలింగ్ జరగబోతుండగా, ఈ నెల 29న మరో 142 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తమిళనాట మాత్రం మొత్తం 234 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ పూర్తవుతుంది. తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పర్వం ఎప్పుడూ ప్రశాంతమే. బెంగాల్లో మాత్రం మహోద్రిక్త వాతావరణమే అలుముకుంటుంది. పార్టీల వైరం సరేగానీ... ఎన్నికల సంఘం(ఈసీ) సైతం ఈ ఉద్రిక్తతలకు దోహదపడటం కొత్త పరిణామం. జనం తమవెంటే ఉన్నారా లేదా... వ్యూహం, ఎత్తుగడలూ కుదిరాయా లేదా అని పార్టీలు ఆత్ర పడటం సహజం. సాధారణ జనంలో సైతం కాబోయే విజేతలెవరు, పరాజితులెవరన్న ఆత్రుత ఉండితీరుతుంది. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను లోపరహితంగా పూర్తిచేద్దామన్న ఆత్రుత ఈసీలో లేకుండా పోయింది. అందువల్లే బెంగాల్లో 91 లక్షలమంది, తమిళనాడులో 70 లక్షలమంది ఓటర్లలో ఈసారి ఓటు వేయగలమా లేదా అన్న ఆందోళన ఏర్పడింది. బెంగాల్లో ట్రిబ్యునళ్లలో అప్పీల్ దాఖలు చేసి విజయం సాధించినవారికి ఓటేసే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇంత తక్కువ వ్యవధిలో ఎందరికి ఆ వరం దక్కుతుందో అనుమానమే. ‘స్వచ్ఛమైన’ ఎన్నికల జాబితాతో పోలింగ్ జరిపితీరాలన్న ఈసీ దృఢ నిశ్చయాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. అందుకోసం ‘సర్’ తీసుకొచ్చారు. కానీ పోలింగ్ తేదీలు ప్రకటించే నాటికి సైతం ఒక కొలిక్కి రాకపోవటం, సాధారణ జనం నానా హైరానా పడటం ఈసీ అసమర్థతకు అద్దం పట్టింది. పోలింగ్‌కు 48 గంటల ముందు కూడా ఓటుహక్కు ఉంటుందో, ఊడుతుందో తెలియనివారు అనేకులు. ఓటర్లకూ, వారి తల్లిదండ్రులకూ వయసు వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ లేదా 50 ఏళ్లకు మించి ఉంటే... ఒకే జంటకు ఆరుగురు, అంతకన్నా ఎక్కువమంది సంతానం ఉంటే... ఇంగ్లిష్‌లో ఉన్న పాత రికార్డుల్లోని పేర్లకూ, ఇప్పుడు నమోదైన పేర్లకూ మధ్య అక్షరం తేడా ఉంటే... ఓటరు వయసుకూ, వారి తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ వయసులకూ మధ్య 40 ఏళ్లకన్నా తక్కువుంటే ఈసీ వాడిన క్రమసూత్ర పద్ధతి (అల్గోరిథిమ్) పొరపాటుగా పరిగణించింది. ఇది మానవ తప్పిదమైనా ఎప్పుడూ లేనట్టు ‘తార్కిక విరుద్ధత’ అనే కొత్త విధానంతో ఈ పేర్లన్నిటినీ తొలగించారు. చాలా ఆలస్యంగా వెల్లడికావటంవల్ల అనేకులు ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించలేకపోయారు. ఇలాంటివారు ఎన్ని లక్షలమందో తీరిగ్గా వెల్లడవుతుంది. అప్పటికల్లా పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది!ఆంధ్రప్రదేశ్‌లో 2024లో యథేచ్ఛగా సాగిన ఎన్నికల వైపరీత్యాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకూ ఈసీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. లోక్‌సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి జరిగిన పోలింగ్‌లో నిమిషానికి నలుగురు ఓటేశారన్నా దానికి పట్టదు. కానీ తగుదునమ్మా అంటూ మొన్న బిహార్‌లో, ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరగబోతున్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా పేరుతో ‘సర్’ ప్రక్రియ మొదలెట్టింది. ఏపీ విషయంలో ఈ ‘స్వచ్ఛ సంకల్పం’ ఏ గంగలో కలిసినట్టు? తమిళనాట చాలా దశాబ్దాల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేలకు సినీ హీరో విజయ్ నెలకొల్పిన టీవీకే పార్టీ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఇందువల్ల ఎవరి లెక్క తారుమారువుతుందన్నది చూడాల్సి ఉంది. ఆయన సభలకు భారీయెత్తున జనం రావటం గమనించదగింది. బెంగాల్లో రెండు దశాబ్దాలనాడు భూసేకరణ విధానంపై పోరాడి ఏకంగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికే ఎసరు తెచ్చిన నందిగ్రామ్ ఇప్పుడు కొత్త దోవ తొక్కటం గమనార్హం. ఆనాడు మొత్తం సమాజానికి జరిగిన అన్యాయంపై ఒక్కటై ప్రశ్నించిన నందిగ్రామ్ ఇవాళ ఏ దేవుడు గొప్ప – రాముడా, జగన్నాథుడా అనే అంశం చుట్టూ తిరుగుతోంది. తొలి దశ పోలింగ్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ రామనామాన్ని, టీఎంసీ తన ఆధ్వర్యంలో నిర్మాణమైన జగన్నాథ్ ఆలయాన్ని తెగ ప్రచారం చేశాయి. ఏదేమైనా పోలింగ్ ప్రశాంతంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్‌లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్‌కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
మూడు స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హత, గోసబా, ఖర్దహా, శాంతిపూర్ నాలుగు నియోజకవర్గాల్లో అధికార తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ నాలుగు స్థానాల్లో ఓటమిపాలు కాగా ఏకంగా మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ విజయం ప్రజల విజయం. విద్వేషంతో రాజకీయం చేసేవారిని కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే టీఎంసీని బెంగాల్ ప్రజలు ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బెంగాల్‌ను అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో నిలుపుతాము’ అని సీఎం మమతా ట్విటర్లో పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ, సీపీఐ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడ్డాయని ట్వీటర్లో తెలిపారు. -
లక్షల్లో మెజారిటీ సాధించారు!
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 500 లోపు మెజారిటీతో గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి రజీబ్ బెనర్జీ డిస్టింక్షన్ లో పాసయ్యారు. తన సమీప స్వతంత్ర అభ్యర్థి ప్రొతిమ దుత్తాపై 107,701 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. కేశపూర్ నుంచి పోటీ చేసిన మరో టీఎంసీ నేత సియలీ సాహ.. సీపీఎం అభ్యర్థి రామేశ్వర్ దొలయ్ పై 101,151 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మనోజ్ చక్రవర్తి 92,273 ఓట్లతో గెలిచారు. టీఎంసీ ఎంపీ సువేందు అధికారి 81,230 ఓట్ల మెజారిటీతో సత్తా చాటారు. తృణమూల్ నేతలు ఆశిష్ చక్రవర్తి, ఆసిమా పాత్రా, సుకుమార్ హన్సడా 50 వేల ఓట్ల పైగా ఆధిక్యంతో విజయాలు సాధించారు. కొంతమంది నాయకులు అత్యల్ప మెజారిటీతో గెలుపు సాధించారు. టీఎంసీ నుంచి అబ్దుర్ రెహమాన్ 280 స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక పలువురు తృణమూల్ అభ్యర్థులు సీపీఎం చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీఎంసీ నాయకులు ఏటీఎం అబ్దుల్లా(492), బెంగాలీ నటుడు సోహం చక్రవర్తి(616) పరాజయం పాలయ్యారు. అశోక్ కుమార్ దిండా(సీపీఐ), సాజల్ పాంజా(టీఎంసీ), రవీంద్రనాథ్ ఛటర్జీ(టీఎంసీ), తుషార్ కాంతి భట్టాచార్య(కాంగ్రెస్) కూడా 1000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు. -
'ప్లీజ్.. నన్ను వాడుకోవడం ఆపేయండి'
అహ్మదాబాద్: కొన్ని ముఖాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఒక వేళ మర్చిపోయే పరిస్థితి వచ్చినా కొన్ని సందర్భాలు తిరిగి గత పరిచయాన్ని కళ్ల ముందుకు తెస్తాయి. ప్రస్తుతానికి కుతుబుద్దీన్ అన్సారీ పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పటికే అతడు భారతదేశం అంతటా దాదాపు అందరికీ పరిచయం అయ్యాడు. పార్టీల నిర్వాహకంతో అతడు ప్రతిసారి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాడు. అయితే, ప్రత్యక్షంగా కాదు.. ఫొటో రూపంలో.. ఎవరు ఈ కుతుబుద్దీన్ ? అది 2002లో గోద్రా అల్లర్లు జరుగుతున్న సందర్భం. గుజరాత్లో జరిగిన ఈ ఘోర కాండకు వెయ్యిమందికి పైగా మృత్యువాతపడ్డారు. హిందువులకు, ముస్లింలకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తిన సందర్భం అది. ఈ ఘటనను ప్రస్తుతానికి ఆ రాష్ట్రం, దేశం మరిచిపోయినా కుతుబుద్దీన్‌ను మాత్రం వెంటాడుతోంది. ఎందుకంటే గోద్రా అల్లర్లు జరుగుతున్న సమయంలో ఓ హిందువుల గుంపు అతడి ఇంటిపై దాడికి దిగింది. ఆ సమయంలో తన ఇంట్లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో నిల్చున్న కుతుబుద్దీన్ హృదయం ధ్రవించేలా ఏడుస్తూ రెండు చేతులు జోడించి తనను, తన కుటుంబాన్ని రక్షించండి అంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు విన్నవిస్తూ కనిపించాడు. ఆ సందర్భంలో అతడి ఫోటోను ఓ మీడియా వ్యక్తి ఫొటో తీశాడు. నాటి దాడి ఘటనకు ఈ ఫొటో అద్దం పడుతోంది. అయితే ఈ ఫొటోతోనే వచ్చింది అతడికి అసలు చిక్కు. చేదు గతాన్ని గుర్తుచేస్తున్న పార్టీలు తన ప్రయత్నం లేకుండానే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు ఏదో ఒక పార్టీ కుతుబుద్దీన్ ఫొటోను ఉపయోగిస్తూ, ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తూ బీజేపీ వ్యతిరేక ఓట్లకోసం పార్టీలు ప్రయత్నించడం ప్రారంభించాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అదే ఫొటోను అసోం, బెంగాల్ ఎన్నికల్లో ఉపయోగించడం ప్రారంభించింది. ఆ ఫొటోపై ఇదేనా మోదీ అభివృద్ధి అంటే? అసోంను మరో గుజరాత్‌లాగా కావాలని కోరుకుంటున్నారా? నిర్ణయం మీదే.. అసోంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని అందులో ఉంది. 'దయచేసి నన్ను వాడుకోకండి' గోద్రా అల్లర్లు జరిగినప్పుడు తనకు 29 సంవత్సరాలని ఆ ఘటన తన కళ్లముందు ఇప్పటికీ కదలాడుతోందని కుతుబుద్దీన్ చెప్పారు. ఆ రోజే తాను ఒక రకంగా చనిపోయానని, కానీ, ఇప్పుడు తన పిల్లలు వేసే ప్రశ్నల కారణంగా రోజూ చస్తున్నానని చెప్పాడు. 'నాన్న ప్రతిసారి ఆ ఫొటోలో ఎందుకు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నావని అడుగుతుంటే నా ప్రాణం పోయినట్లుగా ఉంటుందని, దయచేసి ఏ పార్టీ కూడా తన ఫొటో ఉపయోగించుకొని తనను బాధపెట్టవద్దని అంటున్నారు. తనకు ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నానని, తన మానాన తనను వదిలేయాలని పార్టీలను వేడుకుంటున్నాడు.


