పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి.
గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్‌లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్‌కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది.
బెంగాల్‌లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్‌లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే..
బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది.


