కొత్త ప్రపంచం వైపు అడుగులు? | Sakshi Editorial On USA, Israel, Iran War Effect On world | Sakshi
Sakshi News home page

కొత్త ప్రపంచం వైపు అడుగులు?

Apr 12 2026 12:06 AM | Updated on Apr 12 2026 12:07 AM

Sakshi Editorial On USA, Israel, Iran War Effect On world

జనతంత్రం

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అనే ట్రంప్‌ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్‌ పవర్‌ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్‌ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్‌ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.

అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్‌ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్‌ డాలర్ల అప్పును అది మేనేజ్‌ చేయగలుగుతున్నది. కానీ డాలర్‌ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్‌’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్‌ మీద అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్‌ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్‌ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్‌ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.

వాణిజ్య రంగంలో ట్రంప్‌ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్‌ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్‌టేక్‌ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.

దౌత్యపరంగా కూడా ట్రంప్‌ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్‌ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్‌ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్‌ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్‌ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.

ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్‌ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్‌ స్పీక్‌మాన్‌ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్‌ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్‌’ అన్నారు. స్పీక్‌మాన్‌ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్‌ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్‌ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్‌ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్‌ల్యాండ్‌దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.

తర్వాత కాలంలోని అమెరికన్‌ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్‌ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్‌ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్‌ ఓషన్‌ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.

యూరప్‌ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్‌ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్‌ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్‌) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.

అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్‌ ఓషన్‌ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. 

ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్‌ ఫ్లీట్‌) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్‌ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.

ఇరాన్‌పై ‘ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్‌లో ఇరాన్‌ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్‌ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.

అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్‌ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్‌ పోస్టల్‌ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్‌ మార్గాన్ని ఇరాన్‌ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్‌ దర్జాగా తన కరెన్సీలో టోల్‌ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్‌ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్‌ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్‌ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్‌గేట్‌ పడుతుందీ’ అనే పాపులర్‌ డైలాగ్‌ ఉంటుంది.

ఆరు వారాల్లో ట్రంప్‌ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్‌ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్‌) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్‌ ది గ్రేట్‌ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్‌ జెఫర్సన్‌ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్‌ ది గ్రేట్‌ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్‌ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.

పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్‌ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్‌ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్‌ మిలిటరీ అధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిఫ్‌ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్‌ శాంతికాముకతకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని మునీర్‌ బహిరంగంగా డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్‌ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.

పేరుకు పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్‌ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్‌ మార్షల్‌ అయూబ్‌ ఖాన్‌ మాదిరిగా పాక్‌ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్‌. కశ్మీర్‌ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.

ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్‌ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్‌ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్‌ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్‌ ఇరాన్‌ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్‌ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్‌ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్‌ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement