మెదళ్లలోకి విషపు విత్తులు! | Sakshi Editorial On Chandrababu Govt by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

మెదళ్లలోకి విషపు విత్తులు!

May 17 2026 12:33 AM | Updated on May 17 2026 12:33 AM

Sakshi Editorial On Chandrababu Govt by Vardhelli Murali

జనతంత్రం

రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో నంబర్‌ వన్‌ అనే అపఖ్యాతిని వదిలించుకొని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. ఆత్మ నిర్భర భారత్‌ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్‌లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకొని 14 రాష్ట్రాల్లో అరవైకి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీఎత్తున రెండు డిఫెన్స్‌ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణరంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి – కర్నూలు ప్రాంతం కూడా ఒకటి!

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎమ్‌సీఏ) ప్రాజెక్టుకు నిన్న (శుక్రవారం) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలనూ, సాంకేతికతనూ ఆంధ్రప్రదేశ్‌ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ‘ఈనాడు’ రాసింది. అతిథిగా వచ్చారు కనుక ముఖప్రీతికోసం ఆమాత్రం మాట్లాడి ఉండొచ్చు కూడా! రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎమ్‌ఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా? పనిలో పనిగా తమ ఎన్డీయే కూటమిలో రెండో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు.

రక్షణమంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ ఇరవై మూడు నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాననీ, ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వీటివల్ల లభిస్తాయనీ పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతిచోట పదేపదే పాడుతున్నారు. ఈమధ్యనే ఒక జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్‌కు పాపం మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ, యాంకర్‌ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేశ్‌బాబు పూర్తి చేశారు.

పుట్టపర్తికి వచ్చి పంచ్‌ డైలాగ్‌ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేశ్‌ వెల్లడించారు. పంచ్‌ డైలాగ్‌లపై పేటెంట్‌ హక్కు సినిమాల్లో మామయ్యదీ, రాజకీయాల్లో తనదీ అనే నమ్మకం కావచ్చు. ఇంతకీ ఆ పంచ్‌ డైలాగ్‌ ఏమిటంటే, ‘‘వైసీపీది ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్‌. మనది ఫైటర్‌జెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌. అర్థమైందా రాజా’’. ఇందులో ఉన్న పంచ్‌ ఏమిటని వెతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి ఆత్మతృప్తి వారిది. తాను మునిగింది గంగ... తాను వలచింది రంభ... తాను విసిరింది పంచ్‌... అంతే! ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే, పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ రెండు భాగాలనూ చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019–24 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగైందట! అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట! ఈ లెక్కన మిగిలిన మూడేళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో ఐదేళ్ల్లకు గెలిపిస్తే సంపద సృష్టికార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు!

ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా, ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తం చేయడంకోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్‌ చేసుకోవడంతోపాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్‌ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నది. యెల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సంప్ర దాయ మీడియాతోపాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూ–ట్యూబ్‌ చానెళ్లు, సోషల్‌ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్‌ బాజాను ముందుకు తీసుకొనిపోవడానికి ఓవర్‌ టైమ్‌ పనిచేస్తున్నాయి. ఈ బ్రాండింగ్‌ భజంత్రీల జుగల్‌బందీ లెక్క ప్రకారం తెలుగుదేశం అంటే అభివృద్ధి. వైసీపీ అంటే విధ్వంసం. ఎలా అని ప్రశ్నించడం అమాయకత్వం. తర్కానికి నిలబడుతుందా అనే మీమాంసతో కూడా పనిలేదు. ఈ పద జాలాన్ని ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం.

ఇవాళ్టి శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పని చేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమైన తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చేతులు ఎత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా! ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏరకంగా మీరు అభివృద్ధికి రోల్‌ మోడలో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది.

1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ‘నిజమైన’ అభివృద్ధి దేశంలో పట్టాలెక్కిందని మన పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు, మన మేధావులు చెబుతున్నారు. అప్పటి నుంచే లెక్కలోకి తీసుకుంటే ఈ 35 సంవత్సరాల కాలంలో ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాలపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఇప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలకు నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్‌ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను వెక్కిరిస్తున్నాయి. జీఎస్‌డీపీ తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానిది 18వ స్థానం. మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం (28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో). నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్‌ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది 8.2 శాతం. ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్‌టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందనీ, అప్పుకోసం ప్రతి మంగళవారం దేహీ అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందనీ కూడా అధికారిక గణాంకాలే కుండబద్దలు కొడుతున్నాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేమిటి? పేదా–ధనిక వివక్ష లేకుండా, కులమతాల తేడా చూడకుండా ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య లభించాలని జగన్‌ మోహన్‌రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు – నేడు పేరుతో 35 వేల పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి, అందులో సగానికి పైగా పూర్తిచేసి, పిల్లలకు మంచి యూనిఫామ్‌ను కూడా ప్రభుత్వమే సమకూర్చి, పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపవుట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇంగ్లిషు మీడియంలో బోధనను ప్రారంభించి, సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠాలు చెప్పించలేదా! ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్‌లను అందజేసి, డిజిటల్‌ బోధనకు అంకురార్పణ చేసింది జగన్‌ సర్కార్‌ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబి సిలబస్‌ను సైతం సర్కార్‌ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్‌మోహన్‌రెడ్డి కాదా?

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామ చావడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈమధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కార్‌ బడి చదువులను చారిటీ పద్దు కిందకు మార్చడమంటే పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరం చేయడమే. పేదరికం నుంచి ఆ కుటుంబాల విముక్త మార్గాన్ని మూసివేయడమే! చదువే ప్రపంచాన్ని మార్చే పదునైన ఆయుధమని అంబేడ్కర్, పూలే, నారాయణ గురు వంటి వేగుచుక్కలే కాదు, మండేలా వంటి ఆఫ్రికన్‌ సూరీడు కూడా అదే మాట చెప్పారు.

చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేట్‌ స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కార్‌ బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్‌ లేబర్‌గా మార్కెట్‌లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట! పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కనీ, అది ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతనీ ఆయన గుర్తించడం లేదు. మరోసారి నెల్సన్‌ మండేలాను గుర్తు చేసుకుందాము. ‘‘పేదరిక నిర్మూలన అనేది చారిటీ కాదు, అదొక ప్రాథమిక న్యాయం. పేదరికం సహజంగా ఏర్పడేది కాదు, రుద్దబడేది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన పోరాటాలు ఎంత పవిత్రమో, పేదరిక విముక్త పోరాటాలు కూడా అంతే పవిత్ర’’ మని మండేలా చెప్పారు. 

ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్‌ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు, వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతున్నది. విద్యారంగం, వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం జగన్‌ విధానాలకు చోదక శక్తులైతే, ప్రైవేటుకు పెద్దపీట, ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపి స్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికా రతకు, ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరల్లేక, గింజలు కొనే నాథుడు లేక లక్షలాదిమంది రైతన్నలు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే? దీన్నే కదా విధ్వంస పాలన అనాలి?

వైసీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటినుంచి ఎగురుతున్నాయి? జగన్‌ పాలనతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు ఆసలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకే రావడం లేదా? విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కుల మత భేదాలూ కలహాలు లేకుండా ఆకివీడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులు వేసుకొని భాయిభాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గణాంకాలను చూపకుండా, కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే, ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజా కంటకులుగా అభిశంసిస్తుంది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement