ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకున్నప్పుడు మన దేశంలో విదేశీ అధినేతల పర్యటనలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. దానికితోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సృష్టించిన అనిశ్చితి సరేసరి. ఇలాంటి వాతావరణంలో ఆదివారం భారత్‌కొచ్చి మూడు రోజులు పర్యటించి వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌కు ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యటనకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆ మాటెలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేర్చాలని అధినేతలిద్దరూ సంకల్పించారు. ఇందుకోసం 2010లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉంది. మ్యూంగ్ తనతోపాటు 200 మంది వ్యాపార వేత్తలూ, సీఈవోలతో కూడిన భారీ ప్రతినిధి బృందాన్ని వెంట బెట్టుకుని వచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), రక్షణ, షిప్పింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, క్రీడలు, సాంస్కృతిక రంగం వగైరాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి.
ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక బంధానికి ఎంతో చరిత్ర ఉందంటారు. క్రీస్తుశకం 48లో అయోధ్యకు చెందిన యువతి హియోహాంగ్‌కు అప్పటి కొరియా రాజు సురోతో వివాహమైందని 13వ శతాబ్దంనాటి ఒక బౌద్ధ సన్యాసి రచించిన పుస్తకంలో ఉంది.అందులో ప్రస్తావించిన ‘అయుత’ ఇప్పటి అయోధ్య అయివుంటుందని అనేకులు భావిస్తారు. కొరియా చరిత్రలో ఆమె యువరాణి సురిరత్నగా నమోదైంది. అయోధ్యలో సరయూ నది ఒడ్డున రాణి హియోహాంగ్ స్మృతిలో ఒక పార్క్ నిర్మించారు. 2019లో ఆమె స్మారకార్థం రెండు దేశాలూ కలిసి ఒక స్టాంపు విడుదల చేశాయి. నాలుగో శతాబ్దంలో బౌద్ధం ఆ దేశంలో ప్రవేశించింది. 1973లో తొలిసారి దౌత్య సంబంధాలు ఏర్పడినా... అంతకు చాన్నాళ్లముందే 1950–53 నాటి కొరియా యుద్ధకాలంలో మన దేశంనుంచి వైద్య బృందాలు అక్కడికెళ్లి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిశాక తొలిసారి 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ దేశంలో పర్యటించారు.
ప్రత్యేకించి ఎలాంటి కారణాలూ లేకపోయినా 2018లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–యీ తర్వాత దౌత్య సంబంధాల్లో స్తబ్ధత ఆవరించింది. అప్పుడూ, అంతకుముందూ కుదిరిన ఒప్పందాలు ఆచరణలో కొనసాగుతున్నా ఇరు దేశాల వాణిజ్య లోటుపై మన దేశానికి కొంత అసంతృప్తి ఉంది. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 2,700 కోట్ల డాలర్లున్నా, అక్కడినుంచి మనకొచ్చే దిగుమతుల విలువ దాదాపు 2,100 కోట్ల డాలర్లు. మన ఎగుమతుల విలువ 600 కోట్ల డాలర్లు మించదు. ఇందులో సమతౌల్యత సాధించాలని మన దేశం ఎప్పటినుంచో భావిస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి, చీడపీడలు చూపి మన సాగు ఉత్పత్తులను దక్షిణ కొరియా అడ్డుకుంటోంది. నౌకా నిర్మాణంలో దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. పర్యావరణ హితమైన, అత్యాధునిక నౌకల నిర్మాణంలో, ఇతర నౌకాసంబంధ కార్యకలాపాల్లో మన దేశానికి సహకరించేందుకు అంగీకరించింది. నౌకాశ్రయాలను సాంకేతికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లటంతోపాటు ఓడల మరమ్మతుకు, అతి పెద్ద ఓడల నిర్మాణానికి తోడ్పడే భారీ డ్రై డాక్‌ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది.
రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. విమాన విధ్వంసక ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు ఇక్కడే అభివృద్ధిపరచడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల్ని బదిలీ చేయటానికి దక్షిణ కొరియా అంగీకరించింది. యుద్ధక్షేత్రంలో చురుగ్గా కదిలి, శత్రుసైన్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ కె9 వజ్ర కొరియా సహకారంతోనే ఇక్కడ ఉత్పత్త వుతోంది. ఇవిగాక సెమీ కండక్టర్లు, ఫార్మా, జౌళి, ఐటీ రంగాలకు సైతం సహకారం విస్తరించటానికి సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో భిన్న రంగాల్లో మరింత దగ్గరయ్యేందుకు దక్షిణ కొరియా అధినేత పర్యటన దోహదపడుతుంది.


