క్వాడ్‌లో మళ్లీ చలనం | Sakshi Editorial On Quad countries | Sakshi
Sakshi News home page

క్వాడ్‌లో మళ్లీ చలనం

May 28 2026 1:28 AM | Updated on May 28 2026 1:28 AM

Sakshi Editorial On Quad countries

ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్‌)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్‌ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. 

నిజానికి ఆరంభంనుంచి క్వాడ్‌ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్‌ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్‌ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది.  

కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్‌ కేబుల్స్‌ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్‌ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్‌ సీ కేబుల్స్‌ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్‌ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్‌ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.

చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్‌ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్‌ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్‌ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్‌ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్‌లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్‌ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. 

క్వాడ్‌ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టు భారత్‌ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్‌లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్‌ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్‌ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement