మనిషికి ఆకాశంలోకి ఎగరాలన్న కాంక్ష పుట్టించేది పక్షి కాదు, తారలు కూడా కాదు, చదమామ! కథలు వినాలన్న ఆసక్తి పుట్టించడంలో నానమ్మ పాత్ర ఎంతో చందమామదీ అంతే. చందమామే ఒక కథ. ఒక కవిత కూడా. ఒక అందమైన స్త్రీ ఎలాంటి కవితావేశాన్ని కలిగిస్తుందో, నిండు చందమామ అలాంటి భావావేశాన్ని పుట్టిస్తుంది. అందుకే చందమామను తన అక్షరాల్లోకి ఒడిసిపట్టని భావకవులు ఉండరు. అసలు ఏ కవికైనా తన తొలి కవితకు సరంజామా ఇవ్వగలిగేది చందమామ కాక ఇంకేమిటి? అది మనిషికి ఎంత దూరమో అంత దగ్గర. ఈ నట్టనడి ఎండల్లో చంద్రుడి తలంపే మనకు చల్లని గొడుగు.
‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని తిలక్ అన్నప్పుడు ఈ వాక్యానికి అందం అందమైన ఆడపిల్లల వల్లే రాలేదు; వాళ్లు వెన్నెల్లో ఆడుకోవడం వల్ల వచ్చింది. చంద్రుడిని తలుచుకుంటేనే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక రహస్యోద్వేగం. అని మనిషిని మెలకువలోంచి కలల్లోకి మేలుకొలిపే మార్మిక మంత్రదండం. ఒంటరి ప్రయాణీకుడికి చందమామే దారి దీపం. అనంత చీకటిమయ ఆకాశాన్ని సజీవ మూర్తిగా నిలబెట్టేది దానికి రెండో కన్నుగా ఉండే చందమామే. పౌర్ణమికి దినదిన ప్రవర్ధమానమవుతూ, అమవసకు అంతా కోల్పోయినట్టవుతూ మనిషి జీవిత చక్రాన్ని ఇది గుర్తుచేస్తుంది. అన్ని మతాల్లోనూ, సంస్కృతుల్లోనూ చంద్రుడి చుట్టూ ముడివడి ఎన్నో పండుగలున్నాయి. అసలు శరదృతువులో పౌర్ణమిని చూడటమే ఒక పండుగ!
చైనా భావకవితోద్యమానికి మార్గదర్శిగా చెప్పే లీ తై–పో క్రీ.శ. 699–705 ప్రాంతంలో జన్మించాడు. పదేళ్లకే కన్‌ఫ్యూసియస్ పుస్తకాలన్నీ చదివేశాడు. దేశమంతా తిరిగాడు. రాజప్రాసాదాల్లోనూ జీవించాడు, గుహల్లోనూ నిద్రించాడు. మద్యం, మగువ, కవిత్వం ఆయనకు ప్రాణాధారం. వెనుక సంచీలో పుస్తకాలు, అంగీ మడతలో గుప్తంగా పిడిబాకు, అరచేతిలో సిద్ధంగా కవిత– ఇదీ ఆయన వేషం. ఒకరోజు తాగిన మత్తులో సరస్సులోని చంద్రుడి బింబాన్ని కౌగిలించుకోబోయి మరణించాడని చెబుతారు. ఎలాంటి భావకవి! ర్యోకన్ తైగు అనే జెన్ గురువు గుడిసెలోకి ఒక దొంగ వచ్చాడట. తన దుస్తులు సహా దొంగకు ఒలిచి ఇచ్చేశాడు గురువు.
దొంగ వెళ్లిపోయిన తర్వాత, ఒంటి మీద నూలుపోగైనా లేకుండా నిండుగా వెలుగుతున్న చందమామను కిటికీలోంచి చూస్తూ కూర్చున్న గురువు, అంతటి అందమామను దొంగకు ఇవ్వలేకపోయినందుకు నొచ్చుకున్నాడట! దొంగలు మన దగ్గరినుంచి ఎత్తుకెళ్లలేనిది మన విద్య, వివేకాలనే కాదు, మనకున్న చందమామను కూడా! ఒక్క చంద్రుడుని నిండుగా ఆనందించగలిగే హృదయముంటే ఎన్ని పూటల భోజనానికి పడే ఆరాటం తప్పుతుంది! ఇటాలో కాల్వీనో కథా ప్రపంచంలోనైతే చందమామ మీదికి నిచ్చెన వేసుకుని ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. అక్కడి మీగడ చిక్కదనపు పాలను లోడుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే!
గ్రీకు ప్రకృతి దేవత మీదుగా నామకరణం చేసి, చంద్రుడి మీదకు ‘నాసా’ పంపిన వ్యోమనౌక ఆర్టెమిస్–2 ఏప్రిల్ 1–11 వరకు తిరుగాడి భూమ్మీదకు తిరిగొచ్చింది. భూమి నుంచి అంతరిక్షంలోకి సుదూరం పయనించి గతంలోని ‘అపోలో’ రికార్డును ఇది బద్దలుకొట్టింది. అన్నట్టూ అపోలో, ఆర్టెమిస్ గ్రీకు పురాణంలో కవల సోదరీమణులు. మొదలైనప్పటినుంచీ తిరిగొచ్చేదాకా 6,95,081 మైళ్లు ప్రయాణించిన ఆర్టెమిస్–2 అంతరిక్షంలోకి సుదూరంగా వెళ్లే వ్యోమగాములకు అవసరమైన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని నిర్ధారించేందుకు ఉద్దేశించినది. వస్తూవస్తూ సాక్ష్యంగా కొన్ని ఫొటోలను తెచ్చింది. వాటిని చూస్తే, చంద్రుడి మీద వెన్నెల మీగడలు ఏమీ లేవని తెలియడం ఒకింత కాల్పనిక నిరాశ. ఇది మామూలు భూమిలానే ఉందని తెలియడం ఒక వాస్తవం. కానీ చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలంగా నివసించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కావడం సాంకేతిక సంభ్రమం.


