కేరళ కిరీటం సతీశన్‌కు... | Sakshi Editorial On Kerala New CM VD Sateeshan | Sakshi
Sakshi News home page

కేరళ కిరీటం సతీశన్‌కు...

May 15 2026 12:35 AM | Updated on May 15 2026 12:35 AM

Sakshi Editorial On Kerala New CM VD Sateeshan

పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్‌ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్‌ సతీశన్‌కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్‌ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్‌ నేత రమేష్‌ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. 

మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్‌ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్‌ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్‌ మరో నాయకుడు వీడీ సతీశన్‌కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్‌కు పనికొచ్చినట్టుంది. రమేష్‌ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. 

ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్‌లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. 

ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్‌వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్‌ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్‌కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్‌కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్‌ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement