జనతంత్రం
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.
పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు.
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.
మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.
ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.
ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు.
దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్‌గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్‌కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.
ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్‌ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్‌ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్‌లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!
పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?
చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్‌లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.
మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగు
తుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది.
మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.
చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది.
ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


