వాతావరణ స్థితిగతులు మారి, పెను ముప్పు ముంచుకొస్తున్నా చాలా దేశాలు కళ్లు మూసుకున్నాయని గురువారం వాతావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తేటతెల్లం చేసింది. నిరుడు జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వాతావరణంపై వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చేసిన తీర్మానానికి 144 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. కానీ శిలాజ ఇంధనాలతో, తప్పుడు అభివృద్ధి నమూనాలతో కాలుష్యానికి కారణమవుతున్న అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మన దేశంతోపాటు 28 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 2015 నాటి పారిస్ ఒడంబడిక వివిధ దేశాలు ఏమేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలో నిర్దేశించినా అదంతా స్వచ్ఛందంగా అమలు చేసేది మాత్రమే. కానీ తాజా తీర్మానంతో ఆ అమలు చట్టపరమైన విధిగా మారింది. అయితే దాన్ని నిర్వర్తించమని ఒత్తిడి తెచ్చేవారెవరు?
వాతావరణ మార్పులకు దారితీసే విధానాలను అవలంబించటం చట్టవిరుద్ధమనీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉద్గారాలను తగ్గించి, తన పౌరులకూ, ఇరుగు పొరుగు దేశాలకూ ముప్పు ఏర్పడకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రతి దేశానికీ ఉంటుందనీ ఐసీజే తన తీర్పులో చెప్పింది. లాభార్జనపై మాత్రమే దృష్టి పెట్టే దేశాలవల్ల ప్రజల
జీవించే హక్కు, ఆరోగ్యం, ఆహారం, ఇతరేతర జీవనప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తుచేసింది. దురదృష్టమేమంటే ఐసీజే తీర్పుల్ని పాటించితీరాలన్న నియమం లేదు. అవి కేవలం నైతికబాధ్యతను మాత్రమే గుర్తుచేస్తాయి.
ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇతరత్రా మార్గాల్లో చర్యలకు అవకాశం లేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకూ ఇదే వర్తిస్తుంది. ఏడాది కాలవ్యవధిలో పాకిస్తాన్, కాంగో, ఆస్ట్రియా, మధ్య యూరొప్ దేశాల్లో భారీ వరదలు సంభవించాయి. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఈ స్థాయి వరదలు రాలేదని చెబుతున్నారు. అమెరికాలో కూడా మధ్య, దక్షిణ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో టార్నెడోలు చవిచూశాయి. వేలాది ఇళ్లు నేలమట్టంకాగా, జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. పసిఫిక్ ద్వీపకల్ప దేశాలది తీరని వ్యథ. ముఖ్యంగా వనౌటు, తువాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాల సంగతలావుంచి అసలు తమ భూభాగమే కనుమరుగైపోతుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే అక్కడి భూగర్భ జలాలు ఉప్పగా మారి, తాగునీరు లభ్యత పడిపోయింది. వ్యవసాయం సాగక జనం వలసపోతున్నారు.
ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్‌నినో అన్ని దేశాలనూ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనీ, కరువుకాటకాలు, పెను వర్షాలు, వరదలు జనావాసాలను ముంచెత్తనున్నాయనీ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళానికి ఉత్తర భాగంలో ఉండటంవల్ల నార్వే, ఫిన్లాండ్, స్వీడన్‌వంటి స్కాండినేవియన్ దేశాలకు వేడి బెడద పెద్దగా ఉండదు. వీటికి ప్రామాణికమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలుండటంవల్ల వాతావరణ మార్పుల్ని తట్టుకోగలుగుతున్నాయి. స్విట్జర్లాండ్, డెన్మార్క్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలి యాలు సైతం వాటివాటి భౌగోళిక స్థానాలవల్లా, పకడ్బందీ చర్యలవల్లా సురక్షితమే. కానీ భూతాపోన్నతి పెరిగి, ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టి, మెజారిటీ దేశాలు సంక్షోభంలో పడి ఆహారగొలుసు దెబ్బతింటే అందరికీ ప్రమాదమే.
అందుకే సమస్య అందరిదీ. అయితే సమితి తీర్మానం అన్ని దేశాల వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సింది. శతాబ్దాలుగా పారిశ్రామికీకరణతో వాతావరణాన్ని దెబ్బతీస్తూ, ఇప్పటికీ ఎలాంటి బాధ్యతకూ సిద్ధపడని అభివృద్ధి చెందిన దేశాలనూ... హరిత ఇంధన వ్యవస్థల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వర్థమాన దేశాలనూ ఒకేగాటన కట్టడం, ఉద్గారాల తగ్గింపునకు అవసరమైన సాంకేతికతలను చవగ్గా అందించేందుకు సంసిద్ధంకాని దేశాలను పల్లెత్తు మాట అనకపోవడం తీర్మానం లోపం. అందుకే మన దేశమూ, మరికొన్ని దేశాలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మొత్తానికి పాశ్చాత్య దేశాల్లో సైతం వాతావరణ మార్పులపై గుబులు మొదలైందని తీర్మానంపై జరిగిన ఓటింగ్ నిరూపించింది. ఎలా చూసినా ఇది మంచి పరిణామం అని చెప్పాలి.


