ఎట్టకేలకు శాంతి దిశగా... | Sakshi Editorial On Peace agreement between America and Iran | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు శాంతి దిశగా...

Jun 19 2026 1:51 AM | Updated on Jun 19 2026 1:51 AM

Sakshi Editorial On Peace agreement between America and Iran

అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్‌ ఆఫ్‌ వెర్సాయ్‌లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్‌ సంతకం చేసి ఆన్‌లైన్‌లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్‌ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. 

తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్‌ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్‌ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్‌ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్‌ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్‌ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్‌ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్‌ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. 

ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్‌కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్‌కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్‌ మూతతో అమెరికాలో గ్యాసోలిన్‌ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. 

ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్‌ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్‌ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్‌ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. 

తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్‌ను ఇరాన్‌ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్‌ వెలుపలనున్న ప్యాలెస్‌ ఆఫ్‌ వెర్సాయ్‌ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్‌ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్‌ గౌరవిస్తారని ఆశించాలి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement