మహాప్రయాణం | Sakshi Editorial On Christopher Nolan, Odyssey | Sakshi
Sakshi News home page

మహాప్రయాణం

Jun 29 2026 1:16 AM | Updated on Jun 29 2026 7:48 AM

Sakshi Editorial On Christopher Nolan, Odyssey

క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన గ్రీకు అంధకవి హోమర్‌ సృజనగా చెప్పే రెండు ఇతిహాస కావ్యాలు– ఇలియడ్, ఒడిస్సీ. ఇవి పాశ్చాత్య ప్రపంచానికి మన రామాయణ, మహాభారతాల్లాంటివి. పైగా కొనసాగింపు కథలు. ట్రోజన్‌ యుద్ధం, హెలెన్‌–పారిస్‌ ప్రేమ, హెక్టర్‌ త్యాగం, అకిలీస్‌ పరాక్రమం, రక్తపాతం, వినాశనాన్ని ఇలియడ్‌ చూపిస్తే... ఆ యుద్ధం ముగిసిన తర్వాతి కథను ఒడిస్సీ చెప్తుంది. పదేళ్లపాటు జరిగిన ఆ యుద్ధంలో గెలిచిన గ్రీకు వీరుడు, ఇతకా రాజు అయిన ఒడిస్సీస్‌ (దీన్నే లాటిన్‌లో ఉలిసేస్‌ అని ఉచ్ఛరిస్తారు) తిరిగి తన భార్య పెనలోపి, కొడుకు తలామకస్‌ దగ్గరికి చేరుకోవడానికి పదేళ్లపాటు పడిన కష్టాలే ఈ కావ్యం. ఆ కష్టాల్లో కొన్ని విధివిలాసమైతే ఇంకొన్ని స్వయంకృతం. ఇలియడ్‌ బాహ్య యుద్ధమైతే, ఒడిస్సీ ఒక అంతర్మథనం. ‘ధైర్యంగా ఉండు నా హృదయమా; నేనొక సైనికుడిని; ఇంతకంటే ఘోరమైన దృశ్యాలనే నేను చూశాను.’

‘దేవుళ్లు మానవులకు కష్టాలను ఇస్తారు, తద్వారా రాబోయే తరాలకు చెప్పుకో వడానికి ఒక కథ మిగులుతుంది’ అంటాడు హోమర్‌. ఒక నాయకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, తనను తాను తెలుసుకుంటూ గమ్యాన్ని చేరడం అనే ఇతివృత్తానికి ఒడిస్సీ శ్రేష్ఠమైన నమూనా. ఒడిస్సీస్‌ కేవలం శారీరక బలం గలవాడే కాదు, దుర్బేధ్య మైన ట్రాయ్‌ని, కొయ్యగుర్రం (ట్రోజన్‌ హార్స్‌) పొట్టలో సైనికులను రహస్యంగా పంపి, జిత్తులతో గెలిచినవాడు. అకిలీస్‌ శౌర్యం కోసం బతికితే, ఒడిస్సీస్‌కు బతకడమే ప్రధానం. వరాలు, శాపాలు, మాయలు, మంత్రాలతో సాగినప్పటికీ ఒడిస్సీలోని పాత్రలు కేవలం పురాణ బొమ్మలు కావు, అవి మానవ నైజానికి ప్రతీకలు. ఇందులో ఒంటికన్ను రాక్షసుడు పాలిఫేమస్‌ మన బకాసురుడిని గుర్తుకుతెస్తాడు. 

కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్లిపోయిన భర్త కోసం ఇరవై ఏళ్లు వేచి చూసే పెనలోపి పాత్రలో లక్ష్మణుడి భార్య ఊర్మిళను పోల్చుకోవచ్చు. తండ్రి పెంపకం కరవైనప్పటికీ, తల్లికి తోడుగా నిలిచి, చివరకు తండ్రితో కలిసి శత్రుసంహారం చేసే మంచి కొడుకు పాత్ర తలామకస్‌ది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒడిస్సీస్‌ లాంటివాళ్లే. ఆధునిక మానవుడు కెరీర్‌ అనే సంద్రంలో చిక్కుకుని, ఇంటి (ప్రశాంతత) కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పటికీ ఒడిస్సీ ప్రాసంగితకు అదే కారణం. ‘ఒక మనిషికి తన సొంత దేశం, తన తల్లిదండ్రుల కంటే మధురమైనది ఏదీ లేదు. పరాయి దేశంలో, కన్నవారికి దూరంగా ఎంతటి విలాసవంతమైన భవనంలో నివసించినప్పటికీ అవి దీనికి సాటిరావు’. 

ఒడిస్సీకి ఆంగ్లంలోనే అరవైకి పైగా అనువాదాలు వచ్చాయని ఒక లెక్క. దాన్ని ప్రేరణగా తీసుకుని వచ్చిన సృజన మరింత విస్తారమైనది. జేమ్స్‌ జాయిస్‌ రాసిన చైతన్య స్రవంతి నవల ‘ఉలిసేస్‌’ మామూలు మనుషుల మహాప్రస్థానాన్ని చెబుతుంది. ‘భువన సుందరి’గా ఇలియడ్, ‘రూపధరుడి యాత్రలు’గా ఒడిస్సీ తెలుగులోకీ వచ్చాయి. తాజాగా ఒడిస్సీని తెలుగు పాఠకులకు చేరువ చేయడానికి వేమూరి వేంకటేశ్వర రావు, వెంకట్‌ సిద్ధారెడ్డి కూడా ప్రయత్నించారు. ఒడిస్సీ, ఇలియడ్‌ ఇంతకుముందు చాలాసార్లు తెరకెక్కాయి. ఎన్నిసార్లయినా అంతే ఆసక్తిని పుట్టించాయి. ఈ కాలపు వండర్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ లాంటివాడు దీనిమీద ఆసక్తి కనబరచాడంటే, ప్రపంచం అంతకంటే అమితాసక్తితో జూలై 17న విడుదల కానున్న హాలీవుడ్‌ ఒడిస్సీ కోసం ఎదురుచూస్తోంది. 

‘ఇంటర్‌స్టెల్లార్‌’లో అంతరిక్ష ప్రయాణాన్నీ, ‘ఇన్సెప్షన్‌’లో కలల ప్రయాణాన్నీ చూపించిన నోలన్‌కు ఒడిస్సీకంటే నప్పే కథ మరొకటి ఉండదు. స్థలకాలాలతో ముడిపెట్టి దీన్ని ఎలా చూపిస్తాడనే కుతూహలం అంతటా నెలకొంది. ఇలియడ్‌ ఆధారంగా వచ్చిన ట్రాయ్‌ (2004) సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నోలన్‌కు వచ్చిందట. కానీ అది కుదరలేదు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఒడిస్సీ రూపంలో హోమర్‌కు దగ్గరయ్యాడు. తప్పిపోయిన ఇంటికి ఒడిస్సీస్‌ 20 ఏళ్ల తర్వాత చేరుకున్నట్టే, నోలన్‌ కూడా తనకు ఇష్టమైన ఈ సబ్జెక్టును చేపట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఆలస్యం అవడం అంటే ఒడిస్సీస్‌లా వయసు పెరగడమే; అంటే మరింత పైచూపుతో జీవితాన్ని చూడగలిగే పరిణతి రావడమే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement