breaking news
iliad
-
మహాప్రయాణం
క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన గ్రీకు అంధకవి హోమర్ సృజనగా చెప్పే రెండు ఇతిహాస కావ్యాలు– ఇలియడ్, ఒడిస్సీ. ఇవి పాశ్చాత్య ప్రపంచానికి మన రామాయణ, మహాభారతాల్లాంటివి. పైగా కొనసాగింపు కథలు. ట్రోజన్ యుద్ధం, హెలెన్–పారిస్ ప్రేమ, హెక్టర్ త్యాగం, అకిలీస్ పరాక్రమం, రక్తపాతం, వినాశనాన్ని ఇలియడ్ చూపిస్తే... ఆ యుద్ధం ముగిసిన తర్వాతి కథను ఒడిస్సీ చెప్తుంది. పదేళ్లపాటు జరిగిన ఆ యుద్ధంలో గెలిచిన గ్రీకు వీరుడు, ఇతకా రాజు అయిన ఒడిస్సీస్ (దీన్నే లాటిన్లో ఉలిసేస్ అని ఉచ్ఛరిస్తారు) తిరిగి తన భార్య పెనలోపి, కొడుకు తలామకస్ దగ్గరికి చేరుకోవడానికి పదేళ్లపాటు పడిన కష్టాలే ఈ కావ్యం. ఆ కష్టాల్లో కొన్ని విధివిలాసమైతే ఇంకొన్ని స్వయంకృతం. ఇలియడ్ బాహ్య యుద్ధమైతే, ఒడిస్సీ ఒక అంతర్మథనం. ‘ధైర్యంగా ఉండు నా హృదయమా; నేనొక సైనికుడిని; ఇంతకంటే ఘోరమైన దృశ్యాలనే నేను చూశాను.’‘దేవుళ్లు మానవులకు కష్టాలను ఇస్తారు, తద్వారా రాబోయే తరాలకు చెప్పుకో వడానికి ఒక కథ మిగులుతుంది’ అంటాడు హోమర్. ఒక నాయకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, తనను తాను తెలుసుకుంటూ గమ్యాన్ని చేరడం అనే ఇతివృత్తానికి ఒడిస్సీ శ్రేష్ఠమైన నమూనా. ఒడిస్సీస్ కేవలం శారీరక బలం గలవాడే కాదు, దుర్బేధ్య మైన ట్రాయ్‌ని, కొయ్యగుర్రం (ట్రోజన్ హార్స్) పొట్టలో సైనికులను రహస్యంగా పంపి, జిత్తులతో గెలిచినవాడు. అకిలీస్ శౌర్యం కోసం బతికితే, ఒడిస్సీస్కు బతకడమే ప్రధానం. వరాలు, శాపాలు, మాయలు, మంత్రాలతో సాగినప్పటికీ ఒడిస్సీలోని పాత్రలు కేవలం పురాణ బొమ్మలు కావు, అవి మానవ నైజానికి ప్రతీకలు. ఇందులో ఒంటికన్ను రాక్షసుడు పాలిఫేమస్ మన బకాసురుడిని గుర్తుకుతెస్తాడు. కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్లిపోయిన భర్త కోసం ఇరవై ఏళ్లు వేచి చూసే పెనలోపి పాత్రలో లక్ష్మణుడి భార్య ఊర్మిళను పోల్చుకోవచ్చు. తండ్రి పెంపకం కరవైనప్పటికీ, తల్లికి తోడుగా నిలిచి, చివరకు తండ్రితో కలిసి శత్రుసంహారం చేసే మంచి కొడుకు పాత్ర తలామకస్ది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒడిస్సీస్ లాంటివాళ్లే. ఆధునిక మానవుడు కెరీర్ అనే సంద్రంలో చిక్కుకుని, ఇంటి (ప్రశాంతత) కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పటికీ ఒడిస్సీ ప్రాసంగితకు అదే కారణం. ‘ఒక మనిషికి తన సొంత దేశం, తన తల్లిదండ్రుల కంటే మధురమైనది ఏదీ లేదు. పరాయి దేశంలో, కన్నవారికి దూరంగా ఎంతటి విలాసవంతమైన భవనంలో నివసించినప్పటికీ అవి దీనికి సాటిరావు’. ఒడిస్సీకి ఆంగ్లంలోనే అరవైకి పైగా అనువాదాలు వచ్చాయని ఒక లెక్క. దాన్ని ప్రేరణగా తీసుకుని వచ్చిన సృజన మరింత విస్తారమైనది. జేమ్స్ జాయిస్ రాసిన చైతన్య స్రవంతి నవల ‘ఉలిసేస్’ మామూలు మనుషుల మహాప్రస్థానాన్ని చెబుతుంది. ‘భువన సుందరి’గా ఇలియడ్, ‘రూపధరుడి యాత్రలు’గా ఒడిస్సీ తెలుగులోకీ వచ్చాయి. తాజాగా ఒడిస్సీని తెలుగు పాఠకులకు చేరువ చేయడానికి వేమూరి వేంకటేశ్వర రావు, వెంకట్ సిద్ధారెడ్డి కూడా ప్రయత్నించారు. ఒడిస్సీ, ఇలియడ్ ఇంతకుముందు చాలాసార్లు తెరకెక్కాయి. ఎన్నిసార్లయినా అంతే ఆసక్తిని పుట్టించాయి. ఈ కాలపు వండర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లాంటివాడు దీనిమీద ఆసక్తి కనబరచాడంటే, ప్రపంచం అంతకంటే అమితాసక్తితో జూలై 17న విడుదల కానున్న హాలీవుడ్ ఒడిస్సీ కోసం ఎదురుచూస్తోంది. ‘ఇంటర్స్టెల్లార్’లో అంతరిక్ష ప్రయాణాన్నీ, ‘ఇన్సెప్షన్’లో కలల ప్రయాణాన్నీ చూపించిన నోలన్‌కు ఒడిస్సీకంటే నప్పే కథ మరొకటి ఉండదు. స్థలకాలాలతో ముడిపెట్టి దీన్ని ఎలా చూపిస్తాడనే కుతూహలం అంతటా నెలకొంది. ఇలియడ్ ఆధారంగా వచ్చిన ట్రాయ్ (2004) సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నోలన్‌కు వచ్చిందట. కానీ అది కుదరలేదు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఒడిస్సీ రూపంలో హోమర్‌కు దగ్గరయ్యాడు. తప్పిపోయిన ఇంటికి ఒడిస్సీస్ 20 ఏళ్ల తర్వాత చేరుకున్నట్టే, నోలన్ కూడా తనకు ఇష్టమైన ఈ సబ్జెక్టును చేపట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఆలస్యం అవడం అంటే ఒడిస్సీస్లా వయసు పెరగడమే; అంటే మరింత పైచూపుతో జీవితాన్ని చూడగలిగే పరిణతి రావడమే! -
కనకమ్ము మోగునట్లు కంచు మోగునా!
బంగారం అంటే మనుషులకు వల్లమాలిన మమకారం. మనవాళ్లు ‘బంగారు’ భవితవ్యాన్ని కోరుకుంటారు. పట్టిందల్లా ‘బంగారం’ కావాలని ఆరాటపడతారు. పసిమికాంతుల బంగారం అపురూప లోహం. అందుకే పసిబిడ్డలను ‘బంగారుకొండ’లని లాలిస్తాం. బంగారం మానవ నాగరికత వికాసానికి సంకేతం. బంగారం మన సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. బంగారం ఆర్థిక వ్యవస్థకు అనాది మూలాధారం. బంగారమంటే మాటలా..? బహుశ అందుకే కాబోలు నిఘంటువుల్లో బంగారానికి పర్యాయపదాలుగా అన్నేసి మాటలు. పాశ్చాత్య భాషల్లో బంగారానికి లెక్కకు మిక్కిలిగా పర్యాయ పదాలు ఉన్న దాఖలాలు లేవు గానీ, సంస్కృతాంధ్రాలు సహా భారతీయ భాషల్లో బంగారానికి లెక్కలేనన్ని పదాలు ఉన్నాయి. స్వర్ణం, సువర్ణం, హిరణ్యం, హేమం, కనకం, కాంచనం, కుందనం, అపరంజి, పసిడి... ఇవన్నీ బంగారానికి మారుపేర్లు. ఇవన్నీ బంగారంపై మనకు గల మమకారానికి నిదర్శనాలు. పైసా పైసాగా కూడబెట్టినదంతా బంగారంలోకి మార్చుకుని మురిసిపోయే జనం తక్కువేమీ కాదు. బంగారు నగలు అలంకరించుకోవడం మనకు అనాది ఆచారమే. వీలైనంత మేరకు తరాల తరబడి ఆ నగలను కాపాడుకోవడం మన సంస్కృతిలో భాగమే. అడ్డమైన దారుల్లోనూ ఎడాపెడా సంపాదించి, బాగా ‘డబ్బు’చేసిన ఆసాములు భారీ పరిమాణంలో బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా కొత్త కాదు. ఎంత నల్లకుబేరుల ఇనప్పెట్టెల్లో మూలుగుతున్నా, బంగారం ఎన్నటికీ వన్నెతరగదు. పాలకుల దయవల్ల బంగారం పేరు చెబితేనే జనాలు ఉలిక్కిపడే రోజులొచ్చేశాయి. పెళ్లి అయిన మహిళల వద్ద ఇంత, పెళ్లికాని పడతుల వద్ద ఇంత, ‘మగా’నుభావుల వద్ద ఇంత... మాత్రమే బంగారం ఉండాలని, అంతకు మించితే ‘పన్ను’పోటుతో పాటు ఇతరేతర పోట్లు తప్పవని ఇటీవల సర్కారు వారు హూంకరించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడితో మొదలయ్యాయి రకరకాల కథనాలు, ఊహాగానాలు, వ్యాఖ్యానాలు! పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కంచును మించి కనకం మోత మోగడం మొదలైంది. బంగారమంటేనే జనం కంగారు పడుతున్న నేపథ్యంలో బంగారం గురించి కొన్ని సంగతులు... అతి పురాతనం అపరంజి చరితం మానవ చరిత్ర ఎంత పురాతనమో, బంగారం కూడా అంతే పురాతనం. రాతి యుగానికి ముందే భూమ్మీద బంగారం ఉనికిలో ఉండేది. స్పెయిన్‌లో క్రీస్తుపూర్వం 40 వేల ఏళ్ల నాటివిగా భావిస్తున్న రాతి గుహలలో బంగారు తునకలు దొరకడమే ఇందుకు నిదర్శనం. మానవులు తొలిసారిగా బంగారాన్ని ఎప్పుడు కనుగొన్నారో కచ్చితంగా తెలియదు గానీ, మానవులు కనుగొన్న తొలినాటి లోహాలలో బంగారం ఒకటి. తామ్రయుగం నాటికే... అంటే క్రీస్తుపూర్వం 4 వేల ఏళ్ల నాటికే బంగారం వాడుకలో ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలన్నింటిలోనూ బంగారం వాడుకలో ఉండేది. ప్రాచీన ఈజిప్షియన్లు గిజా పిరమిడ్ల నిర్మాణంలో బంగారాన్ని ఉపయోగించారు. ఈజిప్షియన్ల హయాంలో వెండి కరెన్సీ వాడుకలో ఉండేది. వాడుకలో ఉన్న వెండి కరెన్సీకి, పాలకుల వద్ద బంగారు నిల్వలకు మధ్య నిర్దిష్టమైన నిష్పత్తిని పాటించిన ఘనత ఈజిప్షియన్లదే. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యంలో బంగారు నిల్వల్లో ఒక వంతు బంగారానికి రెండున్నర వంతుల వెండి కరెన్సీ చలామణీలో ఉండేది. ప్రాచీన ఈజిప్షియన్లు బంగారంపై అమితంగా మక్కువ చూపేవారు. బంగారం కోసం విపరీతంగా అన్వేషించేవారు. ఈజిప్షియన్ సామ్రాజ్యంలో బంగారం దొరికే ప్రదేశాలను గుర్తిస్తూ అప్పట్లోనే వారు మ్యాపులు కూడా రూపొందించారు. వాటిలో కొన్ని ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ప్రాచీన గ్రీకు ప్రజలు కూడా బంగారాన్ని విపరీతంగా ఇష్టపడేవారు. బంగారాన్ని అపురూపంగా దాచుకునేవారు. బంగారాన్ని వారు హోదాకు చిహ్నంగా భావించేవారు. సింధులోయ, ఇంకా, అజ్టెక్ తదితర ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు విరివిగా బంగారాన్ని ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. ఈడెన్‌కు సమీపంలోని హవిలా భూముల్లో విస్తారంగా బంగారం ఉన్నట్లు బైబిల్లో ఒక ప్రస్తావన ఉంది. పురాణాలలో పుత్తడి వేద పురాణాల్లోనూ పుత్తడి ప్రస్తావన ఉంది. ధగధగలాడే బంగారాన్ని గురించిన వర్ణనలు వేదాలలో, స్తోత్రాలలో, పురాణాలలో అడుగడుగునా కనిపిస్తాయి. వేద వాఙ్మయంలోని హిరణ్యగర్భ సూక్తం, ఆదిశంకరులు విరచించిన కనకధారా స్తోత్రం వంటివి బంగారంతో భారతీయులకు గల అవినాభావ సంబంధానికి ఆనవాళ్లు. పురాణాలు వర్ణించిన సురాసుర యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులు స్వర్ణాభరణభూషితులై విరాజిల్లేవారు. రావణుడు ఏలిన లంక అడుగడుగునా బంగారు కాంతులతో ధగధగలాడేదట. ఇంద్రుడి స్వర్గం, మహావిష్ణువు వైకుంఠం, కుబేరుడి అలకాపురి పుత్తడిమయంగానే ఉండేవట. లక్ష్మీదేవి అయితే సాక్షాత్తు బంగారానికి ప్రతిరూపమే! మన భారతీయ పురాణేతిహాసాలు మాత్రమే కాదు, గ్రీకు పురాణేతిహాసాల్లోనూ బంగారం ప్రస్తావన ఉంది. హోమర్ రాసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లలో బంగారాన్ని గురించిన వర్ణన ఉంది. బంగారు ధగధగలను హోమర్ ‘అమరుల కీర్తి’గా అభివర్ణించాడు. మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు గానీ, బంగారం కచ్చితంగా మెరుస్తుందని పురాతన మానవులు గుర్తించారు. అందుకే బంగారాన్ని సంపాదించుకోవడానికి, సంపాదించుకున్న బంగారాన్ని కాపాడుకోవడానికి అమితంగా ఆరాటపడేవారు. నగదుగా బంగారం బంగారు నాణేల వాడుక క్రీస్తుపూర్వం 700 ఏళ్ల నాడే మొదలైంది. అమిత ధనవంతుడిగా పేరుమోసిన లిడియా రాజు క్రీసస్ మొట్టమొదటిసారిగా బంగారు నాణేల వాడుకను అధికారికంగా అమలులోకి తెచ్చాడు. బాగా ‘డబ్బు’ చేసిన వారిని మనం కుబేరుడితో పోలుస్తాం గానీ, పాశ్చాత్యులు మాత్రం క్రీసస్తో పోలుస్తారు. ఇంగ్లిష్‌లో ‘రిచ్ యాజ్ క్రీసస్’ అనే జాతీయం వాడుకలోకి వచ్చిందంటే క్రీసస్ రాజుగారి సంపద ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవాల్సిందే. క్రీసస్ బంగారు నాణేలను వాడుకలోకి తెచ్చిన అనతికాలంలోనే ప్రపంచంలోని మిగిలిన రాజ్యాలు కూడా బంగారు నాణేలను వాడుకలోకి తెచ్చాయి. భారతదేశంలోని మహా జనపదాల్లో బంగారు నాణేల వాడుక క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటికే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంచుమించుగా అదేకాలంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోనూ బంగారు నాణేలు వాడుకలో ఉండేవి. ఈజిప్షియన్లు, గ్రీకులు బంగారాన్ని భూమిలోంచి తవ్వి తీసేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. రోమన్లు బంగారం దొరికే ప్రదేశాల కోసం విపరీతంగా అన్వేషణ సాగించేవారు. తమ సామ్రాజ్యంలో బంగారం దొరుకుతుందనిపించే ప్రతి ప్రదేశంలోనూ తవ్వకాలు జరిపేవారు. ఏమాత్రం బంగారం కనిపించినా, గనులు తవ్వేవారు. గనుల తవ్వకం తేలికగా సాగడానికి వీలుగా గనులు ఉన్న ప్రాంతానికి నీటిని మళ్లించేవారు. బంగారు గనుల తవ్వకాల కోసం రోమన్లు ఎక్కువగా యుద్ధ ఖైదీలను, బానిసలను వినియోగించుకునేవారు. ఖైదీలను, బానిసలను ఉపయోగించి తవ్వి తీసిన బంగారంతో నాణేలు ముద్రించేవారు. ఆ బంగారు నాణేలను చెల్లించి భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను, చైనా నుంచి పట్టు వస్త్రాలను కొనుగోలు చేసేవారు. ఆ రకంగా అంతర్జాతీయ వాణిజ్యంలో తొలిసారిగా బంగారాన్ని ఉపయోగించిన ఘనత రోమన్లకే దక్కుతుంది. కనకాభరణాల కథ... బంగారాన్ని నగదుగా ఉపయోగించడానికి ముందు నుంచే నగలుగా ఉపయోగించడం వాడుకలో ఉండేది. పురాతన కాలంలో పసిడికి గల అసలు విలువ మనుషులకు పెద్దగా తెలియకపోయినా, పచ్చగా మిరుమిట్లు గొలిపే పసిడిపై మోజుపడేవారు. స్వచ్ఛమైన బంగారం తేలికగా ఆకృతులను తీర్చిదిద్దడానికి అనువుగా ఉండటంతో రకరకాల అలంకరణలను తయారు చేసుకునేవారు. తోచిన రీతిలో అలంకరించుకుని ముచ్చటపడేవారు. టర్కీలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన బంగారు ఖజానానే ఇందుకు నిదర్శనం. అక్కడ దొరికిన ఆభరణాలు క్రీస్తుపూర్వం 2450–2600 సంవత్సరాల నాటికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాలం గడిచే కొద్దీ మనుషులు బంగారం విలువను గుర్తించారు. అత్యంత అరుదుగా లభించే లోహం కావడం వల్ల అపురూపంగా భద్రపరచుకోవడం ప్రారంభించారు. బంగారు నాణేలు వాడుకలోకి వచ్చిన తర్వాత కూడా నగల తయారీలో బంగారం వాడుక తగ్గలేదు సరికదా మరింతగా పెరిగింది. బంగారం సామాజిక హోదాకు చిహ్నంగా మారింది. అధికారం చలాయించే రాజుల వద్ద, వారికి సన్నిహితంగా ఉండే పురోహిత వర్గం వద్ద బంగారం దండిగా ఉండేది. రాజోద్యోగులు, వర్తకుల వద్ద కూడా బంగారం గణనీయంగానే ఉండేది. ఆలయాలలో దేవతా మూర్తులకు బంగారు అలంకరణలు చేయించే పద్ధతి అప్పట్లో విరివిగా ఉండేది. నగల తయారీ, వాడుకలలోని పద్ధతుల్లో పురాతన కాలానికీ, ఇప్పటికీ సాంకేతికతలో తప్ప పెద్దగా మార్పులు లేవు. ఆర్థిక రంగానికి ఆలంబన కాగితపు నగదు అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదుగా బంగారు నాణేల చలామణీ దాదాపు అంతరించింది. బంగారు నాణేలు వాడుక నుంచి కనుమరుగైపోయినప్పటికీ ఏ దేశంలోనైనా ఆర్థిక రంగానికి మాత్రం బంగారమే ఆలంబనగా ఉంటోంది. డిపాజిట్‌దారులకు, కరెన్సీ నోట్లు కలిగి ఉన్నవారికి చెల్లింపులు జరపడానికి సరిపడినంత బంగారు నిల్వలను ప్రతి దేశంలోనూ సెంట్రల్బ్యాంకులు అట్టిపెట్టుకుని ఉంటాయి. మన దేశంలోని రిజర్వ్ బ్యాంకు కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తోంది. బంగారు నిల్వలను అత్యధికంగా కలిగి ఉన్న దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయిలో ఉంటుంది. అధికారిక బంగారు నిల్వలను కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలో అమెరికా అగ్రగామిగా ఉంది. అమెరికా బంగారు నిల్వలు ఏకంగా 8,133.5 టన్నులు. అధికారిక బంగారు నిల్వలు అత్యధికంగా కలిగిన దేశాలలో భారత్ 557.8 టన్నులతో పదకొండో స్థానంలో ఉంది. మన దేశంలో అధికారిక బంగారు నిల్వల కంటే, వాడుకలో ఉన్న బంగారమే ఎక్కువ. బంగారం సంగతులు ►మానవుడు కనుగొన్న తొలినాటి లోహాలు బంగారం, రాగి. సుమారు క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల నాడే మానవులు బంగారాన్ని కనుగొన్నారు. భూమిపై ఉన్న ఏడు ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. ►ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారిగా వాడుకలోకి తెచ్చిన ఘనత ప్రాచీన గ్రీకు ప్రాంతానికి చెందిన లిడియా రాజు కింగ్ క్రీసస్కు దక్కుతుంది. ఆయన క్రీస్తుపూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను వాడుకలోకి తెచ్చాడు. ►ప్రస్తుతం భూమ్మీద వాడుకలో ఉన్న బంగారం 20 శాతం మాత్రమేనని, మరో 80 శాతం భూగర్భంలోనే ఇంకా నిక్షిప్తమై ఉందని కొందరు శాస్త్రవేత్తల అంచనా. భూగర్భంలో మాత్రమే కాదు... బుధ, శుక్ర, అంగారక గ్రహాల ఉపరితలానికి అడుగున కూడా బంగారం ఉంటుందని వారి అంచనా. ►మనిషి శరీరంలో దాదాపు 0.2 మిల్లీగ్రాముల వరకు బంగారం ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం రక్తంలోనే ఉంటుంది. ► పదిహేడు టన్నుల బంగారు ఖనిజాన్ని శుద్ధి చేయడం కంటే టన్ను బరువు గల పాత కంప్యూటర్లను రీసైకిల్ చేయడం ద్వారా ఎక్కువ పరిమాణంలో స్వచ్ఛమైన బంగారాన్ని పొందవచ్చు. ► భూమిపై ఉన్న అన్ని సముద్రాల అట్టడుగున దాదాపు 2 కోట్ల టన్నుల వరకు బంగారం ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ► ప్రపంచంలో ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారంలో దాదాపు సగం బంగారం ఒకే ఒక్క ప్రదేశం నుంచి దొరికింది. ఆ ప్రదేశం దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్. ► భూగర్భంలో ఉన్న బంగారం అంతటినీ బయటకు తీసినట్లయితే, ఆ బంగారంతో భూమి ఉపరితలం అంతటికీ అడుగున్నర మందాన బంగారు తాపడం చేయించవచ్చు. ► ప్రపంచంలోని బంగారంలో దాదాపు 11 శాతం భారతదేశంలోని మహిళల వద్ద ఆభరణాల రూపంలోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణం అమెరికా, జర్మనీ, స్విట్లర్జాండ్, ఐఎంఎఫ్‌ల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. ► ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న బంగారాన్నంతటినీ కరిగించి, ఒకే ఇటుకలా తయారు చేస్తే చిన్నసైజు కొండలా తయారవుతుందను కుంటున్నారా? కానే కాదు. కేవలం 68 అడుగుల పొడవు, 68 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తు గల భారీ ఇటుకలా తయారవుతుంది. అంతే! వాడుకలో మనమే నంబర్ 1 భారతీయులు బంగారాన్ని తవ్వి తీసింది తక్కువే గానీ, బంగారాన్ని వినియోగించడంలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో కోలార్ వంటి ప్రాంతాల్లో బంగారు గనులు ఉండేవి. ప్రస్తుతం అలాంటివేవీ లేవు. మన భూభాగంలో బంగారు నిక్షేపాలు గణనీయంగా లభించే అవకాశాలు లేకున్నా, బంగారం వినియోగంలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తుండటమే విశేషం. బంగారం వినియోగంలో మనకు గట్టిపోటీ చైనా నుంచి ఎదురవుతోంది. ఒక్కో ఏడాది భారత్, ఒక్కో ఏడాది చైనా బంగారం వినియోగంలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది 842.7 టన్నుల బంగారం వినియోగంతో భారత్ మొదటి స్థానంలో నిలిస్తే, చైనా 813.6 టన్నులతో రెండో స్థానంలో నిలిచింది. బంగారంపై భారతీయుల మోజు ఎలాంటిదో చాటడానికి ఈ లెక్కలు చాలవూ! బంగారం ఉత్పత్తిలో మాత్రం చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. గత ఏడాది చైనా 490 టన్నుల బంగారం ఉత్పత్తితో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బంగారంలో ఆభరణాల రూపంలో ఉన్నది 52 శాతం మాత్రమే. అధికారిక నిల్వలుగా 18 శాతం, పెట్టుబడుల రూపంలో 16 శాతం బంగారం ఉండగా, మరో 12 శాతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది. ఇక లెక్కలకు చిక్కని ‘నల్ల’బంగారం కేవలం 2 శాతం మాత్రమే. ప్రస్తుతానికి కంగారేమీ అక్కర్లేదు నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం బంగారంపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లయిన మహిళలు గరిష్టంగా 500 గ్రాముల వరకు, పెళ్లికాని మహిళలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని కలిగి ఉండాలని, అంతకు మించిన బంగారం ఉంటే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించినట్లు కథనాలు రావడంతో బంగారం పేరు చెబితేనే జనాలు కంగారు పడే పరిస్థితి నెలకొంది. రిజర్వ్‌బ్యాంకు వద్ద బంగారు నిల్వలను పెంచుకోవడానికే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడుతోందనే వదంతులు వినిపించాయి. నోట్ల రద్దు దరిమిలా బంగారంపై వెలువడిన కథనాలపై రకరకాల ఊహాగానాలు, గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం వాటికి తెరదించుతూ ప్రకటన జారీ చేసింది. వెల్లడించిన ఆదాయానికి, కలిగి ఉన్న బంగారానికి పొంతన ఉన్నట్లయితే ఎలాంటి పరిమితులూ ఉండవని స్పష్టం చేసింది. నగల రూపంలో ఉన్న బంగారాన్ని వారసత్వంగా వచ్చిన బంగారంగానే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉన్నా, ప్రభుత్వం ఈ దిశలో తీసుకోబోయే తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


