భారత నౌకలపై దాడులా? | Sakshi Editorial On USA Attack Indian ships | Sakshi
Sakshi News home page

భారత నౌకలపై దాడులా?

Jun 12 2026 1:15 AM | Updated on Jun 12 2026 1:15 AM

Sakshi Editorial On USA Attack Indian ships

ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్‌ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్‌ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేష్‌ అనే చీఫ్‌ మెరైన్‌ ఇంజినీర్‌. అంతకుముందు రోజు సైతం భారత్‌కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్‌కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్‌ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్‌నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్‌కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్‌ ఎవరు?

దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్‌కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్‌లో ‘ఇండోపాకాం’, యూరప్‌లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్‌ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్‌ డీ ఎఫైర్స్‌ జాసన్‌ మీక్స్‌ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.

అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్‌ను ట్రంప్‌ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్‌ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్‌ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్‌ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్‌ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.

నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్‌ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్‌ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్‌ అంటున్నట్టు ఖర్గ్‌ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్‌ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్‌పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు.  

Advertisement
 
Advertisement
Advertisement