మణిపూర్‌ చక్కబడేదెన్నడు? | Sakshi Editorial On Manipur issues | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ చక్కబడేదెన్నడు?

Apr 24 2026 1:36 AM | Updated on Apr 24 2026 1:36 AM

Sakshi Editorial On Manipur issues

మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగి మూడేళ్లు కావస్తున్నా అక్కడింకా పరిస్థితులు చక్కబడలేదని తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి. 2023 మే నెలలో హింసకు దారితీసిన వదంతులే ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. బీరేన్‌ సింగ్‌ నాయ కత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అది ఏడాది కొనసాగాక మొన్న ఫిబ్రవరిలో ఆ పార్టీకి చెందిన ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ పరస్పర అపనమ్మకం, జాతి విద్వేషాలు ఆగిందిలేదు. వందలాదిమంది ఆయుధాలు ధరించి గుంపులుగా బయల్దేరి ఊళ్లమీద పడి నిర్విచక్షణగా హత్యాకాండకు, అత్యాచారాలకు పాల్పడటం, ప్రార్థనా స్థలాలు, ఆవాసాలు తగలబెట్టడం ఇప్పుడు లేక పోవచ్చుగానీ... అవతలి పక్షంపై ఆగ్రహావేశాలు తగ్గలేదు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరగటం, రహదారులను స్తంభింపజేయటం ఆగలేదు. కేంద్ర బలగాల సంఖ్యను పెంచటం, నిరంతర పహారా వంటివి హింసాత్మక ఉదంతాలను గణనీయంగా కట్టడి చేశాయి. కానీ ఇప్పటికీ విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలూ, తప్పుడు సమాచారం వ్యాప్తిలోనే ఉన్నాయి. 

ఈ నెల మొదటివారంలో ఒక ఇంటిపై బాంబుపడి ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆ బాంబు కుకీలు నివసిస్తున్న ప్రాంతంనుంచి వచ్చిపడిందనీ, వారికి భద్రతా బలగాలు కొమ్ముకాస్తున్నా యనీ ప్రచారం వెల్లువెత్తడంతో జనం ఒక సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై దాడి చేశారు. అటుగా వాహనంలో వెళ్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన అధికారిని గుంపు చుట్టుముట్టి దౌర్జన్యం చేసింది. ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు రక్షించగలిగాయి. మొన్న మంగళవారం ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ముఖ్య మంత్రిని ఆందోళనకారులు అడ్డుకున్నప్పుడు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు హెలికాప్టర్‌ తెప్పించుకుని అక్కడినుంచి ఆయన బయటపడాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మాజీ సైనికుడితో సహా ఇద్దరు నాగా జాతీయుల్ని మిలిటెంట్లు హతమార్చారు. 

మూడేళ్ల క్రితం మెయితీలకూ, కుకీలకూ మధ్య వైరం హింసకు దారితీయగా ఇప్పుడు మెయితీల గురి నాగాలపై కూడా పడింది. ఒక పద్ధతి ప్రకారం వదంతులు వ్యాప్తిచేయటం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ఇంకా ఆగలేదు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆ వదంతుల్ని ఖండిస్తూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఉద్రిక్తతల్ని ఆపటంలో అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. గతంలో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో మెయితీలకు చెందిన సాయుధ మిలిటెంట్‌ సంస్థ ఆరంబాయ్‌ టెంగోల్‌ను చూసీచూడనట్టు వదిలేశారు. కుకీల ‘దురాక్రమణల్ని’ అడ్డుకునే పేరిట ఏర్పడిన ఆ సంస్థ కుకీలకూ, నాగాలకూ మాత్రమే కాదు, వారిని ప్రశ్నించే మెయితీలకు సైతం పెద్ద బెడదగా పరిణమించింది. బెదిరించటం, దౌర్జన్యం చేయటం, బలవంతంగా వసూళ్లకు పాల్పడటం ఆ సంస్థకు నిత్యకృత్యమైంది. 

మూడేళ్లనాటి ఉదంతాలతో పోలిస్తే హింసాత్మక ఘటనలు తగ్గివుండొచ్చు. కానీ ఇప్పటికీ సమాజం చీలికలు, పేలికలుగా ఉంది. మెయితీలూ, కుకీలూ ఒకరి ప్రాంతంలోకి ఒకరు వెళ్లలేకపోతున్నారు. పనిచేయగలిగిన సత్తావుండి అది దొరుకుతుందన్న భరోసా ఉన్నచోటకు పోలేకపోవటం, పై చదువులకు అర్హతలున్నా ఊరు కదల్లేక పోవటంకన్నా మించిన హింస ఏం ఉంటుంది? పరిమిత వనరులు, ఉపాధి లేమి, భిన్న తెగలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటంవంటి కారణాలవల్లే అసంతృప్తి అవధులు దాటుతోంది.

యువతకు ఉపాధి కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, వారికి మెరుగైన అవకాశాలు రావటానికి తగిన ప్రణాళికలు రూపకల్పన చేయటంవంటి ప్రయత్నాలు ఎక్కడా కనబడవు. కనుకనే మిలిటెంట్‌ సంస్థల ఆధిపత్యం సాగుతోంది. మౌలిక సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నేతలు ఓట్లు రాబట్టుకోవటానికి మాత్రం ఆయా తెగల్ని శాసించగల మిలిటెంటు సంస్థలకు సహకరిస్తున్నారు. ఇది కొనసాగినంత కాలమూ మణిపూర్‌ నెత్తురోడుతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిస్తేనే ఆ రాష్ట్రం తెరిపిన పడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement