పొదుపు కాలం | Sakshi Editorial On PM Narendra Modi Comments On savings, economy | Sakshi
Sakshi News home page

పొదుపు కాలం

May 12 2026 1:33 AM | Updated on May 12 2026 1:33 AM

Sakshi Editorial On PM Narendra Modi Comments On savings, economy

ఎన్నికల హోరు సద్దుమణిగి, రాష్ట్రాలన్నిటా ప్రభుత్వాల ఏర్పాటు పూర్తికావస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ పౌరులనుద్దేశించి ఒక హెచ్చరిక లాంటి హితోపదేశం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించటానికి కోవిడ్‌ కాలంలో అనుసరించిన పొదుపు చర్యలు తప్పనిసరంటూ పౌరులకు సూచించారు. ఆయన చెప్పినవాటిల్లో వర్క్‌ ఫ్రం హోం, ప్రజారవాణా వ్యవస్థల వినియోగం, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల నిలిపివేత, విదేశీ ప్రయాణాలు మానుకోవటం, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పాటించదగ్గవే. దీనికితోడు ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంక్‌లు మూసేస్తారు. సోమవారం వెల్లడైన వివరాలనుబట్టి చమురు సంస్థలు రోజూ రూ. 1,700 కోట్లు నష్టపోతున్నాయని తెలుస్తోంది. 

గత పది రోజుల్లో మొత్తంగా నష్టాలు రూ. లక్ష కోట్ల మేర ఉన్నాయనీ దాని సారాంశం. నిజానికి ఎన్నికల ప్రచారపర్వం మధ్యలో మోదీ ఒకసారి చూచాయగా పరిస్థితి తీవ్రతను చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయనీ, పర్యవసానంగా అన్ని సరుకుల ధరవరలూ ఆకాశాన్నంటుతాయనీ విపక్షాలు ప్రచారం చేయటంతో బీజేపీ బెంబేలుపడి ఇక దాని జోలికిపోలేదు. దేశ ప్రజల్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తోంది. హార్మూజ్‌ జలసంధిని ఇరాన్, అమెరికాలు దిగ్బంధించటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మన దేశం మాత్రమే వీటన్నిటికీ అతీతంగా మనుగడ సాగిస్తుందనీ, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ తట్టుకోగలదనీ భావించటం అమాయకత్వం. 

చైనా మొదలుకొని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలు ఇప్పటికే రక రకాల చర్యలు అమల్లోకి తెచ్చాయి. చమురు ఎగుమతులన్నీ ఆపేయాలని దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలను చైనా ఆదేశించటంతోపాటు పెట్రో ధరల్ని కూడా పెంచింది. జెట్‌ ఇంధనం ధరలు పెరగటంతో అక్కడి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు పలు సర్వీసుల్ని నిలి పేశాయి. ఫిలిప్పీన్స్‌ మార్చిలోనే జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉచిత సర్వీసుగా మార్చటం లేదా టికెట్‌ ధరలు తగ్గించటం వంటి చర్యలు తీసుకున్నాయి. సొంత వాహనాల వాడకం తగ్గించటమే దీని ఉద్దేశం. శ్రీలంక కూడా వారానికి నాలుగు రోజుల పనివిధానం ప్రకటించి, వారానికి ఒకరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతోపాటు ఇంధనంపై రేషన్‌ విధించింది. 

హార్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా పంతాలకు పోవటంతో 1,500 నౌకలు నిలిచిపోయాయి. అందులో మన నౌకలు 13 వరకూ ఉన్నాయి. తాజాగా ఇరాన్‌ ప్రతిపా దనల్ని అమెరికా తోసిపుచ్చడంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణుగుతుందన్న ఆశ అడుగంటింది. ఉన్నకొద్దీ పరిస్థితి ముదరవచ్చు. అందుకే ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు తక్షణ కర్తవ్యం. అయితే ఈ ఆచరణ ప్రభుత్వాలపరంగా మొదలుకావాలి. ఆర్భాటాల్లేకుండా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ముగించటం, సాధ్యమైనంతవరకూ ప్రత్యేక విమానాల వాడకం ఆపేయటం, సీఎంలు, మంత్రుల కాన్వాయ్‌లలో పదులకొద్దీ వాహనాల వినియోగం వంటివి విరమించుకోవాలి. ఇక ఏపీ వరకూ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల నివాసాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వారాంతంలో ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి దుబారా అవసరమా? 

మన దిగుమతుల్లో బంగారం, చమురు సింహభాగం ఆక్రమిస్తాయి. 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7,200 కోట్ల డాలర్లు. మనకు అవసరమైన చమురులో 90 శాతంమేర దిగుమతి చేసుకుంటున్నాం. మొన్న ఏప్రిల్‌ 24కు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 69,000 కోట్ల డాలర్లయితే, ఒక్క వారంలో అంటే... ఈనెల 1 నాటికి అందులో 779 కోట్ల డాలర్లమేర హరించుకుపోయాయి. ఇదే వరస కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అయితే ఏమేరకు పొదుపు అవసరమనేది కూడా చూసుకోవాలి. అది మితిమీరినా ఆర్థికవ్యవస్థకు చేటు తప్పదు. కనుక సమతుల్యత అత్యవసరం. 

Advertisement
 
Advertisement
Advertisement