గేటెడ్‌ కమ్యూనిటీ... గ్రేటర్‌ రాజధాని! | Sakshi Editorial On Andhra Pradesh capital By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

గేటెడ్‌ కమ్యూనిటీ... గ్రేటర్‌ రాజధాని!

Jul 5 2026 12:36 AM | Updated on Jul 5 2026 12:36 AM

Sakshi Editorial On Andhra Pradesh capital By Vardhelli Murali

జనతంత్రం

ఇదొక సదవకాశం. మచిలీపట్నం టు గుంటూర్‌ వయా విజయవాడ క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదన ఇప్పుడు బలంగా ముందుకొస్తున్నది. ఆచరణాత్మ కమైన, వివేకవంతమైన ఈ ఆలోచనను విజ్ఞులైన ఆంధ్రప్రజలు ఎల్లెడలా సమర్థిస్తున్నారు. ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఇది కీలకపాత్ర పోషించిన ప్రాంతం. జాతీయోద్యమం, సామ్య వాద–హేతువాదాలు, దళిత పోరాటాలకు నాయకత్వాలను సమకూర్చిన ప్రాంతం. తెలుగు సినిమా పరిశ్రమకు నారు పోసింది ఇక్కడే. రఘుపతి వెంకయ్య నాయుడు ఇక్కడివాడే. ఆంధ్రకళా వైభవానికి బుర్రకథతో తిలకం దిద్దిన నాజర్‌ కూడా ఇక్కడి బిడ్డే.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రకరకాల సెంటిమెంట్లను కొనుగోలుదార్లపై ప్రయోగించడం కొత్త విషయం కాదు. అదే పద్ధతిలో అమరావతి గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్‌ను యథేచ్ఛగా నిర్వహించుకోవడానికి వీలుగా, దాని చుట్టూ ఒక బలమైన సెంటిమెంట్‌ను ఉత్పత్తి చేయడానికి చంద్రబాబు అండ్‌ కో గత పదేళ్లుగా శ్రమిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్‌’ ప్రాంతంపై అల్లుకున్న భావోద్వేగాలతో పోలిస్తే సోకాల్డ్‌ అమరావతి సెంటిమెంట్‌ సముద్రంలో కాకి రెట్టతో సమానం.

సెంటిమెంట్‌ సంగతి వదిలేసి ఆచరణీయత కోణంలో ఆలోచించినా, అమరావతి ప్రాజెక్టు భవిష్యత్తులో ఒక గుది బండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమరావతి వెంచర్‌లో కళ్లు చెదిరే లాభాలను ప్రమోటర్లు పిండుకునే అవకాశాలున్నందువల్లనే హితోక్తులను బాబు సర్కారు చెవికెక్కించుకోవడం లేదనేందుకు ఆధారాలున్నాయి. సొంత లాభం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పులిస్వారీ చేయి స్తున్నారని అమరావతి ప్రమోటర్లపై విమర్శలున్నాయి. మాన్యు మెంటల్‌ అవినీతికి అమరావతి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని ప్రతిపక్షం చాలారోజుల నుంచి ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణ నిర్హేతుకమేమీ కాదు.

రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్‌కు రాజధానిని సూచించడానికి శివరామకృష్ణన్‌ కమిషన్‌ను కేంద్రం నియమించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు సభ్యులుగా ఉన్న ఈ కమిషన్‌ సూచనలకు పూర్తి విరుద్ధంగా బాబు సర్కార్‌ నిర్ణయాలు తీసుకొన్నది. పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌ నగర్‌ నిర్మాణం అవాంఛనీయమని చేసిన హెచ్చరికను ప్రభుత్వం ఖాతరు చేయలేదు.

రాజధాని ప్రాంత ఎంపికలోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే విమర్శలు విస్తృతంగా వినిపించాయి. ముందుగా తన అనుయాయుల చేత భూములు కొనిపించి, ఆ తర్వాత తన పిలుపు మేరకు ల్యాండ్‌ పూలింగ్‌కు అప్పగించేలా చేశారు. తద్వారా మిగిలిన రైతులమీద ఒత్తిడి పెంచారు. పూలింగ్‌కు భూములు ఇస్తే బంగారంలాంటి నివాస–వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తారని ఊదరగొట్టారు. ఈ మోసపూరితమైన ఎత్తుగడతో సాగిన సమీకరణను ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు జోడించుకున్నారు.

సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో సింగపూర్‌లాంటి నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలను రంగంలోకి దించారు. తర్వాతి కాలంలో ఇక్కడ చంద్రబాబు అధికా రాన్ని కోల్పోయారు. అమరావతి వ్యవహారంలో ఆయనకు సహకరించిన సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అవినీతి ఆరోప ణలపై జైలుపాలయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అవినీతి ద్విగుణీకృతమైందని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రతిపక్షం సాక్ష్యాలను ముందు పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం.

ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయాలు సగటున చదరపు అడుగుకు పదివేల రూపాయలట. సెక్రటేరియట్‌ కోసం కడు తున్న ఐకానిక్‌ భవనాలకైతే చదరపు అడుగు ఖర్చు 19 వేల పైచిలుకట. అదేచోట కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న ఖర్చు సగటున నాలుగున్నర వేలు మాత్రమే. ఎందుకింత తేడా? ఈ లెక్కలు ముందుపెట్టి జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తుంటే కూటమి మైకాసు రులు మైకంతో మాట్లాడుతున్నారు.

జగన్‌ లేవనెత్తిన డజన్లకొద్దీ ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ స్పష్టమైన సమాధానం రాలేదు. జగన్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడనే స్టీరియోఫోనిక్‌ ఎదురుదాడినే కూటమి ఆశ్రయిస్తున్నది. చదరపు అడుగుకు 19 వేల ఖర్చే మిటని జగన్‌ ప్రశ్నిస్తే, వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు బదులిస్తాడు. భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లను ఎందుకీయలేదని జగన్‌ ప్రశ్నిస్తే జగన్‌ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని చంద్రబాబు సమా ధానం చెబుతాడు. కూటమి నేతలు, కూటమి మీడియా అవే మాటలు వల్లిస్తారు. 

హైదరాబాద్‌ నగరంలో ఎకరం రెండొందల కోట్లపైగా ధర పలుకుతున్న ప్రాంతాల్లో కూడా రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ కొనుగోలుకు చదరపు అడుగుకు పది పదిహేను వేలు దాటడం లేదు. అమరావతిలో మాత్రం భూమి ఖర్చులేకుండా, ఇసుక ఫ్రీగా వచ్చినా చదరపు గజానికి 19 వేలు ఖర్చు చేయడ మేమిటి? ఎందుకింత ఖర్చవుతుందో లెక్కచెబుతూ ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు? అమరావతి వ్యథలో అవినీతి ఒక భాగమైతే అది సాధారణ ప్రజలకు అనుమతిలేని ఒక గేటెడ్‌ కమ్యూనిటీ కావడం మరో భాగం. పైగా దానికి ప్రజా రాజధాని అనే తోకను తగిలించడం పెద్ద జోక్‌.

అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలుత నాలుగేళ్లు, ఇప్పుడు రెండేళ్లు కలిపి ఆరేళ్లు కూటమి అధికారంలో ఉన్నది. తాత్కాలికంగా నిర్మించిన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల భవనాలు తప్ప అక్కడ ఇంకే నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది కూడా ప్రభుత్వ భవనాలు, సిబ్బంది గృహ సముదాయాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల భవనాలు మాత్రమే. ఉపాధి కల్పించే కంపెనీలేవీ అక్కడికి రాలేదు. వచ్చే అవకాశం కూడా కన్పించడం లేదు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇప్పటికే అందించలేకపోయారు. కాగితాలపై వేసిన ప్లాట్లు కూడా చెరువుల్లో కుంటల్లో, కాలువల్లో, శ్మశానాల్లో వేశారట.

నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తయినా కూడా,సాయంత్రం కాగానే నిర్మానుష్యమయ్యే మరో నయా రాయ్‌ పూర్‌ అవుతుంది తప్ప మరో విజయవాడో, గుంటూరో కాబోదు. సాధారణ మధ్యతరగతి ప్రజల నివాసానికి అవసర మయ్యే ఎకోసిస్టమ్‌ అందుబాటులో ఉండే ఈ నగరాలను,మంగళగిరి–తాడేపల్లిని దాటి అమరావతిలో అక్కడ పనిచేసే వాళ్లు కూడా నివసించడానికి మొగ్గు చూపకపోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న 58 వేల ఎకరాలకు తోడు మరో లక్ష ఎకరాలు సమీకరిస్తే తప్ప అమరావతి మహానగరంగా మారడం కష్టమట!

రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ అభివృద్ధి చేయడానికే ఎకరాకు 2 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తన డీపీఆర్‌లో పేర్కొన్నది. ఈ లెక్కన 3 లక్షల కోట్లు ఈ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేయాలి. ఇప్పటికే 47 వేల కోట్లు అప్పు చేశారు. 60 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణ పనుల కోసం వలస వచ్చిన కార్మికులు, అక్కడి పల్లెల్లో ఉన్న ప్రజలు తప్ప అక్కడెవరూ నివసించడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండగా మారబోతున్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా మావిగన్‌ ప్రతిపాదన చేశారు.

బంగారుగుడ్డు పెట్టే బాతును పాలకులు వదులుకుంటారా? అందుకే ఎదురు దాడికీ, అసత్యాల ప్రచారానికీ పూనుకున్నారు. అమరావతి పేరు మీద చేస్తున్న ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు, తక్షణమే ఒక మహానగరం రాజధానిగా అందు బాటులోకి వస్తుంది. ఇందులో అమరావతి గేటెడ్‌ కమ్యూనిటీ కూడా భాగం కావచ్చు. సాధారణ ప్రజలకు ఎటూ అక్కడ ప్రవేశం లేనందున జూబ్లీహిల్స్‌లాంటి సంపన్న ప్రాంతంగా అమరావతి ఆవిర్భవించవచ్చు. జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన మచిలీపట్నం రేవు పనులు త్వరలో పూర్తవుతాయి. పోర్టుతో పాటు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయ వాడ–గుంటూరు రైల్వేజంక్షన్లు రాజధాని నగరంలో భాగమ వుతాయి. విశాఖకు తోడుగా మరో గ్రోత్‌ ఇంజిన్‌గా మావిగన్‌ అందుబాటులోకి వస్తుంది.

మచిలీపట్నం రేవుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. శాతవాహనుల కాలం నుంచే ఇక్కడినుంచి వర్తకం జరిగింది. గోల్కొండ నవాబుల కాలంలో ఇక్కడినుంచి వజ్రాలను, వస్త్రాలను ఎగుమతి చేసేవారట. హైదరాబాద్‌ నుంచి సూర్యా పేట, విజయవాడ మీదుగా మచిలీపట్నానికి ఆ రోజుల్లోనే రహదారిని నిర్మించారు. నాలుగొందల ఏళ్ల కిందనే ఇక్కడ డచ్చివారు వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తొలి అడుగేసింది మచిలీపట్నంలోనే. మచిలీపట్నం, గుంటూరు పట్టణాల్లో స్వాతంత్య్రానికి వందేళ్ల పూర్వమే కాలేజీలు ఏర్పడ్డాయి. కృష్ణా బ్యారేజీ నిర్మాణం తర్వాత గొప్ప వ్యావసాయిక వాణిజ్య కేంద్రంగా గుంటూరు ఎదిగింది. దానికి తోడు అది ప్రఖ్యాత విద్యా కేంద్రం కూడా.

దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ సెంటర్లలో విజయవాడ ప్రముఖమైనది. సినీరంగ పరిశ్రమకు చాలాకాలం పాటు అది జీవనాడిగా పనిచేసింది. రాజకీయ కార్యకలాపాలకూ, పత్రికా రంగానికీ ప్రధాన కేంద్రంగా ఉంటూ చాలాకాలం పాటు మరో రాజధానిగా ఖ్యాతిగాంచిన నగరం విజయవాడ. ఇక్కడ 1924లో జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే పింగళి వెంకయ్య త్రివర్ణ జాతీయ పతాకం డిజైన్‌ను మహాత్మాగాంధీకి సమర్పించారు. ఈ ప్రాంతంవాడైన కొండా వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు.

కృష్ణా పత్రికను స్థాపించిన ముట్నూరి కృష్ణారావు, ఆంధ్ర పత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు మావిగన్‌ ప్రాంతంవారే. స్వాతంత్రోద్యమానికి ఆంధ్రప్రాంతాన్ని సమాయత్తం చేసిన పత్రికలవి. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్‌ కాలేజీలో చదువుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, భవనం వెంకట్రామ్‌ ఏపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించింది విజయవాడలోనే. అంటరానితనానికి వ్యతి రేకంగా హరిజనోద్యమం కూడా ఇక్కడ ప్రారంభమైంది. చరిత్ర ప్రసిద్ధి చెందిన ‘మాలపల్లి’ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణ ఇక్కడి వ్యక్తే.

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో పుట్టినప్పటికీ ఆయన గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు. చండ్ర రాజేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య వంటి కమ్యూనిస్టు దిగ్గజాలకు జన్మనిచ్చింది కూడా ఈ ప్రాంతమే. హేతువాద ఉద్యమంతో ప్రజల్లో చైతన్యం నింపిన త్రిపురనేని రామస్వామి చౌదరి, రైతుబాంధవుడిగా పేరుగాంచిన ఆచార్య ఎన్‌జీ రంగా జన్మ స్థానం, ప్రధాన కార్యక్షేత్రం కూడా ఇదే. 

గత వైభవాన్ని తలపోస్తూ, సాంస్కృతిక పునరుజ్జీవానికి పిలుపునిస్తూ గేయాలు, కవితలు రాసిన కవులెందరో ఇక్కడు న్నారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అని పిలుపునిచ్చిన వేములపల్లి శ్రీకృష్ణ, ‘‘నట్టనడి సంద్రాన నావ నిలుచున్నాది. చుక్కాని పట్టరా తెలుగోడా, నావ దరిజేర్చరా మొనగాడా’’ అనే సందేశాన్నిచ్చారు. శ్రీకృష్ణ మూడుసార్లు మంగళగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ‘కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయపతాక’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గుంటూరు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘‘చెక్కు చెదరని యేనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడధ్వన్నమాయె, తిరిగి వెనుకకు మరలిచూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’’ అని వేడుకున్నారు. అమరావతి గేటెడ్‌ కమ్యూనిటీ కోసం కృత్రిమ సెంటిమెంట్‌ ప్రచారం చేస్తున్న కూటమికి మావిగన్‌ సెంటిమెంట్‌తో పోలికా? ఆ సెంటిమెంట్‌ను విస్తరించి చెప్పా లంటే మహాగ్రంథమవుతుంది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement