ఓ ఆలోచన అందరినీ కదిలిస్తుంది. ఓ ప్రయోగం సమాజానికి ఉపయోగపడుతుంది. ఓ ఆవిష్కరణ నవశకానికి నాంది పలుకుతుంది. నేటి ఆధునిక యుగంలో విపరీతమైన పోటీ వాతావరణం విద్యార్థులకు సవాల్ విసురుతోంది. నవీన ప్రయత్నాలతో ప్రతిభను ప్రదర్శించాల్సిన ఆవశ్యకతను కల్పిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యలకు చెక్ పెట్టేలా పలమనేరులోని మదర్‌థెరిస్సా కళాశాల విద్యార్థులు సరికొత్తగా ఓ డివైజ్‌ను కనిపెట్టారు.
పలమనేరు : మద్యం సేవించి బైక్ నడపడంతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది యువత, విద్యార్థులే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసు శాఖ ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా, భారీ జరిమానాలు విధించినా నియంత్రించడం కష్టంగానే మారింది. తరచూ పత్రికల్లో వచ్చే ఇలాంటి వార్తలను చూసి చలించిన పలమనేరులోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మద్యం సేవించి మోటార్ సైకిల్ ఎక్కితే స్టార్ట్ కాని కొత్త సిస్టమ్‌ను కొనుగొన్నారు.

మద్యం సేవిస్తే స్టార్ట్ కాని బైక్ ముందు విద్యార్థులు
ముగ్గురు విద్యార్థుల ప్రతిభ
కళాశాలకు చెందిన శ్యాంప్రసాద్, జస్వంత్, నందశివకుమార్ అనే బీటెక్ (ఈసీ విభాగం)విద్యార్థులు ఈ డివైజ్‌ను కనుగొన్నారు. వాహనదారుడు మద్యం సేవించి హెల్మెట్ ధరించగానే సెన్సార్లు గుర్తించి బైక్ స్టార్ కాకుండా చేస్తాయి. అయితే హెల్మెట్ ధరించకుంటే బైక్ అసలు స్టార్ట్ కాదు. దీంతో హెల్మెట్ ధరించగానే లిక్కర్ స్మెల్‌ను డివైజ్ పసిగడుతుంది. మరోవైపు అన్నీ సక్రమంగా ఉన్నా ఏఐ ద్వారా బైక్ బల్బు ముందు మరో మైక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ముందున్న ప్రాంతాన్ని వీడియో తీస్తుంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తిస్తుంది. దీంతో హిట్ అండ్ రన్ కేసులను సులభంగా గుర్తించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా రూ.5వేలు మాత్రమే ఉంటుంది. కేవలం సామాజిక ప్రయోజనాల కోసమే దీన్ని తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ఈ డీవైజ్‌పై పేటెంట్‌ను పొందుతామని చెబుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది.

గతంలో మరో ఆవిష్కరణ
గతంలో ఇదే కళాశాలకు చెందిన విద్యార్థి పెట్రోలుతో పనిలేకుండా కేవలం సోలార్, కరెంటు, డైనమోల సాయంతో నడిచే ఈ–బైక్‌ను రూ.15వేల వ్యయంతో తయారుచేశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ–బైక్‌లు హల్‌చల్ చేస్తున్నా.. పదేళ్ల క్రితమే ఇదే కళాశాల విద్యార్థి ముజామిల్ ఆవిష్కరించాడు. తన తండ్రి అల్లాబక్ ్ష తోపుడుబండిపై అరటిపళ్లను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామాల్లో సైకిల్‌పై వచ్చే విద్యార్థుల బాధలను చూసి ఎలాగైనా ఈ –సైకిల్‌ను తయారు చేయాలని భావించాడు. ఇందుకోసం ఓ పాత సైకిల్‌ను రూ.1,500 కొన్నాడు. దీనికి సోలార్ పెనాల్, 12 వోల్టుల రెండు బ్యాటరీలు, 240 వోల్ట్స్ కలిగిన హబ్‌మోటార్, దానికి రెగ్యులేటర్, బ్యాటరీ ఇండికేటర్, స్టెప్పార్‌మోటార్, ఎక్స్‌లేటర్ కొన్ని కేబుళ్లను సైకిల్‌కు అమర్చాడు.
దీనికోసం అయిన ఖర్చు రూ.13,500. మొత్తం రూ.15వేలతో దీన్ని తయారుచేశాడు. ఇది మూడు రకాల శక్తులతో పనిచేస్తోంది. పైన అమర్చిన సోలార్ ప్లేట్లలో సౌరశక్తి ఉత్పత్తి అయి బ్యాటరీకి చేరుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కరెంటును నింపుకోవడంతో కరెంటు బ్యాటరీకి చేరుతుంది. సైకిల్ చక్రాలు తిరిగినపుడు డైనమో ద్వారా ఉత్పయ్యే కరెంటు బ్యాటరీకి చేరుతుంది. ఇలా మూడు ఉత్పత్తులు ద్వారా శక్తిని తయారు చేసి దీనిద్వారా మోటారు సాయంతో ఇది నడిచేలా తయారు చేశాడు. ఓసారి బ్యాటరీ ఫుల్ అయితే 40 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. అప్పట్లో ఈ ప్రయాగం సంచలనంగా మారింది. నేడు ఈ–సైకిళ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇక మద్యం సేవించి బైక్ ఎక్కితే స్టార్ట్ కాని బైక్‌లు భవిష్యత్తులో రావచ్చేమో.
ప్రతిభకు ప్రశంసలు
డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటోమేటిక్ బైక్ ఆఫ్ డివైజ్‌ను తయారుచేసిన విద్యార్థులపై కళాశాల చైర్మన్ రవీంద్రబాబు, అకడమిక్ అడ్వైజర్ రాజేంద్ర రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించారు. ప్రాజెక్టు అభివృద్ధి, పేటెంట్ కోసం చేయూతనందిస్తామని భరోసా ఇచ్చారు.


