ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కులిష్ కీలక పాత్ర
సింథియా: భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కులిష్ నౌకలు ఫిలిప్పీన్స్‌లో నిర్వహించిన ఆసియాన్–భారత్ సముద్ర విన్యాసాలను విజయవంతంగా ముగించాయి. ‘నమ్మకంతో కూడిన బలమైన బంధం–సముద్రంలో ఐక్యత’ అనే ఇతివృత్తంతో ఈ విన్యాసాలను నిర్వహించారు. హార్బర్ దశలో భాగంగా అధికారులు సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు, యోగా, వివిధ అంశాలపై నిపుణులతో చర్చలు నిర్వహించారు.
సముద్ర దశలో సమన్వయం, సంసిద్ధతను పెంపొందించేందుకు టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్, ఆపరేషనల్ సింక్రనైజేషన్, ప్రీ–సెయిల్ బ్రీఫింగ్ నిర్వహించారు. సముద్ర దశలో ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కులిష్ నౌకలు పలు సమన్వయ సముద్ర విన్యాసాల్లో పాల్గొన్నాయి. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు, నౌకలోకి ప్రవేశించి సోదాలు నిర్వహించడం, సముద్రంలోనే ఇంధనం సరఫరా చేయడం వంటి విన్యాసాలను చేపట్టాయి. హెలికాప్టర్ విన్యాసాల్లో క్రాస్–డెక్ ల్యాండింగ్, వర్టీకల్ రీప్లెనిష్‌మెంట్, అత్యవసర వైద్య తరలింపు వంటి కార్యక్రమాలను నిర్వహించారు.


