పోక్సో కేసు నమోదు
రైల్వేకోడూరు అర్బన్: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో 5వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజులు ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాధిత బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.
చీర్ల రమేష్ నాయుడు బుధవారం రాత్రి 8 గంటలకు బాలికను తన ఆటోలో తీసుకెళ్లాడు. తిరిగి ఓ గంట తరువాత ఇంటివద్ద వదిలి వెళ్లాడు. రెండు రోజులుగా బాలిక మౌనంగా ఉండడాన్ని గమనించిన తల్లి నిలదీసి అడిగింది. దీంతో రమేష్ నాయుడు తనపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక వివరించింది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే, కార్యకర్త రమేష్ నాయుడుపై నమోదైన ఈ కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరో వైపు బాలికకు న్యాయం చేయని పక్షంలో సహించేది లేదని మహిళలు హెచ్చరిస్తున్నారు.


